Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాము ఒక కుక్కపిల్లను పెంచసాగాడు. అతడు బడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత దానితోనే సమయాన్ని గడిపేవాడు. ఆ కుక్క పిల్ల అంటే రాముకు పంచ ప్రాణాలు.
ఒకరోజు అతడు బడి నుండి ఇంటికి వచ్చేసరికి ఆ కుక్క పిల్ల లేదు. అది తప్పిపోయిందని తెలిసి రాము దానిపై దిగులుతో అన్నం తినడం మానేశాడు. అతని తల్లిదండ్రులు ఎంత వెతికించినా, ఆ కుక్క పిల్ల దొరకలేదు. రాము బడికి వెళ్లడం కూడా మానివేశాడు. ఎప్పుడూ దాని గురించే ఆలోచిస్తూ చాలా దిగులుతో ఉండేవాడు. అతని అమ్మ మరొక కుక్కపిల్లను కొనిస్తామని చెప్పినా అతడు వినలేదు. తనకు అదే కుక్కపిల్ల కావాలని మారాం చేయసాగాడు. తండ్రి కూడా ''ఒరేరు! అది ఇన్ని రోజులు మన ఇంటికి రాలేదంటే ఎవరైనా తీసుకుని వెళ్లవచ్చు. కనిపించని ఆ కుక్కపిల్లను ఎలా తీసుకుని వచ్చేది రా!'' అని ఎంతో నచ్చజెప్ప టానికి ప్రయత్నించాడు. కానీ రాము వినలేదు.
ఇలా నాలుగు రోజులు గడిచాయి. ఆ కుక్కపిల్ల జాడలేదు. ఇంతలో రాము మేనమామ జగన్నాథం ఒక కుక్క పిల్లను పట్టణంలో కొని తీసుకుని వచ్చాడు. ఆ కుక్కపిల్ల చాలా అందంగా ఉంది. అతనికి రాము తల్లి తమ కుక్క పిల్ల పోయిన సంగతి, అన్నం మానేసిన సంగతి అంతా చెప్పింది. అది విన్న జగన్నాథం ''ఒరేరు రామూ! నీవు దిగులుగా కూర్చుంటే నీ కుక్కపిల్ల వస్తుందా! దేనిపైనా అతి ప్రేమను పెట్టుకోకూడదు. నీకు ఒక మంచి కథను చెబుతాను, వింటావా! కానీ ఒక షరతు. నీవు మారాం చేయకుండా అన్నం తినాలి. అలా అయితేనే నేను నీకు మంచి కథను చెబుతాను. అందులో ఒక్క కుక్కపిల్లనే కాకుండా అన్నీ జంతువులు ఉంటాయిరా!'' అని అన్నాడు. ఇంతలో జగన్నాథం కుక్కపిల్ల ''రామూ, రామూ'' అని పిలవసాగింది. రాము సంతోషంగా దానిని దగ్గరకు తీసుకొని ''సరే! మామయ్యా! కథను చెప్పు వింటా! కానీ నాది ఒక షరతు. మా కుక్కపిల్ల దొరికెంతవరకు మీ కుక్కపిల్లను నాకు ఇవ్వాలి'' అని అన్నాడు. సరేనన్నాడు మామయ్య. తర్వాత అతని మామయ్య అతనికి అనేక జంతువులు ఉన్న కథను చెప్పాడు. ''ఒరేరు! ఇప్పుడు అమ్మానాన్నలను బాధపెట్టకుండా అన్నం తిను. సరేనా!'' అని చెప్పి కుక్క పిల్లను ఇక్కడే వదిలిపెట్టి వెళ్లిపోయాడు.
రాము తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. ఈ కుక్క పిల్లను చూసిన రాము తన పాత కుక్కపిల్లను మర్చిపోయాడు. ఈలోగా రాము మిత్రుడు రవి తప్పిపోయిన రాము కుక్కపిల్లను తీసుకొని వచ్చాడు. రాము ఆశ్చర్యపోయి ''ఇది నీకు ఎక్కడ దొరికింది. ఇది తప్పిపోయిందని అనుకున్నామే!.. అమ్మా! మన కుక్కపిల్ల వచ్చింది'' అంటూ సంతోషంతో తల్లిని పిలిచాడు. రవి రాముతో ''ఒరేరు! మేము అత్యవసరంగా వారం రోజులు మా ఊరికి వెళ్ళాము. నీ కుక్కపిల్ల మా ఇంటికి వచ్చిన ఉన్న సంగతే మేము గమనించకుండా ఆ గదికి పొరపాటున తాళం వేసి వెళ్ళాము. మేము నిన్న వచ్చి ఆ గది తలుపు తీసేసరికి 'పాపం ! ఇదిగో! ఇలా తిండిలేక ఎంతో బక్కచిక్కి పడి ఉంది. మా ఇంట్లో అన్నం తినిపించి ఇక్కడికి తీసుకొని వచ్చాను. నన్ను క్షమించరా !'' అని అన్నాడు .
ఆ కుక్క పిల్లను రాము దగ్గరకు తీసుకొని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. ''ఒరేరు! నాకు మరొక కుక్క పిల్ల దొరికింది'' అంటూ తన మామయ్య జగన్నాథం కుక్క పిల్లను రవికి చూపించాడు. ''దీన్ని మామయ్యకి తిరిగి ఇచ్చేద్దాం. ఏమంటావు?'' అని తల్లి అన్నది. ''అలాగేనమ్మా!'' అని అన్నాడు. ''ఒకవేళ మళ్లీ కుక్కపిల్ల తప్పిపోయిందనుకో! అప్పుడు ఎలాగురా'' అని అంది తల్లి. ''అప్పుడు ప్రత్యామ్నాయంగా కథలు ఉన్నాయిగా! ఇక నేను కుక్క పిల్ల లేకున్నా మంచి మంచి కథలు మీ ద్వారా వింటూ కాలక్షేపం చేస్తానమ్మా! మామయ్య నాకు కథలు చెప్పి మంచి పని చేశాడు'' అని అన్నాడు. రాములో కలిగిన మార్పును చూసి రవితో పాటు అతని తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషించారు.
- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య,
9908554535