Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ధనుష్ తెలివైన విద్యార్థి. కానీ పాఠశాలకు హాజరు అయ్యేవాడు కాదు. వచ్చినా ఆలస్యంగా వచ్చేవాడు. ఆలస్యంగా వచ్చే విద్యార్థులకు శిక్షగా చుట్టూ ఉన్న చెట్లకు నీళ్లు పోయడం, పాదులు తవ్వడం లాంటివి చేయించే వారు ఉపాధ్యాయులు. ఇవి చేయడం కంటే పాఠశాలకు సమయానికి అందరూ వచ్చేవారు. ధనుష్ మాత్రం ఆలస్యంగా వచ్చి చెట్లను సంరక్షించేవాడు. ఇది అతనికి అలవాటు. పాఠశాలలో పచ్చని చెట్లు, రంగురంగుల పూల చెట్లను పెంచడంలో ధనుష్‌దే ముఖ్యమైన పాత్ర.
ధనుష్ చెట్లను రకరకాల డిజైన్లతో కత్తిరించేవాడు. అది పాఠశాలకు అందాన్ని తెచ్చి పెట్టింది. పాఠశాలలో అడుగిడితే అది ఒక నందనవనం లాగా కానవస్తుంది. ధనుష్ కంటికి రెప్పలా పాఠశాల ఆవరణలో చెట్లను చూసుకునేవాడు. ఊరికి ప్రారంభంలోనున్న పాఠశాల పచ్చని చెట్లు చూపరులను ఆకట్టుకునేది.
ఒక రోజు జిల్లా విద్యాధికారి పర్యవేక్షణలో భాగంగా పాఠశాలకు వచ్చాడు. రమ్యమైన, పచ్చని చెట్ల మధ్య ఉన్న పాఠశాలను చూసి ఆశ్చర్యపోయాడు. ప్రధానోపాధ్యాయులను కలిసి విద్యార్థులతో వెంటనే సమావేశం ఏర్పాటు చేయమని ఆదేశించాడు. ప్రధానోపాధ్యాయులుకు ఏమి అర్థం కాలేదు. విద్యార్థులందరినీ సమావేశానికి పిలిచాడు.
విద్యాధికారి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పాఠశాల ఇంత అందంగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను అభినందించాడు. అందుకు ధనుషే కారణమని జరిగిందంతా ప్రధానోపాధ్యాయులు చెప్పాడు. ధనుష్‌ను వేదిక మీదకు రావాలని చప్పట్ల మధ్య ఆహ్వానించాడు. ధనుష్‌ను సత్కరించి వయసులో చిన్నవాడివైనా దూరాలోచనతో పచ్చని చెట్లను పెంచి పాఠశాలను అందంగా తీర్చిదిద్దినందుకు అభినందనలు తెలియజేశాడు. ధనుష్ చాలా సంతోషించాడు
నీతి: చెట్లు మన ప్రగతికి మెట్లు
- యాడవరం చంద్రకాంత్‌గౌడ్
9441762105