Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎండాకాలం వస్తుంది.. పోతుంది. కానీ అడవి జంతువుల సమస్యలు తీరటం లేదు. మగరాజుగా నన్ను నమ్ముకున్న పాపానికి అవి అడవిలో ఎండకు ఎండుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పేరుకే పచ్చని అడవి, కానీ ఎటుచూసినా నేలపై ఎండ పరుచుకుని ఉన్నట్లు ఉంటుంది. ఒక్కోసారి ఉష్ణోగ్రతలు ఎక్కువై జంతువుల ప్రాణాలు కూడా పోతుంటాయి. దానికితోడు యథేచ్ఛగా చెట్ల నరికివేతతో నీడ కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. నేనేం చేస్తున్నాను ? హాయిగా గుహలో జీవిస్తున్నాను. రాజు అన్న వాడు తన సుఖం కోరుకోడు. తన వారి కోసం సర్వస్వం ధారపోస్తాడు.. అవసరమైతే ప్రాణాలు ఇస్తాడు. నేను మాత్రం.. ఇలా గుహలో సర్వసుఖాలు అనుభవిస్తున్నాను. ఇవన్నీ నేను సంపాదించుకున్నవి కావు. అడవి జంతువులు నా మీద నమ్మకంతో... అన్నివేళలా అండగా నిలబడతాననే ఆశతో మగరాజు పదవికి నన్ను ఎన్నుకున్నారు. ఇప్పటికైనా రానున్న ఎండాకాలంలో జంతువులకు అండగా నిలబడాలి. వాటికి ఎండ నుంచి ఉపశమనం కలిగించాలి. ఈసారి ఏ ఒక్క జంతువూ ఎండకు అల్లాడకుండా చర్యలు తీసుకోవాలి... తీసుకుంటాను అనుకుంటూ, మంత్రి ఏనుగును తక్షణం రమ్మనమని కబురు పంపింది.
గుహకు చేరుకున్న ఏనుగు, మగరాజా ! మీరు పిలవడానికి కారణం ఏంటని ప్రశ్నించింది. సింహం ఏనుగును ఉద్దేశించి ప్రతి సంవత్సరం భయంకరమైన ఎండల వేడిని జంతువులు తట్టుకోలేకపోతున్నాయి. ఒక్కోసారి ప్రాణాలు కోల్పోతున్నాయి. కలప దొంగల కారణంగా చెట్ల సంఖ్య తగ్గిపోతుంది. చెట్ల నీడ కరువైంది. జంతువులు ఎండ బారిన పడకుండా చర్యలు తీసుకోవాలి. ఈ సమస్యకు పరిష్కార మార్గం కావాలన్నది.
చిత్తం మగరాజా ! మీ ఆదేశం ప్రకారం రెండు రోజుల్లో సమస్య పరిష్కారానికి కషి చేస్తా అన్నది ఏనుగు. గుహ బయటకు వచ్చిన మంత్రి ఏనుగు పక్షులతో సమావేశమైంది. తమను పిలిచిన కారణం అడిగాయి పక్షులు. దానికి ఏనుగు మాట్లాడుతూ అడవిలో ఎండలు మండిపోతున్నాయి. మన జంతు మిత్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మీరు కూడా ఎండదెబ్బకు బెంబేలెత్తుతున్నారు. మనలాగే పక్క గ్రామాల ప్రజలు కూడా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అల్లాడుతుంటారు. మీరు గ్రామాలకు వెళ్లి ప్రజలు ఎండ నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో పరిశీలించి నాకు చెప్పాలి అన్నది ఏనుగు. పక్షుల్లో కాకులు, రామ చిలుకలు మంత్రి ఆదేశం ప్రకారం పక్క గ్రామానికి బయలుదేరాయి. అక్కడకు చేరుకున్న వాటికి ప్రజలను ఎండలు బాధిస్తున్నా రోడ్ల మీద తిరగటం ఆశ్చర్యం కలిగించింది. అయితే వారంతా తల మీద ఎండ పడకుండా కర్రకు నల్లటి బట్ట తగిలించి చేతితో పట్టుకుని రక్షణ పొందుతున్నారు. ఒకరిద్దరు మాటల ద్వారా దాని పేరు గొడుగు అని తెలుసుకున్నాయి. ఆలస్యం చేయకుండా అడవికి చేరుకుని మంత్రి ఏనుగును కలుసుకున్నాయి. ప్రజలు ఎండ నుంచి తప్పించు కునేందుకు గొడుగులు వాడుతున్నారని వివరించాయి. గొడుగులు అంటే ఏమిటి? అని ప్రశ్నించింది ఏనుగు. ఎండ నుంచి రక్షణ పొందటానికి ఒక కర్రకు నల్ల బట్ట కట్టి చేత్తో పట్టుకుంటున్నారని వివరించాయి కాకులు, రామచిలుకలు. ఏనుగు ఆలోచనలో పడింది. అడవిలో కర్రలు దొరుకుతాయి కానీ బట్ట దొరకదుగా. ఇంతలో మంత్రికి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ఆకులు ఆహారంగా తినే జంతువులను పిలిచింది. అవి రాగానే మన అడవిలో పెద్దపెద్ద ఆకులు కలిగిన చెట్లను మీరు చూశారా! అని ప్రశ్నించింది. అవి ''చూశాం.. చూశాం'' అన్నాయి. వాటిని మీరు తీసుకురాగలరా ! అని అడిగింది మంత్రి ఏనుగు. ఓ.. ఇప్పుడే తెస్తామంటూ అవి అడవిలోకి పరిగెత్తాయి. ఎలుగుబంటి, పులి, జిరాఫీలను పిలిచి చిన్న చెట్ల కొమ్మలను విరిచి తెమ్మన్నది. ఇంతలో అడవిలోకి వెళ్లిన జంతువులు టేకు, మద్ది, బాదం చెట్ల ఆకులను తెచ్చాయి. అలాగే చెరువులో సంచరించే జలచరాలు తామరాకులను తెచ్చాయి. ఏనుగు జలచరాలను అభినందించింది. అనంతరం పక్షులను పిలిచింది. ఒక్కో పక్షికి మూడునాలుగు ఆకులు ఇచ్చి ముక్కుతో పొడిచి సన్నటి పుల్లలతో ఒకే ఆకుగా కుట్టమని ఆదేశించింది. కుట్టిన ఆకులను ఎలుగుబంటి, పులి, జిరాఫీలు తెచ్చిన సన్నటి కర్రలకు అమర్చారు. పెద్ద ఆకులు బరువుకు పడిపోకుండా ఆకు, కర్రకు మధ్యలో సన్నటి పుల్లలు ఏర్పాటు చేశారు. గొడుగు తయారీ పూర్తికాగానే ఏనుగు మగరాజు వద్దకు వెళ్లి చూపించింది.
మగరాజా! పక్క ఊరి ప్రజలు ఎండలు నుంచి రక్షణ పొందేందుకు గొడుగులు వాడుతున్నారు. అలాగే అడవి జంతువుల రక్షణ కోసం ఆకులతో గొడుగు తయారు చేశామని వివరించింది. సింహం మంత్రి ఏనుగు తెలివితేటలను అభినందించింది. ఎండాకాలం వచ్చేలోగా అన్ని జంతువులకు గొడుగులు తయారుచేసి అందించాలని ఆదేశించింది. అలాగే మగరాజా ! అంటూ ఏనుగు ఆ పనిలో నిమగమైంది. తనను నమ్ముకున్న, రాజుగా ఎన్నుకున్న జంతువులను ఎండబారి నుంచి కాపాడానన్న ఆనందంతో గుహ దారి పట్టింది సింహం.
- తమ్మవరపు వెంకటసాయి సుచిత్ర
9492309100