Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ మధ్యన కొయ్యకు తగిలించిన రాఘవరావు జేబులోని పది రూపాయలు నోటు ప్రతి రోజు మాయమవుతున్నాయి. అనుమానం వచ్చి భార్య పద్మను కేక వేశాడు.'నువ్వు ఏమైనా నా జేబులోని పది రూపాయలు కూరగాయలకు గాని దేనికైనా తీసుకున్నవా'' అన్నాడు.
''లేదండి'' అంది పద్మ.
ఎవరు తీసుంటారు అనుకుని వరండాలో సిగరెట్ తాగుతున్న నాన్నను అడుగుదామని ఊరుకున్నాడు.ఏమైనా చింటూ గాడు తీశాడా అనుకుని వాడు స్కూల్ నుంచి రాగానే ''చింటూ నువ్వు నా జేబులోని పది రూపాయలు ఏమైనా తీశావా'' అని అడిగాడు.
'' లేదు నాన్న నేను తీయలేదు, అయినా నా కిడ్డి బ్యాంక్ లోనే బోలెడు డబ్బులు ఉన్నాయి. అవసరం అయితే తీసుకుంటాను. నీ జేబులోని డబ్బులు నేను తీయలేదు. దొంగతనం మహా పాపం నాన్న'' అన్నాడు.
''మిరే ఎక్కడైనా ఇచ్చారేమో అయినా పది రూపాయలకు అంత హైరానా పడుతున్నారు'' అని అడిగింది టీ తెస్తూ.
''ఈరోజు పది రూపాయలు రేపు ఎంతయినా పోవచ్చు'' అని రాఘవరావు బయటకు నడిచాడు. మరుసటి రోజు కూడా జేబులోని పది రూపాయలు పోయాయి. కొయ్యకు తగిలించిన అంగీ జేబులోని డబ్బులు ఎవరు తీసుంటారు అనుకున్నాడు. రాఘవరావుకు అర్ధం కాలేదు ఎవరు తీస్తున్నారో. రేపు ఎలాగైనా దొంగను పట్టుకోవాలని ఇంటి పట్టునే ఉన్నాడు. ఆ రోజు డబ్బులు ఏవీ పోలేదు. సరేలే ఈరోజు పోలేదు అనుకుని తృప్తి పడ్డాడు. మరుసటి రోజు తెల్ల అంగీ కొయ్యకు తగిలించి అందులో పది రూపాయలు నోట్ల కట్ట పెట్టాడు.
పద్మకు '' నేను ఆఫీసు వెళుతున్న ఈరోజు రావడం ఆలస్యం అవుతుంది మీరు భోజనం చేయండి'' అన్నాడు.
''సరేనండి నేను కూడా స్కూలుకు వెళ్ళి చింటూకు కారియర్ ఇవ్వాలి'' అని పనిలో పడి పోయింది. రాఘవరావు ఆఫీసుకు వెళ్ళాడు. పద్మ స్కూల్కు వెళ్ళింది. ఇంటిలో రాఘవరావు నాన్న ఒక్కరే ఉన్నారు.
ముసలాయన మెల్లగా తలుపు తీసి కొయ్యకు
ఉన్న జేబులోనించి పది రూపాయలు నోటు మాత్రమే తీసుకుని మెల్లగా జారుకున్నారు. ఇదంతా ఒక ప్రక్క కిటికీ లోంచి రాఘవరావు చూశాడు. అది చూడగానే ఇదంతా నాన్న చేస్తున్నాడా అనుకుని గమ్మున ఉన్నాడు. పది రూపాయలు తీసుకున్న ముసలాయన వాటితో ఒక సిగరెట్, బిస్కెట్ ప్యాకెట్ కొనుకున్నాడు.అది చూశాడు రాఘవరావు.
నాన్న అక్కర అంతేనన్న మాట. జేబులో నోట్ల కట్ట ఉండగా నాన్న పది రూపాయలు మాత్రమే తీసుకోవడం ఆశ్చర్యం అని పించింది. నాన్న అవసరం ఏమిటో నేను తెలుసుకోక పోవడం రాఘవరావుకు సిగ్గు అనిపించింది. ఇక రోజు ఆఫీస్ నుంచి వస్తూ ఒక సిగరెట్, బిస్కెట్స్ తెచ్చి ఇచ్చే వాడు. ముసలాయన వాటిని చూసి ఎంతో సంతృప్తి పడ్డాడు. ఇక ఆ రోజు నుంచి ఇంట్లో డబ్బులు పోలేదు.
- కనుమ ఎల్లారెడ్డి