Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనగనగా చంద్రగిరి అనే గ్రామంలో ఐలయ్య అనే ఒక జాలరి నివసిస్తుండేవాడు. అతను రోజూ చెరువుకు వెళ్ళి చేపలు పట్టి వాటిని గ్రామాల్లో అమ్మేసి జీవనం చేసుకునేవాడు ''ఐలయ్య! ఆ చేపలు పట్టి ఊరూరు తిరిగి కష్టపడే బదులు ఏదైనా పని చేయవచ్చు కదా'' అని కొందరు అంటుండేవారు ''ఇదైతే సులభంగాను లాభదాయకంగాను వుంటుంది'' అనేవాడు ఐలయ్య ''మనిషన్నాక మరీ అంత సుఖం కోరుకోరాదు కాస్తైనా రెక్కలు వంచి పని చేయాలి'' అని కొందరంటే ''బాగా చెప్పావులే వల వేసి హాయిగా చెట్టు కింద పడుకుంటే బోలెడు చేపలు పడతాయి సుఖానికి సుఖం లాభానికి లాభం'' అంటూ ఎదురు సమాధానం ఇచ్చేవాడు. ''ఐలయ్య ఒట్టి పొగరుబోతు ఎవరి మాట వినడు ఎవర్ని లెక్కచేయడు'' అని ఊళ్ళో వాళ్ళు అనుకునేవారు.
రోజూ చేపల వేటకు సమీపంలోని చెరువులోకి వెళ్ళేవాడు. ఐలయ్య వస్తున్నాడంటే చాలు చేపలన్నీ భయపడేవి అన్నీ దాక్కునేవి. ఐనా కూడా ఐలయ్య వలకు వందల సంఖ్యలో చేపలు చిక్కిపోయేవి. ఒకరోజు వల విసిరి గట్టున కూర్చున్నాడు ఐలయ్య ఒక చేప బయటికి తొంగి చూసి '' రోజూ ఇలా మమ్మల్ని పట్టుకెళ్ళి చంపేసి కూర వండుకుని తినడం మీకు న్యాయంగా వుందా'' అని అడిగింది. '' మీరు పులుసుకు తప్ప దేనికి పనికిరారు'' అంటూ హేళనగా అన్నాడు. ''మావి కూడా మీలాంటి ప్రాణాలే కదా మమ్మల్ని హింసించడం మీకు ధర్మమేనా'' అంది చేప. ''ధర్మాధర్మాల గురించి నాకు తెలీదు నాకు తెలిసిందల్లా వ్యాపారం మాత్రమే'' అన్నాడు ఐలయ్య ''ఒక జీవి ప్రాణం ఉన్నఫళంగా తీసేసి మీరు కడుపు నింపుకోవడం నేరం కాదా'' అని అడిగింది చేప''' ఎక్కువ మాట్లాడకు నీకు బ్రతకాలని వుంటే ఇక్కన్నుంచి వెళ్ళిపో'' అంటూ కోపగించు కున్నాడు ఐలయ్య.
చేప నీటిలోకి మునిగిపోయింది, చేపలన్నీ ఒకచోట చేరాయి ''మనం ఇలాగే వుంటే ఆ వేటగాడు మనల్ని బ్రతకనివ్వడు ఏదైనా ఉపాయం ఆలోచించాలి'' అనుకుని ఎండ్రకాయని కలుస్తాయి. తమ బాధను దానితో చెప్పుకుంటాయి''. ఎలాగైనా సరే ఆ వేటగాడి వలను నీ పదునైన గోళ్లుతో తెంపేయాలి అలా రోజూ చేస్తే వాడు ఇక్కడికి రాడు'' అని సలహా ఇచ్చింది చేప'' ఆ వేటగాడి వలన నాకేం ప్రమాదం నాకు హాని చేయనివారిని నేను బాధ పెట్టలేను'' అంటూ తప్పుకుంది ఎండ్రకాయ.
చేపలన్నీ బాధగా వెనక్కి వస్తుంటే కప్ప చూసింది విషయం తెలుసుకుని వాటిని పిలిచి ''మీకు ఆ వేటగాడి నుంచి విముక్తి కావాలంటే మొసలి దగ్గరికి వెళ్లి మీ బాధను చెప్పుకోండి పరిష్కారం దొరుకుతుంది'' అనగానే మంచి సలహా ఇచ్చిన కప్పకు కృతజ్ఞతలు చెప్పి మొసలిని సంప్రదించి తన ఘొడును చెప్పుకున్నాయి చేపలు. ''నాకు అపకారం చేయని వాళ్ళ జోలికి నేను వెళ్ళను పైగా నాకు ఆకలిగా లేదు ఆ వల తెంపేసి వేటగాడి కడుపు కొట్టలేను నన్ను క్షమించండి'' అంటూ తప్పుకుంది మొసలి. చేసేది లేక చేపలన్నీ ఆందోళనలో మునిగిపోయాయి ''ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు ఎవరికి వారు సంరక్షించుకోవాలి తప్ప మరొకరిపై ఆధారపడకూడదని అర్థమైంది ఏదైనా ఉపాయం ఆలోచించాలి'' అంది చేప. అంతలోనే ఒక బుల్లి చేప ముందుకొచ్చి ''ఆ వేటగాడి బాధ నుంచి నేను తప్పిస్తాను'' అంది.. చేపలన్నీ ఆశ్చర్యబోయాయి అవి నమ్మలేదు కానీ ఎవరి ఆత్మ విశ్వాసం వారికి వుంటుందని అన్నీ సరే అని ఒప్పుకున్నాయి.
ఒకరోజు ఐలయ్య వల విసిరి బాధగా కూర్చుని వుండడం బుల్లి చేప కంటబడింది ''ఎందుకు బాధ పడుతున్నారు'' అని ఐలయ్యను అడిగింది. ''మూడు రోజుల నుంచి చాలా తక్కువ చేపలు పడుతున్నాయి వ్యాపారం తగ్గింది.'' అన్నాడతను ''అయ్యో అంతేనా వేసిన చోటే వల వేస్తే ఎలా పడతాయి నేను ఒక మార్గం చూపిస్తాను అక్కడ వల వేసావనుకో బోలెడు చేపలు పడతాయి నీ కరువు తీరిపోతుంది'' అంది బుల్లి చేప ''ఎక్కడ చూపించు'' అని ఆత్రంగా అడిగేపాటికి ''నన్ను అనుసరించు'' అంటూ అది నీటిలో వెళుతుంటే ఐలయ్య గట్టున నడుస్తూ దానిని అనుసరించాడు. ఒక పెద్ద బండపైన నీళ్లు వున్నాయి చుట్టూ చెట్లతో కప్పబడి వుంది ''అదిగో అక్కడ దిగి వల విసురు నీ పంట పండుతుంది'' అని ఆశ కల్పించింది. ఐలయ్యలో అత్యాశతో కూడిన ఆనందం పెరిగిపోయింది జోరుగా బండపైన కాలు పెట్టాడు అడుగున పాచి దట్టంగా పేరుకుని వుండడంతో కాలు జారి పడిపోయాడు. కాలు విరిగింది నడవలేక బాధ పడుతూ గట్టుకు చేరుకున్నాడు.
బుల్లి చేప గట్టిగా నవ్వేసింది ''ఒకరిని హింసించి ఆనందపడాలని చూస్తే ఇలాగే జరుగుతుంది. బ్రతుక్కోవడానికి మార్గం వున్న కూడా సుఖానికి అలవాటు పడి ఇంకొకరిపై ఆధార పడాలనుకుంటే ఇలాగే శాస్తి జరుగుతుంది'' అంటూ బుల్లి చేప లోపలికి జారుకుంది. చేప చెప్పింది నిజమే కదాని పశ్చాత్తాపం పడుతూ వలను అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు ఐలయ్య. చేపలన్నీ ఆనందించాయి బుల్లి చేప తెలివికి మెచ్చుకున్నాయి.
- నరెద్దుల రాజారెడ్డి, 9666016636