Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రంగాపురం గ్రామంలో కనకయ్య, సోమయ్య, శివయ్య అనే ముగ్గురు మిత్రులు ఉండేవారు. వారు ఒకసారి పొరుగు గ్రామంలోని సంతకు వెళ్లారు. అక్కడ పని పూర్తి చేసుకుని వారు ఒక బంగారు వర్తకుని దగ్గరకు వెళ్లి తలా ఒక బంగారు గాజును కొన్నారు. ఆ గ్రామం నుండి తమ గ్రామానికి వెళ్లాలంటే కాలి నడకన అడవి బాట గుండా వెళ్లాల్సిందే తప్ప వేరే మార్గం లేదు. ఆ అడవిలో క్రూరమగాల భయంతో పాటు దొంగల భయం కూడా ఉండేది.
వారు ఆ గాజులను కొన్న తర్వాత, దొంగల బారిన పడకుండా వాటిని తమ గ్రామానికి ఎలా తీసుకొని వెళ్లాలో అర్థం కాక విచారం చేశారు. కనకయ్య తలపైన వెంట్రుకలు బాగా ఉండడంతో అతడు తన వెంట్రుకలను కొప్పుగా ముడిచేవాడు. అతనికి ఒక ఆలోచన వచ్చి ''ఒరేరు! మీ ఇద్దరి గాజులు నాకు ఇవ్వండి. నేను నా కొప్పులో దాస్తాను. అందువలన దొంగలు కనిపెట్టలేరు. వారికి అనుమానం కూడా రాదు. మన ఊరి పొలిమేర వద్దకు వెళ్లగానే మీ గాజులు మీకు అప్పగిస్తాను. ఎలా ఉంది నా ఉపాయం?'' అని ప్రశ్నించాడు. మిత్రులు ఇద్దరు సంతోషించి సరేనన్నారు.
వారు తమ గ్రామానికి ప్రయాణం మొదలుపెట్టారు. ఊహించినట్టే కొద్దిదూరం వెళ్లగానే దొంగలు అటకాయించారు. కనకయ్య, శివయ్యలను వారు ఒక్కొక్కరిని ప్రశ్నించి వారి వద్ద మొత్తం వెతికారు. కాని వారికి వారి వద్ద ఏమీ దొరకలేదు. సోమయ్యను వెతికారు. అతని వద్ద మూడు బంగారు గాజులు వారికి దొరికాయి. అవి తీసుకుని వారు వెళ్ళిపోయారు. వారు వెళ్లిన పిదప కనకయ్య ఆశ్చర్యపోయి ''అవునూ! సోమయ్యా! ఆ గాజులను నా వెంట్రుకల కొప్పులో దాచాను కదా! అవి నీ దగ్గరికి ఎలా వచ్చాయి?'' అని ప్రశ్నించాడు. అప్పుడు సోమయ్య నవ్వి ''మిత్రమా! మన గాజులు నీ కొప్పులోనే క్షేమంగా ఉన్నాయి. నేను వారికి ఇచ్చినవి నకిలీ గాజులు. ఇలాంటి ప్రమాదాన్ని నేను ముందే ఊహించి, వీటిని మీకు తెలియకుండా కొని పెట్టుకున్నాను.'' అని అన్నాడు. మిత్రుని ముందు జాగ్రత్తకు మిగతా ఇద్దరూ సంతోషించారు.
ఆనందంతో ఊరి పొలిమేర వద్దకు చేరుకున్నారు. అప్పుడు కనకయ్య గాజుల కొరకు వెతికాడు. అవి అతని కొప్పులో లేవు. అతడు ఆశ్చర్యపోయి ''అయ్యో! దొంగలు వెళ్లిన తర్వాత కూడా నేను కొప్పులో చేయిపెట్టి తడిమి చూసుకున్నాను. అప్పుడు గాజులు ఉన్నాయే! మరి ఇప్పుడు ఎలా మాయమైనట్టు? ఒకవేళ సోమయ్యనే నా వద్ద గల ఆ గాజులు కింద పడితే వారికి ఇచ్చాడు కాబోలు!'' అన్న అనుమానాన్ని వ్యక్తం చేశాడు. వెంటనే సోమయ్యకు కోపం వచ్చి ''వాటిని కాపాడుకునేందుకే ఈ నకిలీ గాజులను నేను మీకు తెలియకుండా స్వయంగా కొనితెచ్చానని మీకు ముందే చెప్పాను కదా!'' అని అన్నాడు.
వెంటనే శివయ్య నవ్వి ''మిత్రులారా! ఆ అసలు బంగారు గాజులు నా వద్దనే భద్రంగా ఉన్నాయి. ఇవిగో!'' అని అసలైన బంగారు గాజులను చూపాడు. అవి చూసి కనకయ్య ఆశ్చర్యపోయి ''అవునూ! నా కొప్పులో ఉన్న ఆ గాజులు నీ వద్దకు ఎలా వచ్చాయి? చాలా ఆశ్చర్యంగా ఉందే! మరి నీ వద్ద దొంగలు వెతికినప్పుడు వీటిని వారు గమనించలేదా'' అని అడిగాడు.
శివయ్య నవ్వుతూ ''దొంగలు వెళ్లిపోయిన తర్వాత నీవు గాజుల కొరకు నీ కొప్పును చేతితో తడిమావు. అప్పుడు ఆ కొప్పు నుండి అవి జారి దారిలో కింద పడ్డాయి. మీరు వాటిని గమనించకుండా మాట్లాడుతూ వస్తున్నారు. వెనుక నుండి క్రూర మగాల వల్ల ఏదైనా ప్రమాదం వస్తుందేమోనని గమనిస్తూ వస్తున్నాను. అలా చూస్తున్న క్రమంలోనే గాజులు కింద పడడం గమనించి, తీసుకొని నా జేబులో వేసుకున్నాను! అదీ సంగతి !''అని అన్నాడు.
ఆ మాటలకు సంతోషించిన మిగతా ఇద్దరూ ''నీవు అలా వెనుకకు తిరిగి గమనించకుండా ఉంటే ఆ గాజులు మనకు లభించేవి కావు. నీవు అలా చేయడం వల్లనే మన బంగారు గాజులు మనకు దక్కాయి'' అని అన్నారు. అందుకే ఆపద సమయంలో భయపడకుండా తెలివి తేటలు ప్రదర్శించాలంటారు పెద్దలు.
- సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య
9908554535