Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎలుగుబంటు రాజుగా అడవిలోని జంతువులను కన్న బిడ్డలుగా చూసుకొంటూ మంచి పేరు తెచ్చుకొంది. ఎలుగు బంటుకు వయసు మళ్లడంతో కొత్త రాజు ఎన్నిక చేయాలనీ నిర్ణయించుకొని ఎన్నికలను నిర్వహించమని మంత్రి జింకకు సలహా ఇచ్చింది.
కొన్ని జంతువులు కుందేలును నిలబెట్టాయి. కుందేలు మీద అన్ని జంతువులకు మంచి అభిప్రాయం వుంది. దాని పాలనలో అన్ని జంతువులు క్షేమంగా ఉంటాయన్న అభిప్రాయానికి వచ్చాయి. అనుకోని విధంగా కుందేలుకు పోటీగా గుంటనక్క నిలబడుతున్నట్లు ప్రకటించింది.
''మహారాజా, ఆ గుంటనక్క గెలవడానికి ఎన్ని కుతంత్రాలు పన్నుతుందో చూడండ'' అంది మంత్రి జింక.
ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ''మహారాజా, నేనూహించిన విధంగానే గుంటనక్క చాలా జంతువులను తన వైపు తిప్పుకొంది. ఈ సారి కుందేలు గెలవడానికి అవకాశమే లేద'' అంది మంత్రి జింక.
''కుందేలు గెలవదా... ఎలా చెబుతున్నావు''
''మహారాజా, ఆ గుంటనక్క అడవిలోని జంతులన్నింటికీ ఆహారం ఉచితంగా ఇస్తూ తనను గెలిపించమని వేడుకొంటోంది''
''మాంసాహార జంతువులకు ఎలా మాంసం ఇస్తోంది. మన అడవిలో జంతువులను చంపడం ఎప్పుడో నిషేధించాం కదా''.
''ఆ నక్క తెలివైనది పక్క అడవికి రాజుగా ఉన్న ఏనుగుతో ఏదో ఒప్పందం కుదుర్చుకొన్నట్లుంది. ఈ ఎన్నికలు ముగిసేంత వరకు ఇక్కడి జంతువులకు కావలసిన మాంసం, పండ్లు కాయగూరలు పంపుతోంది. మరో మూడు పౌర్ణమిలు గడచిన తరువాత అక్కడ ఎన్నికలు జరుగనున్నాయి. అప్పుడు ఆ ఏనుగు మరలా నిలబడాలన్న ఉద్దేశం వుంది. ఆ ఏనుగుకు పదవి పిచ్చి ఎక్కువగా వుంది. ఆ ఎన్నికలకు మన అడవిలోని జంతువులను చంపి అక్కడి జంతువులకు పంపడానికి ఈ గుంటనక్క అంగీకరించినట్లు మన వేగుల ద్వారా తెలుసుకున్నాను''
''అయ్యో నా అడవి జంతువులను కాపాడాలి. ఈ ఆపద నుంచి నీవే ఎలాగైనా కాపాడాలి మంత్రి'' అంటూ కన్నీళ్లతో వేడుకొంది.
ఎన్నికలకు ఒక రోజు ముందు నక్క ఏర్పాటు చేసిన విందుకు ఊహించని విధంగా అడవి జంతువులు మరింత ఎక్కువగా వచ్చాయి. నక్క ఇచ్చిన ఆహారం తింటున్న జంతువులు అన్నీ 'ఎప్పటికీ మన అడవికి గుంటనక్క మహారాజు' అంటూ అరవసాగాయి. ఆ గుంపులో బాగా తిన్న ఒక ఏనుగు ఒక్కసారిగా పిచ్చిగా అరుస్తూ అటూ ఇటూ తిరగడంతో జంతువులన్నీ తలా ఒక దిక్కుకు పారిపోసాగాయి.
''ఎన్నికలలో గెలుపొందాలని పిచ్చి ఏనుగని తెలిసినా విందుకు పిలిచింది. పెద్ద తప్పు అయింది అనుకొంటూ'' గుంట నక్క పరుగు తీసింది.
అడవి జంతువులను కాపాడటం కోసం మంత్రి జింక చెప్పిన విధంగా కొన్ని రోజులుగా పిచ్చి ఏనుగులా నటించిన విషయం ఎవరికీ తెలీదు. పారిపోతున్న గుంటనక్కను వెంబడించి పట్టుకొని చంపి ఎవరికీ తెలీకుండా నీటి గుంటలో పారవేసింది.
ఎన్నికల సమయాన గుంటనక్క కనబడకపోవడంతో కుందేలు ఏకగ్రీవంగా ఎన్నికైంది.
- ఓట్ర ప్రకాష్ రావు, 09787446026