Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వీపు మీద చిన్న పుండు రావడంతో సున్నిత మనస్కుడైన రాజు బెంబేలెత్తిపోయాడు. నొప్పి కొంచెమే అయినా తట్టుకోలేక కన్నీళ్లు పెట్టాడు. 'నాకు ఏమవుతుందో' అని ఆలోచనలలో పడ్డాడు. రాజు భయపడడం చూసి ఆస్థానంలోని వారంతా బాధపడ్డారు. రాజ్యంలోని ప్రధాన వైద్యులంతా వచ్చి వైద్యసేవలు అందించారు. పొరుగు రాజ్యాల నుంచి ఖరీదైన మందులు తెచ్చి చికిత్స ప్రారంభించారు. అయినా తగ్గలేదు. జరగరానిది జరుగుతుందేమో నని భయపడిన రాజు ఎక్కడికీ పోకుండా రాజమందిరంలోనే ఒంటరిగా ఉండిపోయాడు.
రాజు ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించే ప్రమాదం ఉందని మంత్రి గుర్తించాడు. సూర్యోదయ సమయాన కొద్దిసేపు నీటి కాలువ గట్టున నడుద్దామని రాజును ఒత్తిడి చేశాడు. మొదటిలో రాజు ససేమిరా ఒప్పుకోలేదు. ఎన్నోసార్లు ప్రాధేయపడ్డాక ఒకరోజు ఉదయం బయలుదేరాడు. .
కాలువ గట్టున నడుస్తున్న వారికి ఒక రైతు, పొలంలో నారు నాటుతూ ఉండడం కనిపించింది. అతడి వీపు మీద పెద్ద పుండు ఉంది. దురద బాధతో పాటు ఈగలు దాని చుట్టూ 'జురు' మని తిరుగుతున్నాయి. అవేమీ పట్టించుకోకుండా రైతు తన పని తాను చేసుకుపోతున్నాడు. అతడిని చూసిన రాజు ఆశ్చర్యపోయాడు.
మరుసటి రోజు కూడా ఉదయపు నడకకు బయలుదేరారు. నారు నాటుతున్న రైతును ఈగలు మరింత ఇబ్బంది పెడుతున్నట్లుగా కనిపించింది. నాటుతున్న నారును రైతు వీపుకేసి కొట్టి తన పనిలో తాను లీనమయ్యాడు. 'అంత పెద్ద పుండును ఎలా భరిస్తున్నాడో కదా' అని ''రోగమొచ్చిందని బాధగా లేదా'' అని అడిగాడు. ''రోగాలు మనుషులకు కాక మానులకు వస్తాయా. జబ్బు ఉందని ఇంటికాడ కూర్చుంటే జరుగుబాటు అయ్యేది ఎలా? అయినా రోగమనేది పట్టించుకుంటే పెద్దదవుతుందని మా పెద్దాళ్ళు చెప్పినారు'' అని బదులిచ్చాడు.
మూడవరోజు పుండు వద్ద దురద ఎక్కువయ్యింది. తట్టుకోలేని రైతు నారు కట్టను తిప్పించి, వరి వేళ్లకున్న బురద మట్టితో ధబీదబీమని వీపు మీద కొట్టడం కనిపించింది. అప్పుడు కూడా అతని శ్రద్ధ నాటడంపైనే ఉంది. ముక్కు మీద వేలేసుకున్నాడు రాజు.
''మందులేవైనా వాడుతున్నావా, అలాగే వదిలేస్తే నెలల తరబడి నిన్ను ఇబ్బంది పెట్టదా'' అని అడిగాడు. ''
చాన్నాళ్ళు ఉండే దానికి అది ఏమైనా మా చుట్టమా, కొన్నాళ్ళకు అదే పోతుంది, నమ్మితే మట్టి కూడా మందుగా పని చేస్తుందిలే '' అని ధైర్యంగా సమాధానమిచ్చాడు రైతు. 'మందులేవీ వాడకుండా, విశ్రాంతి తీసుకోకుండా ఎలా బాగవుతుందీ' అనుకున్నాడు రాజు.
అదేమిటి మంత్రీ, అంత పెద్ద పుండును అతడు పట్టించుకోవడం లేదేమని అడిగాడు. అందుకు మంత్రి ''రాజా, రోగానికి రాచమర్యాదలు చేస్తే అది తిష్టవేసి కూర్చుంటుంది, నాకు ఏమయ్యింది? నన్ను అది ఏమి చేస్తుందో అని భయపడి పనులేవీ చేయకుండా కూర్చుంటే శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ చురుకుగా పని చేయడం మానేస్తుంది. మన పనులు మనం చేసుకుంటూ చేయాల్సిన వైద్యం చేసుకుంటూ పోతే ఆరోగ్యవంతుల మవుతాము. లేకుంటే శారీరకంగానూ మానసికంగానూ బలహీనమవుతాము'' అని బదులిచ్చాడు.
యదార్థం గ్రహించిన రాజు యధావిధిగా తన పనులు తాను చేసుకుంటూ ఉండిపోయాడు. కొన్ని రోజులకు పుండు మాయమై పోయింది. నడకకు వెళ్ళిన రాజుకు వరి పైరు కాడ రైతు కనిపించాడు. ''పుండు ఏమయ్యింది'' అని అడిగాడు. ''మందుమాకు ఏమీ పెట్టలేదు, ఎట్లా వచ్చిందో అట్లే పోయింది. వరి నారు దెబ్బలకు పారి పోయినట్లుంది'' అని నవ్వుతూ చెప్పాడు. 'నిజమే, మనం భయపడితే రోగం మరింత భయపెడుతుంది, రోగమొచ్చినప్పుడు వైద్యమొకటే కాదు, ధైర్యంగా కూడా ఉండాలి' అని అనుకున్నాడు రాజు.
- ఆర్ సి కృష్ణ స్వామి రాజు