Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఉన్నత చదువు ఉంటేనే మంచి జీతం.. లక్షలు, కోట్లు పెట్టుబడి పెడితేనే సృజనాత్మక వ్యాపారం'.. ఇలాంటి అభిప్రాయం చాలామందికి ఉంటుంది. అది తప్పని నిరూపించారీ ఇద్దరు మిత్రులు. లక్షల జీతం సంపాదించే స్థితిని వదులుకొని తన ఆలోచనలు, తెలివితేటలనే పెట్టుబడిగా మలచి తమతో పాటు మరి కొంత మందికి ఉపాధి కల్పిస్తున్నారిద్దరు యువకులు సత్యవోలు కిరణ్‌కుమార్, సాయి చక్రవర్తి. వారి పరిచయ కథనమే ఈ వారం జోష్.
రోజు రోజుకు కాలం రంగుల్ని పులుముకుంటుంది. మానవ జీవనం డిజిటల్ అద్దాల మీద అడుగులేస్తుంది. ఈ స్మార్ట్ యుగంలో పుస్తకాలు కూడా డిజిటల్ రూపంలోకి వస్తున్నాయి. ఇదొక శుభపరిణామం. పుస్తకాలు చదవడం తగ్గిపోతున్న ఒక స్థితిలో పుస్తకాలు యాప్‌ల ద్వారా అందుబాటులోకి రావడం చాలా గొప్ప విషయం.
సినిమాలు.. స్నేహితులతో బాతాఖానీలు.. క్రికెట్ మ్యాచ్‌లు చూడటం.. వయసులో ఉన్న కుర్రాళ్లకు ఇలాంటి సరదాలు చాలానే ఉంటాయి. కానీ కిరణ్ కు రాయడమే ఓ సరదా, వ్యాపకం, ఇష్టం, అలవాటు, అన్నీ. తను చిన్న వయసులోనే రాయడం మొదలు పెట్టాడు. అప్పటి నుంచి అతగాడి కలం ఆగలేదు. ఏ మాత్రం ఖాళీ దొరికినా రాస్తూనే ఉంటాడు. తనలా రాస్తున్న ఎందరో యువకులకు చేయూత అందిస్తున్నాడు.
పుస్తకం రాయడమంటే మాటలేం కాదు. కథయినా.. కవితైనా.. ఫిక్షన్ అయినా.. నాన్ ఫిక్షన్ అయినా.. ముందు కాన్సెప్టు ఎంచుకోవాలి. ఆలోచిస్తూ.. అందంగా అమరేలా రాయాలి. ఆ పుస్తకాన్ని అచ్చు వేయించాలి. వేసినదాన్ని అందరికీ చేరేలా మార్కెటింగ్ చేయాలి. ఎంత ప్రహసనం? ఒక్కదానికే ఇంత ఉంటే ప్రతి పుస్తకం ఎంత కష్టం. ఆ కష్టాన్ని కూడా తీర్చే పనిని భుజానికి ఎత్తుకున్నది Earhook.
పాఠకులు సాహిత్యాన్ని ఇష్టపడుతున్నారు. చదువుతూ వినడానికి ఆసక్తి చూపిస్తున్న కాలంలో సాహిత్యం కోసం యాప్‌లు, వెబ్సైట్లు పుట్టు కొస్తున్నాయి. దానిలో భాగంగానే EARHOOK యాప్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దాని ద్వారా కొత్తగా సాహిత్యం రాసే వాళ్ళకి చేయూతనిస్తూ, షార్ట్ స్టోరీస్, ఆడియో బుక్స్, ప్రత్యేకమైన కాలమ్స్ ద్వారా అనేక రూపాలను యాప్‌లో భాగస్వామ్యం చేస్తూ కొంత మొత్తంలో ఉపాధి కూడా కల్పిస్తూ తెలుగు సాహిత్యానికి వాళ్ళదైన తోడ్పాటును అందిస్తున్నారు. అసలు ఎందుకు ఈ సాహిత్యాన్ని యాప్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
EARHOOK అనే యాప్ తెలుగులోనే కాకుండా వివిధ భాషల్లో తమిళం, హిందీ, కన్నడం వంటి భాషల్లోకి తీసుకొని రావాలనే ఆలోచనతో ఉన్నారు. ఇప్పటి వరకు యండమూరి, మంజూరి, చంద్రశేఖర్ ఆజాద్, మల్లాది, మధుబాబు వంటి పుస్తకాలను యాప్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనిలో ముఖ్యంగా ఇప్పుడు రాస్తున్న తరానికి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. యాప్‌లో కథల్ని, నవలలను ఆడియో రూపంలోకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దీని ద్వారా మనం ప్రయాణంలో, పనిలో, చదవలేని స్థితిలో కూడా సాహిత్యాన్ని వినడానికి కూడా అవకాశం వుంది. ఆడియో రూపంలోకి తీసుకొచ్చి వాటికి సౌండ్ ఎఫెక్ట్ ఇస్తూ వినసొంపుగా తయారు చేస్తున్నారు.
ఈ ఆలోచన ఎలా వొచ్చింది?
ఒకానొక సందర్భంలో ఇంగ్లీష్ పుస్తకాలను చదువుతూ ఆడియో రూపంలోకి తీసుకురావడం చూశాము. ఆ క్రమంలో తెలుగులో ఇంత సాహిత్యం వుంది. దానిని ఎందుకు ఆడియో రూపంలోకి తీసుకు రాకూడదు అనే ఆలోచనతో తెలుగు సాహిత్యాన్ని ఇష్టాంగ యాప్ ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. తెలుగులో చాలా సాహిత్యం దాగి వుంది. కొన్ని కొన్ని అందుబాటులో లేని పరిస్థితి ఉంది. వాటిని అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతో ఈ పనికి పూనుకున్నాం. దానికోసమే ఈ EARHOOK అనే యాప్‌ని రూపొందించాం.
వర్క్ షాప్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వొచ్చింది?
నిజానికి EARHOOKఅనే యాప్ ఉంది అని తెలియజేయడం మా ప్రధాన విధి. దీనితో పాటుగా సాహిత్యాన్ని ఎక్కువ మంది ఇష్టపడుతున్న వాళ్ళకి చేయూత నివ్వాలనే ఆలోచనతో ఈ వర్క్ షాప్ మొదలెట్టాం. దీనికి చాలా మంది ఆసక్తి చూపించారు. మూడు వర్క్ షాప్‌ల ద్వారా నేర్చుకొని కథలను మాకు అందించిన వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా సంతోషం అనిపించింది.
ఈ యాప్ 2021 అక్టోబర్‌లో దసరా పండుగ సందర్భంలో విడుదల చేశారు. యాప్ ద్వారా బయట వర్క్ షాపులు నిర్వహించి కొత్త రచయిలను తయారు చేస్తున్నారు. దీనిలో అనేక మందిని భాగస్వామ్యం చేస్తూ దాదాపు మూడు వర్క్ షాప్‌లను నిర్వహించారు. దీనికి 'వ్యాఖ్య' అనే టైటిల్‌ను రూపొందించారు. ఈ వర్క్ షాప్‌లో ప్రధానంగా యండమూరి వీరేంద్రనాధ్, పెద్దింటి అశోక్, చంద్రశేఖర్ ఆజాద్, పొత్తూరు విజయలక్ష్మి, ఆజాద్, పసునూరి మురళి కృష్ణ, గీతాంజలి, అయోధ్య మురలి వంటి పెద్ద వాళ్ళు వాళ్ళ వాళ్ళ అనుభవాల్ని కొత్త రచయిత లతో పంచుకున్నారు. దీనిలో భాగం గానే కొందరు కథలు కూడా రాశారు. వాటిలో కథలను కొన్ని ఈ యాప్‌లో రికార్డు చేశారు.
అంతే కాకుండా ఈ యాప్‌ని ఆధారంగా చేసుకొని చాలా కార్యక్రమాలకు పూనుకుంటున్నారు. దానిలో 'స్వర' అనే వాయిస్ ఆర్టిస్ట్‌ల కోసం వర్క్ షాప్‌ను ఫిబ్రవరి 25న నిర్వహించారు. పాడ్ కాస్ట్లో తస్మాత్ జాగ్రత్త (క్రైమ్), సనాతనం (దేవుళ్ళు), స్వదేశ్ (కరెంట్ ఎఫైర్స్), బయోగ్రఫీ (జీవిత చరిత్రలు), కితకితలు (కామెడీ) వంటి కాలమ్స్‌లో అనేక విషయాల్ని ఈ యాప్ ద్వారా అందిచే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా పని కూడా చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
ముఖ్యంగా ఈ యాప్ గురించి ఎక్కువగా తెలియాల్సి ఉంది. ఈ యాప్ ఒక సాహిత్య స్పర్శతో, ఆశవహక దృక్పథంతో ముందుకొచ్చింది. దీనిలో సాహిత్యాన్ని చదవడానికి, వినడానికి కొంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దానిలో రూ.49తో గోల్డ్ ప్లాన్, రూ.365తో ప్రీమియం ప్లాన్‌ని తీసుకొచ్చారు. రూ.49 తో ఏడాది లో 5 కథల్ని, ఒక నవల, కథల సిరీస్ ని వినవొచ్చు. ఇది బావుంది అనుకుంటే మొత్తం యాప్‌ని ఏడాదికి గాను రూ.365తో పూర్తి మొత్తంలో వినవొచ్చు. ఇంతే కాకుండా కొత్త రచయితలను పరిచయం చేస్తూ వాళ్ళ నుండి ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళ కథల్ని పరిచయం చేస్తూ వాళ్ళు రాసిన కథల్ని ఆడియో రూపంలోకి అందిస్తున్నారు. దీనిని ఒక రచయిత బ్లాగ్‌గా 'వెలికోసన' శీర్షికతో నడుపుతున్నారు. ఇది నెలలో రెండు సార్లు ఉంటుంది. రాస్తున్న రచయితలను వాళ్ళ సాహిత్యాన్ని, వాళ్ళ రచనల్ని పాఠకులకు అందించడానికి ఈ పనిని మొదలెట్టారు. ఇది ప్రస్తుతం కొనసాగుతుంది.
సాయి చక్రవర్తి
సినిమా రంగంలో డైరక్షన్ డిపార్ట్మెంట్లో పని చేశాను. ప్రస్తుతం EarHook సంస్థ భాగస్వామిని. ఎప్పుడూ పాటలేనా, ఇకపై కథలు వినండి అని చెప్తూ, ప్రతీ కథను ఎంతో అద్భుతంగా రికార్డ్ చేసి appలో పెడుతున్నాం. తప్పకుండా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. కిరణ్, నేను ఇద్దరం కలిసి డిటెక్టివ్ రిషి వంటి సినిమాలకు పని చేశార. సాహిత్యం పట్ల ఆసక్తి, మక్కువతో ఈ యాప్ ని నడుపుతున్నార.
సత్యవోలు కిరణ్ కుమార్
విప్రోలో ఉద్యోగం చేస్తూ రచయితగా మారాను. తరువాత టి.వి మీడియాలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేశాను. ఇప్పుడు EarHook సంస్థను స్థాపించి ఎంతో మంది కొత్త రచయితలకు నా వంతు ప్రోత్సాహం ఇవ్వాలని ఆశిస్తున్నాను. తెలుగు కథ ప్రతీ వ్యక్తి దగ్గరకు చేరాలన్న సంకల్పంతో ఈ సంస్థను స్థాపించాము. అందరి ప్రోత్సాహంతో మరింత ఉత్సాహంగా ముందుకు అడుగు వేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు మనిషి పలికింది ఏ మాట, వైకుంఠ పాళి, పిపాసి, మనసే ఓ మరీచిక, చినుకులు చేరని చోటు వంటి 7 నవలలు రాశాను. ప్రస్తుతం కుశ పబ్లికేషన్స్ ద్వారా పుస్తకాల్ని ముద్రిస్తున్నాం.