Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమె, ఇద్దరు పిల్లలు, భర్తతో కలిసి ఊరొదిలి పట్నం వచ్చింది. భర్త వాచ్‌మన్. ఆమె ఇండ్లలో పనిచేసేది. ఉన్నంతలో సర్దుకుపోయే గుణం. ఇంతలో కరోనాతో భర్త మరణం. ఒక్కసారిగా నెత్తిన పిడుగుపడ్డట్టు అయింది. బతుకంతా ఆగమైంది. పిల్లల భవిష్యత్తు కండ్ల ముందు కదలాడింది. ఉక్కు సంకల్పంతో పిడికిలి బిగించి కదిలింది. కష్టాల కడగండ్లు తోక ముడిచాయి. జీవితపు ట్రాఫిక్ సుడిగుండాలను దాటిన ఆమెకు మహానగరం ట్రాఫిక్ పద్మవ్యూహాం ఒక లెక్కనా! డ్రైవింగ్ నేర్చుకుంది. మన మహానగరంలో గెలుపు దిశగా దూసుకెళ్తున్న క్యాబ్ డ్రైవర్ దండు లక్ష్మి పరిచయంఈ వారం జోష్.
మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కాకర్లపాడు చెందిన దండు లక్ష్మి ఊళ్లో పొలం పనులకు పోతుండేది. భర్త సత్తయ్య దుకాణంలో పని చేసేటోడు. ఇట్ల బతుకుడు కష్టమని ఊరు ఇడిసిపట్నం వచ్చిన ఆ జంట నగరంలో పడని కష్టం లేదంటే నమ్మరు. కొత్తలో భర్త అడ్డమీద కూలికి పోతుండె. పని దొరికిన నాడు తిండి తినేది. లేకపోతే పస్తుండేటోళ్లు. కొన్నాళ్లకు ఆయనకు నేరేడ్మెట్లో ఒక కట్టె మిషిన్ కాడ వాచ్‌మన్ నౌకరి దొరికింది. ఉండనీకె ఒక చిన్న గది ఇచ్చిండ్రు. అక్కడే ఉంటూ చనీళ్లకు వేడ్నిళ్లు తోడన్నట్టు చుట్టుపక్కల ఇండ్లకు పనికి పొయ్యేది. మొదలు రెండిండ్లు. తర్వాత ఇంకో నాలుగిండ్లు.
అలా బట్టలుతికి, బాసన్లు తోమి నెలకు పదివేల దాక సంపాదించేది. పొద్దున ఐదింటికి పనికి పోతే ఎనిమిదింటికి వచ్చి వంటచేసి, పిల్లల్ని బడికి తొలి. ఆ పైసల్లో నెలకు కొన్ని పైసలు దాచిపెట్టి...కొన్ని రోజులకు ఒక స్కూటీ కొన్నారు. సైకిల్ నడపనీకె భయపడే భర్తను స్కూటీ నేర్చుకొమ్మని ఎంత బతిమలాడినా ఒప్పుకోలే. చేసేదేంలేక కష్టపడి తానే నేర్చుకుంది. అందరిలెక్కనే స్కూటీమీదనే పిల్లలను స్కూల్‌కు తీస్కపోవుడు.. తీస్కరావుడు. 'పాచి పనిచేసేది కూడా స్కూటీ నడపవట్టె' అనే నోళ్లను పట్టించుకునేదే లేదని పట్టుబట్టి కారు నడుపుడు నేర్చుకుంది. ఇప్పుడు అదే కుటుంబానికి ఆధారమైంది.
ఉబర్ ఇచ్చిన అవకాశం
ఈ కష్టాల సంసారాన్ని చూసి జాలి పడిన ఒక పెద్దమనిషి కారు కొని కీరాయికి తిప్పితే మస్తు పైసలోస్తరు అని చెప్పిండు. అందులోనూ పెద్ద కారైతే మరి మంచిదన్నడు. కారు, కిరాయి గోల తెలియకపోయినా ఆ మనిషి మాటలు నమ్మింది. గిన్నెలు తోమి కూడబెట్టుకున్న పైసలతో సెవెన్ సీటర్ కారు కొన్నది. కారు ఖరీదు రూ.10 లక్షలు. లక్షన్నర బయానా పోగా. మిగతాది కిస్తీ కట్టాలని ధైర్యం చేసి అడుగు ముందుకేసింది. నెలకు ఇరవై అయిదువేలు కిస్తీ కట్టాలి. ఎట్లా మరి. ఎవరో ఒకరిని నమ్మాలి. లేకపోతే తెల్ల ఏనుగును ఇంటి ముందర పెట్టి కూసుంటే కిస్తీ పైసలేడికెళ్లి తేవాలి? అందుకే ఒకాయనను నమ్మి కారు లీజ్‌కు ఇచ్చింది. అతడు ఒక్క నెలలో పదకొండువేల కిలోమీటర్లు తిప్పిండు. ఒక్క రూపాయి కూడా ఇయ్యకుండా మా ఇంటికాడ కారు పెట్టి పరారు అయ్యాడు. నిలువునా మోస పోయారు. లక్షలు పెట్టి తీసుకున్న కారు ఇంటికాడ ఉట్టిగ పడి ఉండటం చూసి గుండె ఆగినంత పనైంది వాళ్లకు.
ఒకరోజు వరుసకు తమ్ముడొకడు వాళ్లింటికి వచ్చిండు. 'ఇంటిముందు కారు పెట్టుకొని అట్లా పరేషాన్ అయితే ఏం లాభం అక్కా? ఉబర్‌లో పెడితే బాగనే గిట్టుబాటు అయితుంది' అన్నడు. ఆ మాటలు కొంత ధైర్యానిచ్చాయి. డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడే లైసెన్స్ తీసుకున్నదే కానీ, కారు నడుపుడు అంత సులువు కాదు. అది పెద్దకారు నాతోని అయితదా భయం వెంటాడింది. భయంభయంగా ఉబర్ ఆఫీసు మెట్లు ఎక్కింది. 'ఒక మహిళ డ్రైవింగ్ చేస్తానంటూ సొంత కారుతో వచ్చినందుకు సంతోషంగా ఉంది. మిమ్మల్ని అభినందిస్తున్నాం' అన్నరు అక్కడి సార్లు. అలా ఉబర్‌లో కారు నడుపుడు మొదలుపెట్టింది ఆమె. విరామం లేకుండా 8-9 గంటలు కారు నడిపేది. దాంతో ఉబర్ కమిషన్, వేహికల్ రెంట్, ఇతర డీజిల్ ఖర్చులు పోనూ రోజూ ఆమెకు 2వేల రూపాయలు గిట్టుబాటు అయ్యేది. బతుకు మారుతోందిని కలలు కన్నది.
మళ్లీ చీకట్లు ముసిరాయి
ఇంతలో లాక్డౌన్ పెట్టిండ్రు. మళ్లీ వాళ్ల బతుకులు ఆగమైనరు. కరోనాతో వాళ్ల ఆయన చచ్చిపోయిండు. బతుకంతా చీకట్లు ముసిరాయి. ఇవేమి పట్టని బ్యాంకోళ్లు ఫోన్లు చేసి కిస్తీ కట్టమని సతాయించుడు షురు చేసిండ్రు. ఇక లాభం లేదని కారు అమ్మకాని పెట్టాలని నిర్ణయానికి వచ్చింది. అమ్మతే బాగానే ఉంటుంది. కానీ, రేపేట్టా బతికేది? ఇంతదాకా వచ్చి మళ్లీ ఇండ్లల్ల పనికి పోతే ఓడిపోయినట్టే. ఇన్ని సంద్రాలు దాటిన ఆమె ఓటమిని అంగీకరించడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. క్యాబ్ డ్రైవర్ల యూనియన్ చైర్మన్ సలావుద్దీన్‌కు తన గోడు వెల్లబోసుకుంది. తలా ఇన్ని పైసలు వేసుకొని ఆ రెండు నెలల కిస్తీ వాళ్లే కట్టిండ్రు. అలా భర్త పోయిన బాధనుంచి బయటపడి రెండు నెలల తర్వాత మళ్లీ డ్యూటీల చేరింది.
మరి.. చిన్ని చిన్న కష్టాలు, ఇబ్బందులకే ఆత్మహత్యాయత్నం చేస్తూ జీవితాలను ఆగం చేసుకుంటున్న వారు.. లక్ష్మికి వచ్చిన కష్టాలు, వాటి నుంచి ఆమె ఎట్లా బయటపడిందో అవగాహన చేసుకోవాలి. ఎట్లాంటి కష్టం వచ్చినా బతకాలన్న ఆశ, ఏదైనా కొత్తగా సాధించాలన్న తపన ఉంటే ఏదీ అసాధ్యం కాదని నిరూపించిన లక్ష్మిని ఆదర్శంగా తీసుకోవాలి.
వెలుగులు నింపిన రోజు
ఉబర్‌తో మళ్లీ ప్రయాణం మొదలుపెట్టిన లక్ష్మి జీవితం నాలుగు చక్రాలపై సయ్యంగా నడవడానికి చాలా సమయం పట్టింది. అలా బతుకు బండి నడుపులున్న ఆమె జీవితంలో ఆరోజు నిజంగా వెలుగులు నింపింది. ఒకరోజు ట్యాంక్‌బండ్‌కు ఆమె కార్ బుక్ అయ్యింది. ఒక మేడం, కొందరు పిల్లలు ఎక్కిన్రు. లక్ష్మిని డ్రైవర్ సీట్ లో చూసి వాళ్లు ఆశ్చర్యపోయారు. ఆ కొద్ది ప్రయాణంలో ఆమె కథంత విన్న ఓ సామాజిక కార్యకర్త ఆ ప్యాసింజర్ (హిమబిందు) సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు లక్ష్మిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఆమే పెద్ద కంపెనీలో కారు కిరాయికి పెట్టించింది. పిల్లలిద్దరిని మంచిగా చదివిస్తోంది.