Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి నిమిషం మనల్ని మనం మెరుగుపరుచుకొంటూనే ఉండాలి. అది కెరీర్ అయినా.. ప్రేమైనా.. కుటుంబమైనా.. ఏదైనా సరే నిన్నటి కంటే ఈ రోజు మెరుగ్గా ఉండాలి. అందుకే చాలామంది కొన్ని ప్రత్యేకమైన రోజునో, తమకు ఇష్టమైన రోజునో తమని తాము మెరుగు పరచుకోవడానికి చాలా మంది తీర్మానాలు చేసుకొంటారు. ఆ రోజు నుండి కొన్ని లక్ష్యాలు పెట్టుకొని వాటిని సాధించేందుకు ప్రయత్నిస్తారు.
ఇక్కడ గుర్తు పెట్టుకోవల్సిన విషయం ఏమిటంటే.. సైకాలజీ టుడే చేసిన ఓ అధ్యయనం ప్రకారం.. పెద్ద లక్ష్యం ఏర్పాటు చేసుకొని దాన్ని సాధించలేక ఇబ్బందిపడటం కంటే.. దాన్ని చిన్న చిన్న లక్ష్యాలుగా విడగొట్టి పూర్తి చేయడం సులభమని తేలింది. దీనివల్ల గమ్యాన్ని చేరుకోగలననే ఆత్మ స్థైర్యం పెరుగుతుంది. ఇందు కోసం ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించు కొంటామని మీకు మీరే మాటిచ్చుకొవాలి. మరి దానికి తగ్గట్టుగా మన లక్ష్యం ఉండాలి. అందుకే ఆరోగ్యంగా, ఫిట్‌గా తయారవడాన్ని తీర్మానంగా పెట్టుకోవాలి. దాన్ని ఏడు చిన్న లక్ష్యాలుగా విభజించుకోండి...
మొదటి నెలల బ్రేక్ చేయవద్దు
నిన్నటి వరకు మీకు ప్రతి రోజూ బయటి ఆహారాన్ని తినే అలవాటు ఉందా? ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్.. ఇలా మనకు నచ్చినవన్నీ తింటూనే ఉంటాం. మన ఆహారపు అలవాట్లు మరికొంత కాలం ఇలాగే కొనసాగితే.. మీ ఆరోగ్యం అటకెక్కుతుంది. అందుకే ముందు మీరు ఈ అలవాటును మార్చుకోవాలని నిర్ణయించుకోవాలి. బయటి తిండి తినకుండా ఉండాలంటే ముందు ఇంట్లో వంట చేయడం ప్రారంభించాలి. వంట చేయడం అంతబాగా రాకపోయినా కనీసం మన ఆరోగ్యాన్నైనా కాపాడుకోవచ్చు. కొంత మంది ఆకలి తగ్గించుకోవడం కోసం చాక్లెట్లు ఎక్కువగా తింటుంటారు. ఈ అలవాటు మరింత ప్రమాదం. దీన్ని వెంటనే తగ్గించుకుంటే మరి మీ డబ్బు ఆదా అయినట్టే కదా..! కాకపోతే.. మొదటి నెల రోజులు ఈ నియమాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్ చేయకుండా ఉండాలి. అప్పుడే మీరు కోరుకొన్న ఫలితాన్ని పొందగలుగుతారు.
అనవసర యాప్‌లు వద్దు
ఓ వ్యక్తి రోజులో సగటున రెండున్నర గంటల సమయాన్ని సామాజిక మాధ్యమాల కోసం కేటాయిస్తు న్నాడట. రెండున్నర గంటలు తక్కువ సమయ మేమీ కాదు కదా.. దాన్ని ఉపయోగించుకొంటే ఎంత సమయం ఆదా అవుతుంది? దీనివల్ల రోజులో మనకు తెలీకుండానే ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడుపుతున్నాం. ఎందుకంటే ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరూ తమకు సంబంధించిన విషయాలను ఇన్స్‌స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ద్వారానే పంచుకొంటున్నారు. ఇలాంటివే మరికొన్ని యాప్స్ ఫోన్లో ఉంటాయి. వాటి వల్ల మీ సమయం వథా అవుతోంది. అందుకే మీకు అత్యవసరమైనవి తప్ప మిగిలిన వాటిని ఫోన్లో నుండి తొలగించుకోండి. ఇది మీ సమయాన్ని ఆదా చేయడమే కాకుండా.. లేనిపోని తలనొప్పులు రాకుండా ఉంటాయి.
మెదడుకు శిక్షణ ఇవ్వండి
ప్రతికూల ఆలోచనలు అన్నివిధాలుగా మన ఎదుగుదలకు ఆటంకంగా మారతాయి. అందుకే వాటిని మన మెదడులో నుంచి బయటకు పంపించాలి. సానుకూల ఆలోచనలను మనలోకి ఆహ్వానించాలి. అదెలా సాధ్యమంటారా? దానికీ ఓ మార్గముంది. మన ఆలోచనలన్నీ ప్రతికూలంగానే ఉన్నప్పుడు.. సానుకూల ఆలోచన వచ్చినట్టుగా నటించాలి. ఇలా చేయడమంటే మెదడు సానుకూలంగా ఆలోచించేలా శిక్షణ ఇస్తున్నట్టే. క్రమంగా మనలో పూర్తిగా పాజిటివిటీ నిండిపోతుంది.
సంతోషాన్ని ఆహ్వానించి..
కొంతమందికి కవితలు రాయడమన్నా.. కథలు రాయడమన్నా చాలా ఇష్టం. కానీ పని ఒత్తిడి వల్ల అది చేయలేరు. కాస్త తీరిక చేసుకొనైనా ఆ పని చేయాలని చాలా సందర్భాల్లో అనుకొన్నా. కానీ ఒకటీ అరా మినహా పెద్దగా రాసింది ఏమీ ఉండకపోవచ్చు. కానీ ఆ రెండు సందర్భాల్లోనూ కచ్చితంగా మీకు చాలా సంతోషం కలిగివుంటుంది. ఇలా మనకు ఆనందాన్ని కలిగించేవాటిని పక్కన పెట్టేయడం మంచిది కాదు. అందుకే ఈ ఏడాదిలో సమయం కుదిరినప్పడల్లా మీరు నా కలానికి పని పెట్టండి. ఎప్పటికప్పుడు మీ జీవితంలో సంతోషాన్ని నింపుకోవడానికి ప్రయత్నించండి.
ప్రశాంతంగా ఉండేలా..
మనల్ని మనం ప్రేమించుకునే క్రమంలో మనం చేరుకోవాల్సిన మరో మెట్టు ప్రశాంతంగా ఉండటం. దానికోసం మంచి సంగీతాన్ని వినండి. ఇది మన మనసుని, మెదడుని రెండింటినీ ప్రశాంతంగా ఉంచుతుంది. అప్పుడు నిద్ర బాగా పడుతుంది. ఫలితంగా ఆరోగ్యం మెరుగు పడుతుంది.
అధ్యయనం చేయండి
ఈ స్మార్ట్ఫోన్లు వచ్చిన తర్వాత ఎక్కువ సమయం వాటితోనే గడిపే స్తున్నాం. ఇంతకు ముందు పుస్తకాలు చదివే అలవాటు ఉండేది. ఈ స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారి ఆ పుస్తకాలన్నీ అటక మీదకి ఎక్కించేశాం. అసలైన జ్ఞానాన్ని ఇచ్చేవి పుస్తకాలే. అందుకే ఓ మంచి పుస్తకం వంద మంది మిత్రులతో సమానమన్నారు పెద్దలు. అందుకే రోజులో కొంత భాగాన్ని పుస్తక పఠనానికి కేటాయించుకోండి.
మిమ్మల్ని మీరు మెచ్చుకోండి
మనం గుర్తించం కానీ.. రోజూ మనం ఎన్నో ఫలితాలను సాధిస్తూ ఉంటాం. అనుకొన్న సమయానికి వాకింగ్ చేయడం, డెడ్ లైన్ లోపల ప్రాజెక్ట్ పూర్తి చేయడం, సమయానికి భోజనం చేయడం ఇవన్నీ మెచ్చుకోదగిన అంశాలే. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా మిమ్మల్ని మీరు మెచ్చుకోవాలని నిర్ణయించుకోండి. అది మీలో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది.
ఇన్ని రిజల్యూషన్స్ పెట్టుకొన్నాం కదా.. మరి వాటిని ఎలా సాధించడం? దానికి కూడా ఓ మార్గం ఉంది. మొదటి నెల ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించండి. ఆ నెల గడిచేసరికి అది మనకు అలవాటుగా మారి పోతుంది. మరుసటి నెల దీన్ని కొనసాగిస్తూనే రెండో లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించండి. ఇలా మిగిలినవన్నీ పూర్తి చేసేయండి. అలా కొన్ని నెలలు గడిచేసరికి ఇవన్నీ మన జీవనశైలిలో భాగంగా మారిపోతాయి.