Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఒకసారి పెండ్లి జరిగిందంటే ఇక అంతే. ఎన్ని సమస్యలు వచ్చినా, చెడైనా, మంచైనా భర్తతోనే'' అంటారు కొందరు. పెండ్లి అంటే అందరూ నూరేండ్ల పంట అంటారు. పంటకు చీడలు, పురుగులు పట్టాయి అనుకోండి ఏం చేస్తాం? వాటికి పురుగు మందులు, ఎరువులు చల్లి ఆ చీడను తొలగిస్తాం. అలాగే పెండ్లితో ముడి వేసుకున్న రెండు జీవితాలకు ఏదైనా సమస్య వస్తే... వాటిని కూడా ఓర్పు, సహనం అనే ఎరువులు వేసి బాగు చేసుకునేందుకు ప్రయత్నిస్తాం. అయినా సమస్య పరిష్కారం కాకపోతే... ఏం చేయాలి... అలాంటిదే ఈ వారం ఐద్వా లీగల్సెల్కు వచ్చిన పల్లవి కథ.
పల్లవికి ప్రస్తుతం 24 ఏండ్లు. నాలుగేండ్ల కిందట ప్రేమ పెండ్లి చేసుకుంది. అప్పటి నుండే ఆమెకు సమస్యలు మొదలయ్యాయి. ఆ సమస్యల మధ్యే ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇంట్లో భర్త, అత్తయ్య, పిల్లలు ఉంటారు. అసలు తన సమస్య ఏంటని పల్లవిని అడిగితే ''మేడమ్ మా అత్త కూడా మాతో పాటు పడుకుంటానంటుంది. మేము గదిలో ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నారో చూస్తానంటుంది. అదేం ఆలోచనో నాకు అర్థం కాలేదు. మేమిద్దరం తన ముందే కాపురం చేయాలి అంటుంది. ఏం జరిగినా తన ముందే జరగాలంటుంది. లేదంటే మా ఇద్దరిని ఒక గదిలో పడుకోవద్దంటుంది.
ఆమె అలా అంటున్న రవి ఏమీ అనడు. రెండు మూడు నెలల తర్వాత నా భర్త కూడా తల్లికే సపోర్ట్ చేశాడు. తను కూడా అమ్మ చెప్పినట్టు చేద్దాం అన్నాడు. ఇక చేసేది లేక చివరికి ఒప్పుకున్నాను. కానీ నాకు ఇదంతా నరకంలా ఉంది. నా సమస్య ఎవరికి చెప్పుకోలేకపోయాను. తిరిగి మా అమ్మ వాళ్ళ ఇంటికి వళ్ళిపోదామన్నా వాళ్ళకు ఇష్టం లేకపోయినా ప్రేమించి మరీ పెండ్లి చేసుకున్నాను. ఆ బాధతోనే మా నాన్న చనిపోయారు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని అక్కడకు వెళ్ళను. పైగా ఈ మధ్య నాకు ఇష్టం లేదన్నా హింసిస్తున్నాడు. బలవతంగా తన కోర్కెలు తీర్చుకుంటున్నాడు.
నెట్లో వీడియోలు చూపించి అలా చేయాలంటాడు. అది కాకుండా పక్క నుంచి వాళ్ళ అమ్మ సలహాలు. ఇప్పుడు నేను అతనికి ఓ యంత్రాన్ని మాత్రమే. ఒక సారి ఇన్ఫెక్షన్ వచ్చి డాక్టర్ దగ్గరకు వెళితే ఆమె అశ్చర్య పోయింది. 'లోపల అవయవాలు ఎందుకు ఇంతగా దెబ్బతిన్నాయి. అసలు ఏం జరిగిందో చెప్పు. చెబితేనే నేను చికిత్స చేయగలను. లేకపోతే కష్టం' అంది. ఒకపక్క నాకు బ్లీడింగ్ విపరీతంగా అవుతుంది. కూర్చోలేని పరిస్థితిలో ఉన్నాను. అలాగే బాధపడుతూ డాక్టర్కి విషయం చెప్పాను.
దానికి ఆమె 'ఎందుకు ఇతనితో అన్ని బాధలు భరిస్తున్నావు. వదిలేసి మీ అమ్మ దగ్గరకు వెళ్ళిపో లేకపోతే, ఇది ఇలాగే కొనసాగితే చచ్చిపోతావు. నీ పిల్లలు అనాథలవుతారు. నీ భర్త పెద్ద సైకోలా కనిపిస్తున్నాడు. అతనితో వుంటే నీకు ఇబ్బందులు తప్పవు' అని చెప్పింది. ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మకు ఫోన్ చేసి ఆరోగ్యం బాగోలేదని చెప్పాను. అమ్మ వెంటనే వచ్చింది. 'జరిగింది ఏదో జరిగిపోయిందని నన్ను, రవిని, పిల్లలను ఇంటికి తీసుకువెళ్ళింది.
మా అమ్మ నాకు దగ్గరైనందుకు చాలా సంతోషించాను. అక్కడ కొన్ని రోజులు ఉన్నాము. నాకు తగ్గిన తర్వాత మళ్ళీ మా ఇంటికి వెళ్ళాం. అప్పటి నుండి అప్పుడప్పుడు అమ్మ దగ్గరకు వెళ్ళే వాళ్ళం. కానీ రవికి మాత్రం ఇష్టం లేదు. వెళ్ళిన వెంటనే తిరిగి తీసుకువచ్చేవాడు. అమ్మకు ఎప్పుడైనా ఫోన్ చేసినా స్పీకర్ ఆన్ చేయమనేవాడు. కొంత కాలానికి రవి వాళ్ళ అమ్మ చనిపోయింది. ఇక నా కష్టాలు సగం తీరాయి అనుకున్నాను.
అయితే రవి మాత్రం సైకోలాగే ప్రవర్తించేవాడు. పిల్లల ముందే సెక్స్ చేసేవాడు. ఎంత చెప్పినా వినేవాడు కాదు. అది కూడా చాలా అసహ్యంగా. ఒకసారి అతని ప్రవర్తనతో స్పృహ తప్పి పడిపోయాను. ఆస్పత్రిలో చేర్పించారు. మా అమ్మ వచ్చింది. డాక్టరు చికిత్స చేయకుండా, పోలీసులకు ఫిర్యాదు చేస్తాను అంది. నాతో ''నీకు ఇంతకు ముందే చెప్పాను. అతన్ని వదిలేసి వెళ్ళిపోమని చెప్పాను. అయినా వినలేదు. పైగా అతనిలో కూడా ఎలాంటి మార్పు లేదు' అన్నది.
రవిని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పి వచ్చాను. ఆ ప్రయత్నం కూడా చేశాను. కానీ రవిలో మార్పు మాత్రం రాలేదు. ఇక విసిగిపోయి మా అమ్మ దగ్గరకు వచ్చేశాను. దాంతో రవి నాపైన, మా అమ్మపైన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మా ఇద్దరినీ పిలిస్తే అసలు విషయం చెప్పాను. మొత్తం విన్న పోలీసులు నన్ను ఇంటికి వెళ్ళమన్నారు. అయితే రవి 'నా భార్యను నాతో పంపించకపోతే చచ్చిపోతాను అంటూ తల గోడకేసుకొని కొట్టుకున్నాడు. దాంతో పోలీసులు అతన్ని ఆస్పత్రికి తీసుకువెళ్ళి చికిత్స చేయించారు. కానీ ఇప్పుడు నాకు రవిని చూస్తేనే భయం వేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడంలేదు. అందుకే మీ దగ్గరకు వచ్చాను. మీరే నాకు సహాయం చేయాలి'' అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది.
ఆమె బాధను, అనుభవించిన కష్టాల గురించి విన్న లీగల్ సెల్ సభ్యులు రవిని పిలిపించారు. అతను ఎవరు ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో లేడు. నా భార్యను నాతో పంపించాల్సిందే అంటున్నాడు. పల్లవికి అతనితో వెళ్ళడం ఏ మాత్రం ఇష్టం లేదు. 'ఆమె లేకుండా నేను ఉండలేను. తను లేకుంటే పిచ్చివాడినై పోతాను. నా భార్య అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఎలా నచ్చితే అలా తనతో ఉంటాను. వద్దని చేప్పే హక్కు ఎవరికి లేదు. పల్లవికి కూడా లేదు. నాతో రానంటే తనపై కేసు పెడతాను. భర్త అడిగినప్పుడు దగ్గరకు రాకపోతే కేసు పెట్టవచ్చు కదా! ఆ కేసే తనపై పెడతా' అంటూ ఇక్కడ కూడా తలను గోడలకు కొట్టుకోవడం మొదలుపెట్టాడు.
మేము అతనిని వారించి నచ్చచెప్పడానికి ప్రయత్నించాం. కానీ అతను వినే పరిస్థితిలో లేడు. వెంటనే పోలీసులను పిలిపించాము. పోలీసులు రవిని చూస్తూనే 'వాడు పెద్ద సైకోగాడు. వీడు ఎంత చెప్పినా, ఎలా చెప్పినా వినడు. ఏం చేయమంటారు' అంటూ వెళ్ళిపోయారు. ఇక మేమే ఆలోచించి అతను మానసిక జబ్బుతో బాధపడుతున్నాడని సైక్రియార్టిస్ట్ దగ్గరకు పంపించాం. ప్రస్తుతం వాళ్ళు రవికి చికిత్స చేస్తున్నారు. పల్లవి పిల్లలను తీసుకువెళ్ళి ఉద్యోగం చేసుకుంటూ అతనికి, హైదరాబాద్కు దూరంగా వుంటుంది.
పిల్లలు తెలిసీ తెలియక చేసిన తప్పులను తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. పిల్లల గురించి తల్లిదండ్రుల కంటే ఎవరూ బాగా ఆలోచించ లేరు. కాబట్టి ఎలాంటి విషయం అయినా సరే మొదట తల్లిదండ్రులకు చెప్పండి. వాళ్ళు మొదట తిట్టినా తర్వాత అర్థం చేసుకుంటారు. మీకు ఒక మంచి మార్గం చూపిస్తారు. ఏదో తొందరపాటుతో ఒక పని చేసినా సరే దాన్ని ధైర్యంగా మీ తల్లిదండ్రులకు చెప్పండి. గతంలో తప్పు చేశాము. ఇప్పుడు ఏమనుకుంటారో అనుకోవద్దు. ఇలా అనుకొని పిల్లలు వారి సమస్యలను ఇంకా ఎక్కువ చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు మించిన మంచి మార్గదర్శి శ్రేయోభిలాషి అంటూ ఎవరు ఉండరు. దీనికి పల్లవి జీవితం ఓ చక్కటి ఉదాహరణ. కూతురు కష్టంలో ఉన్నానని చెప్పిన వెంటనే ఆ తల్లి వచ్చి ఆదరించింది. కూతురికి అండగా నిలిచింది.
- వరలక్ష్మి, 9948794051