Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''స్త్రీకి సమాన అవకాశం ఇస్తున్న రంగం ఎక్కడైనా ఉందా..? మహిళ కన్నీటితో తడవని నేల ఎక్కడైనా ఉందా..?'' అని ఆమె గట్టిగా ప్రశ్నిస్తున్నారు. స్త్రీ సమానత్వానికై ప్రశ్నించడానికే ఆమె గొంతు ఉంది. సమసమాజం వైపు వేసేందుకే ఆమె అడుగులు వున్నాయి. మొన్నటి వరకు బాధ్యతగల ఓ ఉపాధ్యాయినిగా భావి భారతాన్ని తీర్చిదిద్దారు. ఓ ఉద్యమకారిణిగా మహిళా సమస్యలపై కదం తొక్కారు. ఉద్యమమే జీవితంగా బతుకుతున్న ఆమెను గుర్తించి ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యురాలిగా నియమించింది. ఆమే సుమిత్రా ఆనంద్... ఆమె జీవిత విశేషాలు ఆమె మాటల్లోనే...
మాది మెదక్ జిల్లాలోని ఆరేపల్లి గ్రామం. చిన్న పల్లెటూరు అది. 30, 40 కుటుంబాలు మాత్రమే ఉండేవి. నాన్న మాణిక్యరావు, అమ్మ విఠాబాయి. నాన్న గర్నమెంట్ స్కూలు టీచర్‌గా చేస్తూ చనిపోయారు. అమ్మ ఇటీవలె చనిపోయింది. మేము మొత్తం ఐదుగురం. నేను నాల్గో సంతానాన్ని. మా అందరినీ బాగా చదివించారు. మా అన్నయ్య డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్‌గా రిటైర్డ్ అయ్యాడు. తమ్ముడు ప్రైవేట్ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నాడు. నేను గవర్నమెంట్ టీచర్‌గా చేస్తూ వీఆర్ఎస్ తీసుకుని పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యురాలిగా పని చేస్తున్నాను.
నాన్న భావాలతో...
నాన్న ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తి. గ్రామంలో తనే మొదటి విద్యా వంతుడు, తనే మొదటి టీచర్. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనే తపన బాగా ఉండేది. ఊళ్ళో ప్రతి ఇంటి నుండి కనీసం ఒకరైన చదివేటట్లు ప్రోత్సహించేవారు. మనం అంటే కేవలం కుటుంబం మాత్రమే కాదు, సమాజం కూడా అనే ఆలోచనలు ఉన్న నాన్న పెంపకంలో పెరిగాను. నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు నాన్న చనిపోయాడు. నా పదో తరగతి తర్వాత పెండ్లి చేశారు. పెండ్లి విషయంలో నాకు కొన్ని ఆలోచనలు ఉండేవి. అప్పట్లో వరకట్న సమస్య ఎక్కువగా ఉండేది. ఆడపిల్ల ఎందుకు కట్నం ఇవ్వాలి అనుకునేదాన్ని. నేను పెండ్లి చేసుకుంటే కట్నం తీసుకోని వ్యక్తినే చేసుకోవాలనుకున్నాను. అనుకోకుండా అలాంటి వ్యక్తే నా జీవితంలోకి వచ్చాడు.
అనుకోకుండా దొరికాడు
ఆనందరావు చదువుకునే రోజుల్లో పీడీఎస్‌యూలో పని చేసేవారు. కమ్యూనిస్టు భావాలు కలిగిన వ్యక్తి. పెండ్లి చూపులకు వచ్చినప్పుడు ''నాకు కట్నం వద్దు, మన పెండ్లిలో తాళి, మెట్లెలు, వేదమంత్రాలు, బాజాభజంత్రీలు ఏమీ ఉండవు. దండలు మార్చుకొని పెండ్లి చేసుకోవడమే నీకు ఇష్టమేనా'' అని అడిగారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఏడారిలో నీటి చెలిమ కోసం వెదుకుతున్న నాకు పెద్ద సరస్సే దొరికినట్టు భావించాను. ఆదర్శవంతమైన వ్యక్తి దొరకడం, మా జంట రేపటి తరానికి ఆదర్శం కాబోతుందని గర్వంగా అనిపించింది.
వాళ్ళలా పని చేయాలని...
1989లో మా పెండ్లి జరిగి అత్తగారి ఊరైన చిన్నమల్లారెడ్డి వచ్చాను. మాకు దగ్గరల్లో లైబ్రరీ ఉండేది. పుస్తకాలు తెచ్చుకొని విపరీతంగా చదివేదాన్ని. 'కాలుతున్న పూలతోట' అని ఓ నవల చదివాను. అది నన్ను బాగా ప్రభావితం చేసింది. అయితే అందులో ముగ్గురు అమ్మాయిలు సమాజంలో మార్పు కోసం, మహిళల సమస్యల పరిష్కారం కోసం అజ్ఞాతంలోకి వెళతారు. నాకూ వాళ్ళలా సమాజం కోసం ఏదైనా చేయాలని ఉంది అని ఆనందరావుకు చెప్పాను. అయితే ఆయన ''అజ్ఞాతంలోకి వెళ్ళడం కంటే బయటే ఉండి మహిళల కోసం ఏదైనా చేస్తే మంచిది. అక్కడికి వెళితే ప్రజల కోసం చేసేది ఒక ఎత్తైతే నిన్ను నువ్వు కాపాడుకోవల్సి వుంటుంది'' అన్నారు.
సాటి మహిళలకు అండగా...
అప్పట్లో మా ఊరులోనే ఓ మహిళా మండలి ఉండేది. అయితే అది కేవలం కుట్లు, అల్లికలు నేర్పించడానికే పరిమితమై ఉండేది. మహిళలంటే కుట్లు, అల్లికలు, వంటలు చేయడం మాత్రమే కాదు సాటి మహిళలకు ఎక్కడ సమస్య వచ్చినా వారికి అండగా మనం నిలబడాలి అని వారిలో అవగాహన కల్పించే ప్రయత్నం చేశా. దాదాపు 200 మంది మహిళలు నాతో చేరారు. మేమంతా కలిసి ఆ చుట్టుపక్కల ఎవరికి ఎక్కడ సమస్య వచ్చినా వెళ్ళే వాళ్ళం. కొంత కాలానికి మా కామారెడ్డి ప్రాంతంలో ఓ మహిళ సమస్యతో మా దగ్గరకు వచ్చిందంటే చాలు అవతలి వారు భయపడిపోయేవారు. అంతగా పని చేశాము. మమ్మల్ని చూసి చుట్టు పక్కల ఊర్లల్లో కూడా మహిళా మండలి ఏర్పాటు చేసుకున్నారు.
మెరుగైన సమాజం కోసం...
1996లో తెలుగు పండిట్ ట్రైనింగ్ తీసుకున్నాను. ఆనందరావు ప్రోత్సాహం నాకు బాగా ఉండేది. ప్రతి దాంట్లో నన్ను ముందు నిలబెట్టేవారు. చదవడానికి అనేక పుస్తకాలు ఇచ్చేవారు. రాజు పేద అనే నవల చదివాను. అది కూడా బాగా నచ్చింది. అలాగే ఓల్గా స్వేచ్ఛ, శ్రీశ్రీ, తిలక్ పుస్తకాలు అన్నీ చదివేదాన్ని. 1998లో తెలుగు ఉపాధ్యాయురాలిగా చేరాను. తరగతి గదుల్లోనే దేశ భవిత నిర్మితమవుతుంది అంటారు. ఓ మెరుగైన సమాజం నిర్మించే అవకాశం వచ్చినందుకు సంతోషంగా అనిపించింది. ఉపాధ్యాయ సంఘాల్లో కూడా పని చేశాను. టీచర్ని కావడంతో పిల్లలకు కథలు, పద్యాలు చెబుతుండేదాన్ని. పిల్లల కోసం చాలా చదివేదాన్ని. అప్పట్లో పాఠ్యపుస్తకాల్లో మహిళా వివక్షను చూపే పాఠాలు చాలా ఉండేవి. వాటి వల్ల సమాజంలో మహిళల పరిస్థితి మరింత దిగజారుతుంది. ఆ విషయాలను పిల్లలకు వివరంగా చెబితే అర్థం చేసుకునేవారు. పాఠ్యాంశాల్లోని కొన్ని ఇతిహాసాలు, పురాణాలు మహిళలు కించపరిచే విధంగా ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠ్యాంశాల్లో కొంత మార్పు వచ్చింది.
తెలంగాణ ఉద్యమంలో...
తెలుగు పండిట్ ట్రైనింగ్ తీసుకునేటపుడు నా భాషను ఎగతాళి చేసేవారు. ఆ కోపంతో భాష కోసం ఏర్పడిన సంఘాల్లో పని చేశాను. తెలంగాణ రచయితల సంఘంలో కూడా ఉన్నాను. ఆ తర్వాత కాలంలో ఉపాధ్యాయినిగా పని చేస్తూనే తెలంగాణ ఉద్యమంలో విస్తృతంగా పని చేశాను. వేదికలకు ఎక్కి పాటలు పాడేదాన్ని. చివరకు పోరాటం ఫలించి ప్రత్యేక తెలరగాణ వచ్చింది. ఉద్యమాలే జీవితంగా బతుకుతున్నప్పుడు మనల్ని కచ్చితంగా సమాజం గుర్తిస్తుంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం నన్ను గుర్తించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యురాలిగా నియమించింది.
మార్పుకు ఆయుధం విద్యనే
మీడియా కూడా యువతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అసహజాన్ని సహజం అనే స్థాయికి తీసుకుపోతున్నారు. ఎల్కేజీ నుండే ప్రేమ వ్యవహారాలు చూపిస్తున్నారు. ప్రేమించవకపోతే మనిషే కాదు అని నేర్పుతున్నారు. వీటిలో మార్పు రావాలి. ఎక్కడైనా దాడి జరిగితే కొంతమందికి ఉరి వేస్తున్నారు. ఎన్కౌంటర్లు చేస్తున్నారు. దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అసలు ఈ నేరాలు జరగడానికి కారణం ఏంటి, మూలాలు ఎక్కడ ఉన్నాయి అనేది పరిశీలించాలి. మార్పు మూలాల నుండి రావాలి. అప్పుడే మహిళల మీద దాడులు తగ్గుతాయి. అలాగే మార్పు కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. నా ఊపిరి ఉన్నంత వరకు సమాజంలో మార్పుకోసం కృషి చేయాలి అనేది నా బలమైన కోరిక. నేను ఏ స్థానంలో ఉన్నా సమాజం కోసం, మహిళల కోసమే పని చేస్తాను. సమాజ మార్పుకు శక్తివంతమైన ఆయుధం విద్య. ఆ విద్య అందరికీ అందుబాటులో ఉండాలి.
ప్రభుత్వ ద్వంద్వ వైఖరి
మహిళలు ఏ విషయం లోనైనా ధైర్యంగా ఉండాలి. అలా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. రేపటి సమాజాన్ని నిర్మించేది మహిళలు. అలాంటి మహిళలు ఆరోగ్యంగా ఉండాలి అనేది నా కోరిక. అయితే మహిళల సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు ఆ సమస్యలకు కారణం మహిళనే అని నిందిస్తున్నారు. ఒక పక్క మీ బట్టలు సరిగా లేవు అందుకే అత్యాచారాలు జరుగుతున్నాయి అంటున్నారు. మరో పక్క నిండుగా బట్టలు వేసుకుంటున్న చోట హిజాబ్ ఎందుకు అంటున్నారు. ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తున్నారు. బేటీ పడావో - బేటీ బచావో అనేవి నినాదాలకే పరిమితం అవుతున్నాయి.
అక్షర కిరణం
చదువు లేని చోట మహిళ హింసకు గురవుతుంది. బానిసగా బతుకుతుంది. అందుకే మహిళా అక్షరాస్యత సాధించాలని మా మహిళా మండలి ఆధ్వర్యంలో 'అక్షర కిరణం' అనే ఉద్యమం మొదలుపెట్టాము. అప్పట్లో ఆడపిల్ల అంటే బీడీలు చుట్టడానికి మాత్రమే పుట్టిందా అనేట్టు ఉండేది. వాళ్ళను చదివించమని అవగాహన కల్పించాము. చాలా మందిలో మార్పు వచ్చింది. ఇవన్నీ నేను చదువుకుంటూనే చేసేదాన్ని. కామారెడ్డిలో సాయంత్రం కాలేజీలో చేరి ఇంటర్, డిగ్రీ పూర్తి చేశాను. ఇంటి బాధ్యతలు చూసుకుంటూ, చదువుకుంటూనే నా కార్యక్రమాలన్నీ చేసేదాన్ని. అలాగే సారా వ్యతిరేక ఉద్యమంలో కూడా పాల్గొన్నాను. చివరకు విజయం సాధించాము. పోరాటం ఎప్పుడూ వృధా పోదూ అనే ధైర్యాన్ని ఇచ్చింది ఆ ఉద్యమం.
- సలీమ
ఫొటోలు: పిప్పళ్ల వెంకట్