Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చేసేది తప్పా ఒప్పా అనేది అర్థం చేసుకోలేని పరిస్థిల్లో సమాజం ఉంది. చివరకు కుటుంబ సభ్యులు కూడా ఎవరిని ఎలా సమర్థించాలో తెలుసుకోలేక పోతున్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఎవరి కోణం వారికి ఉంటుంది. మనం ఎవరి కోణం నుండి చూస్తే వారిదే సరైనదిగా అనిపిస్తుంది. కానీ ఎవరైనా ఏదైనా చెప్పినపుడు ఆలోచించకుండా ఓ నిర్ణయానికి రాకూడదు. ప్రశాంతంగా ఆలోచించాలి. ఎలాంటి పరిస్థితులు వారితో అలా చేయించాయో తెలుసుకుంటే అసలు సమస్యలే ఉండవు. దానికి ఉదాహరణే ఈ వారం ఐద్వా అదాలత్...
లక్ష్మి తల్లిదండ్రులకు పూల దుకాణం ఉంది. ప్రతి ఆదివారం మార్కెట్లో చేపలు అమ్ముతారు. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం. తల్లిదండ్రులకు లక్ష్మి ఒక్కతే కూతురు. తాను ఏది కోరుకుంటే అది క్షణాల్లో వచ్చేస్తుంది. ఆమెకు ఆరుగురు మేనత్తలు. వారి పిల్లల్లో ముగ్గురు అబ్బాయిలు లక్ష్మికన్నా పెద్దవాళ్ళు. అందరూ లక్ష్మిని తమ ఇంటి కోడలిగా చేసుకోవాలి అనుకునేవారు. ఇంతలో వాళ్ళ రెండో అత్తయ్య కొడకు వేరే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ విషయం ఇంట్లో వాళ్ళకు తెలిసింది. ఆ అబ్బాయిని బలవంతంగా వాళ్ళ మేనమామ ఇంటికి తీసుకొచ్చారు.
అక్కచెల్లెళ్ళు అందరూ వచ్చేసరికి లక్ష్మి వాళ్ళ ఇంట్లో ఎవరూ లేరు. ఆ రోజు ఆదివారం కావడంతో అందరూ మార్కెట్లో చేపలు అమ్మడానికి వెళ్ళారు. మధ్యాహ్నానికి ఇంటికి వచ్చారు. అప్పటి వరకు వాళ్ళు అక్కడే ఉన్నారు. అందరినీ ఒకే సారి చూసిన లక్ష్మి తండ్రి ఆశ్చర్యంతో ''ఏమిటి అందరూ కలిసి ఒకేసారి ఇలా వచ్చారు'' అడిగాడు. చెల్లి చెప్పిన విషయం విని ఏం చేయాలో అర్థం కాలేదు. ఆలోచిస్తున్న అన్నతో 'నీ కూతురు లక్ష్మిని నేను ఇప్పుడే నా ఇంటి కోడలిగా చేసుకుంటాను. లేకపోతే వాడు వేరే అమ్మాయిని పెండ్లి చేసుకుంటాడు. ఆ పెండ్లి నాకు ఇష్టం లేదు' అన్నది. ఎలాగైనా సరే పెండ్లి ఈ రోజు జరిగిపోవల్సిందే అని పట్టు పట్టింది. ఈ విషయం లక్ష్మికి, వాళ్ళ అమ్మకు ఎలా చెప్పాలో తెలియడం లేదు అతనికి. అయినా ఎలాగో అలా ధైర్యం చేసి భార్యకి చెప్పాడు. ఆమె ఒప్పుకోలేదు.
''ఇంత సడన్‌గా పెండ్లి అంటే ఎలా. తీరా పెండ్లి చేసిన తర్వాత కూడా ఆ అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయితో వెళ్ళిపోతే నా కూతురు జీవితం నాశనం అవుతుంది. వాళ్ళ అబ్బాయి కోసం నేను నా కూతురు జీవితాన్ని నాశనం చేయలేను'' అంది. అయినా అందరూ కలిసి ఒప్పించారు. అప్పుడు లక్ష్మికి 16 ఏండ్లు. కనీసం ఆమె ఇష్టం గురించి కూడా అడగలేదు. ఆ రోజు పెండ్లి జరగకపోతే రాజేష్ వేరే అమ్మాయిని చేసుకుంటాడు అనేది తప్ప మరో ఆలోచనా ఎవరికీ లేదు. ఇవేవీ ఆలోచించకుండా మొత్తానికి ఆరోజు లక్ష్మికీ, రాజేష్‌కి పెండ్లి చేసేశారు. కొన్ని రోజులకి రాజేష్ ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయి లక్ష్మితో సంతోషంగా ఉన్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టారు.
ఇద్దరూ పిల్లలు పుట్టిన తర్వాత రాజేష్ మరో అమ్మాయిని పేమించాడు. ఇది తెలిసి లక్ష్మి బాధ పడి ''పెండ్లి తర్వాత అన్ని మరిచిపోయి నాతో మాత్రమే ఉంటావు అనుకుంటే ఇప్పుడు ఇంకో అమ్మాయితో ఇలా చేస్తున్నావు'' అని పెద్ద మనుషుల్లో పంచాయితీ పెట్టింది. ''ఇక నుండి అలా చేయను, నిన్ను బాగా చూసుకుంటాను'' అని అందరి ముందు లక్ష్మికి మాట ఇచ్చాడు. సరే అని ఒప్పుకుంది. అయితే రాజేష్‌కి చిన్నప్పటి నుండి చిన్న గుండె సమస్య ఉండేది. మొదట్లో అది ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. పెండ్లి తర్వాత ఆ సమయ్య మరింత పెరిగింది. దాంతో కొడుకు గురించి లక్ష్మికి చెప్పుకొని ఏడ్చేది. లక్ష్మి కూడా ''పెండ్లి చేసుకున్న తర్వాత తప్పదు కదా, నేను కాకపోతే నా భర్తను ఎవరు చూసుకుంటారు'' అని ఆస్పత్రికి తీసుకుపోయేది.
''నీకు గుండె సమస్య ఉంది కాబట్టి క్రమం తప్పకుండా మందులు వాడాలి. అలాగే మద్యం జోలికి అసలు వెళ్ళకూడదు'' అని చెప్పాడు డాక్టర్లు. రాజేష్ మద్యం తీసుకోవడం మాత్రం మానలేదు. రోజూ కొద్దిగైనా తీసుకునేవాడు. ఇంతలో మూడోసారి వాళ్ళకు పాప పుట్టింది. దాంతో లక్ష్మి ఇంట్లోనే ఉండేది. రాజేష్ ఆటో నడిపించేవాడు. వచ్చే ఆదాయం సరిపోక ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. పాప కొద్దిగా పెరిగిన తర్వాత లక్ష్మి కూడా ఏదో ఒక పని చేసుకోవాలి అనుకుంది. కొన్ని రోజులు ఇంటికి దగ్గర్లోనే చేసింది. అక్కడ జీతం సరిపోక వేరే చోట ఉద్యోగం చూసుకుంది. అప్పటికీ వీళ్ళకు పెండ్లయి 18 ఏండ్లు. పిల్లలు ఎదిగారు. రాజేష్‌కు కూడా 40 ఏండ్లు దాటాయి. మద్యం అలవాటు ఎక్కువయింది. ఆటోకి వెళ్ళడం తగ్గించాడు. సమయానికి మందులు వేసుకోడు. ఆరోగ్యం బాగా క్షీణించింది. మద్యం మానేసి సమయానికి మందులు వేసుకోమని ఎంత చెప్పినా వినడు. వాళ్ళ అమ్మతో కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. అందరితో ఇలాగే ఉండడంతో అతనితో మాట్లాడడే మానేశారు. పిల్లలు స్కూల్‌కి వెళ్ళేవారు. లక్ష్మి ఉద్యోగానికి వెళ్ళేది. రాజేష్ ఆటో నడపాలన్నా ఆరోగ్యం సహకరించేది కాదు. అయినా ఓపిక చేసుకుని వెళ్ళేవాడు. వచ్చిన డబ్బులతో తాగేవాడు.
ఇలాంటి సమయంలోనే వాళ్ళ ఆఫీసులో ఒక అబ్బాయితో లక్ష్మికి స్నేహం కుదిరింది. అతనితో తన సమస్యలన్నీ చెప్పుకునేది. అతను లక్ష్మి కంటే పదేండ్లు చిన్నవాడు. అతనితో మాట్లాడుతుంటే ఆమెకు చాలా సంతోషంగా ఉండేది. ఇక నా జీవితం వృధా ఎవరి కోసం బతకాలి అనుకుంటున్న సమయంలో రాజుతో పరిచయం ఆమెకు కాస్త ఊరటనిచ్చింది. అయితే అది కేవలం స్నేహం మాత్రమే. రాజు ఇంటికి కూడా వచ్చేవాడు. రాజేష్‌తో, వాళ్ళ పిల్లలతో అందరితో మంచిగా ఉండేవాడు. పిల్లలకు చదువులో ఏదైనా డౌట్స్ వస్తే చెప్పేవాడు. ఎప్పుడైనా ఆలస్యం అయితే లక్ష్మిని ఇంటి దగ్గర దింపేవాడు. రాజేష్ కూడా ఎప్పుడూ వాళ్ళను అనుమానించలేదు. కానీ చుట్టు పక్కల వాళ్ళు, అత్తయ్య, ఆడపడుచులు ''నీకు వాడితో ఏదో సంబంధం ఉంది. కాబట్టి వాడు ఇంటి వరకు వస్తున్నాడు'' అని గొడవ చేసేవారు.
కానీ రాజేష్ మాత్రం ''ఇవేవీ నువ్వు పట్టించుకోకు. అమ్మ ఎప్పుడూ అలాగే అంటుంది'' అని లక్ష్మికే సపోర్ట్ చేసేవాడు. దాంతో తల్లి, చెల్లి అతనితో మాట్లాడడం మానేశారు. రాజేష్ ఆటోకి వెళ్ళడం పూర్తిగా మానేశాడు. ఇంట్లోనే ఒంటరిగా ఉండేవాడు. ఇది అతన్ని మానసికంగా కుంగదీసింది. దాంతో అతని ఆరోగ్యం పూర్తిగా క్షోణించి ఆస్పత్రిలో చేర్పించారు. కన్న కొడుకు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నా తల్లిదండ్రులు కానీ, చెల్లి కానీ రాలేదు. రాకేష్ పరిస్థితి మరింత విషమించింది. ఇంకా రెండు మూడు రోజుల కంటే ఎక్కువ బతకడని డాక్టర్లు చెప్పారు. దాంతో వాళ్ళ అమ్మ ఆస్పత్రికి వచ్చింది. రాజేష్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు కూడా రాజు ఎంతో సహాయం చేశాడు. చివరకు రాజేష్ చనిపోయాడు.
లక్ష్మి ఉద్యోగానికి సెలవు పెట్టింది. కానీ ఆఫీసులో వాళ్ళు వెంటనే రాకపోతే ఉద్యోగంలో నుండి తీసేస్తామన్నారు. దాంతో తప్పని సరి పరిస్థితుల్లో రాజేష్ చనిపోయిన 20 రోజులకే ఉద్యోగంలో చేరింది. ''భర్త చనిపోయి నెల కూడా కాలేదు అప్పుడే బయటకు వెళ్ళిపోతుంది. వాడి కోసమే వెళుతుంది'' అంటూ అందరూ సూటి పోటి మాటలు అనేవారు. ఆ సాకుతో ఇంట్లో లక్ష్మికి రావల్సిన వాటా కూడా ఇవ్వలేదు. అంతేకాదు పిల్లలను తీసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపొమ్మనారు. తనకు ఏం చేయాలో తోచక చివరకు తెలిసిన వారి సహాయంతో ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది.
తన పరిస్థితి మొత్తం విన్న సభ్యులు లక్ష్మి అత్త వాళ్ళను పిలిచి మాట్లాడారు. ''కొడుకు చనిపోతే కోడలిని, పిల్లలను ఇంట్లో నుండి వెళ్ళిపో అంటే ఎలా వెళుతుంది. ఎందుకు వెళ్ళాలి. ఆమెకు ఇంట్లో వాటా ఇవ్వాల్సిందే'' అన్నారు. ''పని చేసే చోట ఎవరితోనో సంబంధం పెట్టుకుంది. దానికి వాటా ఎందుకు ఇవ్వాలి'' అన్నారు. ''మీరు ఇలా వినకపోతే విషయం పోలీసుల వరకు వెళుతుంది. తర్వాత కోర్టు చుట్టూ తిరగలేక మీరు అల్లాడాలి'' అన్నారు లీగల్‌సెల్ సభ్యులు.
''తన కంటే పదేండ్ల చిన్న అబ్బాయితో మాట్లాడుతుంటే మీరు అనుమానిస్తున్నారు. అసలు మీ కోడలి వయసు చిన్నదే కాబట్టి మంచి అబ్బాయిని చూసి మీరే ఆమెకు పెండ్లి చేయండి, అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు. ఆమె మీకు కోడలు మాత్రమే కాదు, మేన కోడలు కూడా. ఆమె మంచి చెడ్డలు అన్నీ చూసుకోవల్సింది మీరే. చిన్న పిల్లగా ఉన్నప్పుడే బలవంతంగా పెండ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఇలా అంటే ఎలా'' అంటూ చివరకు గట్టిగా మాట్లాడి సభ్యులు ఆమెకు వాటా ఇవ్వడానికి ఒప్పించారు.
లక్ష్మితో మాట్లాడితే ''రాజేష్ చనిపోయిన తర్వాత ఒంటరి దాన్ని అయ్యాను. రాజుతో మాట్లాడితే నా మనసుకు కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే రాజుకు ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. అంతకు మించి మా మధ్య ఏమీ లేదు. ఇప్పటి వరకు బయటి ప్రపంచం గురించి నాకు పెద్దగా తెలియదు. ఇప్పుడిప్పుడే జీవితం అంటే ఏమిటో అర్థమవుతుంది'' అంది.
ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న లీగల్‌సెల్ సభ్యులు ''నీకు వయసు కూడా ఎక్కువేం లేదు. నీకు నచ్చిన వారు, అర్థం చేసుకునే వాళ్లను చూసి పెండ్లి చేసుకో. అప్పుడే నీకు నీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అలా కాకుండా తాత్కాలిక ఆనందం కోసం రాజుతో మాట్లాడుతుంటే అందరూ నిన్ను అపార్థం చేసుకుంటారు. నీ వాళ్ళందరికీ దూరం అవుతావు. సమాజమే కాదు కుటుంబం, తర్వాత కాలంలో నీ పిల్లలు కూడా అపార్థం చేసుకుంటారు. ఏది తప్పు, ఏది ఒప్పు అనేది మనమే ఆలోచించుకోవాలి. బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో. నీకు మేము ఎప్పుడూ అండగా ఉంటాము'' అని చెప్పి లక్ష్మిని పంపించారు.
- వరలక్ష్మి, 9948794051