Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కథానికలతో పాటు ఆరోగ్యకరమైన సమాజం కోసం ఆరోగ్యకరమైన విషయాల పట్ల అవగాహన కలిగించడంలో నిష్ణాతులు వీరు. వైద్య వృత్తిని అభ్యసించి స్త్రీల శారీరక రుగ్మతలకు కారణాలు వెదికారు. మహిళలకు తమ ఆరోగ్యం పట్ల అవగాహన లేకపోవడం సమస్యకు కారణమని గుర్తించారు. తన రచనల ద్వారా బాలికలు, మహిళలు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. నిరుపేద మహిళలకు తన చేతనైన రీతిగా వైద్యం చేస్తూ సామాజిక ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారు. 78 ఏండ్ల వయసులోనూ ఇంకా చేయవలసినది ఇంకా ఎంతో ఉంటుందన్నారు. ఆమే డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి. వారి జీవన ప్రస్థానం వారి మాటల్లోనే...
మీ బాల్యం గురించి చెప్పండి?
కృష్ణాజిల్లా ఆత్కూరులో పుట్టాను. గూడపాటి వరలక్ష్మి, రామకోటయ్య మా తల్లిదండ్రులు. మేము ఐదుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలం. పెద్దమ్మకు పిల్లలు లేక నన్ను పెంచుకొన్నారు. ఏడాది వయసు నుండి పెంచి పెద్దచేసి, విద్యాబుద్ధులు నేర్పించిన పెద్దమ్మ పెదనాన్నలు అట్లూరి వెంకటలక్ష్మి విలాసం, అచ్యుతరామయ్యలు జీవితాంతం తోడుగా నిలిచారు. కృష్ణాజిల్లా ఉంగుటూరులో ప్రాథమిక విద్య నుండి హైస్కూల్ చదువు వరకు చదివాను. పి.యు.సి.సెయింట్ థెరిసా మహిళా కళాశాల, ఏలూరులోనూ, ఎం.బి.బి.ఎస్. ఆంధ్రామెడికల్ కాలేజీ, విశాఖపట్నంలోనూ చదివాను. హౌస్ సర్జెన్సీ హైదరాబాద్ ఉస్మానియా వైద్య కళాశాలలో చేశాను. ఎమ్మెస్. (గైనిక్) ప్రిన్స్ వేల్స్ వైద్య కళాశాల పాట్నాలో చేరి, 1970లో యూనివర్సిటీ ఫస్ట్ గా నిలిచాను.1971 నుండి ప్రాక్టీస్ మొదలుపెట్టాను. నా మేనమామ మురళీకృష్ణమూర్తితో నా పెండ్లి జరిపించారు. వారు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలోఫార్మసీ హెడ్‌గా పని చేశారు. తర్వాత ఇండిస్టీ పెట్టి నడిపారు. మాకు ఇద్దరు అమ్మాయిలు. డాక్టర్ సమీర గైనకాలజిస్ట్, ఆమె భర్త డాక్టర్ సి.ఎల్.వెంకటరావు సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్. రెండో కూతురు డాక్టర్ తుషార ఆఫ్తల్మాల్జిస్ట్, ఆమె భర్త డా.వి.ఎన్.రామచంద్ర కార్డియాలజిస్ట్.
సాహిత్యం పట్ల ఆసక్తి ఎలా కలిగింది..?
ఆరు, ఏడు తరగతుల నుండి పుస్తకాలు చదివేదాన్ని. మా బాబాయి గ్రామ సర్పంచుగా ఉండేవారు. కనుక పంచాయతీ లైబ్రరీ పుస్తకాలు అందుబాటులో ఉండేవి. స్కూల్ లైబ్రరీలో కూడా మంచి పుస్తకాలు ఉండేవి. కనుక చిన్నతనం నుండి చదవడం ఒక వ్యసనం లాగా అయింది. 8వ తరగతిలో ఉండగా మహీధర రామ్మోహనరావుగారి కుమార్తె సర్వలక్ష్మి మాకు తెలుగు టీచర్‌గా వచ్చారు. స్కూల్ గ్రంథాలయ విభాగం వారు విద్యార్థులకు వారానికొక పుస్తకం ఇచ్చేవారు. సర్వలక్ష్మిగారు నా సాహిత్య ఆకలిని గమనించి నాకు గ్రంథాలయ పుస్తకాలను ఎక్కువగా అందజేసేవారు. అదేవిధంగా ఊర్లో ఎవరింట్లో పుస్తకాలు ఉన్నా వెళ్లి తెచ్చుకొని చదివేసి మళ్ళీ ఇచ్చేసేదానిని. పుస్తకాలు చదవడం వలన వ్యక్తిగత అభిరుచులు, ఆలోచనలూ, ప్రవర్తనలు తప్పనిసరిగా సానుకూలమైన దిశకు మరలుతాయి. నాకు కూడా అలాగే జరిగింది. తెలుగు సాహిత్యంతో పాటు హిందీ పరీక్షలు ప్రాథమిక నుండి, విశారద వరకు చదివాను. అందువల్ల హిందీ మాస్టారు, శ్రీ దత్తత్రేయ వర ప్రసాద్ సార్ చిన్న తరగతుల వారికి క్లాసులు తీసుకోమనేవారు. అంతేకాక ఆయన హిందీ సాహిత్యాన్ని నాకు చక్కగా విపులీకరించేవారు. హరివంశరాయబచ్చన్, మైథిలీ శరణగుప్త మొదలగు మంచికవుల కవిత్వాన్ని, సాహిత్యాన్ని చదవడం వలన తెలుగు సాహిత్యం మీద పట్టు ఏర్పడి, సానుకూల ప్రభావం పడింది.
మీరు ఆటల్లో కూడా ముందుండేవారని విన్నాము..?
అవును, హైస్కూల్లో ఉన్నప్పుడు సాయంత్రం చీకటి పడే వరకూ ఆటలు ఆడేదాన్ని. హైస్కూల్ నుండి టెన్నికాయిట్ ఛాంపియన్ని. జిల్లా గ్రిగ్ స్పోర్ట్స్ అండ్ గేంస్ మీట్లో కృష్ణా జిల్లా చాంపియన్. ఏలూరులో చదివేటప్పుడు కూడా పశ్చిమగోదావరిజిల్లా గ్రిగ్ స్పోర్ట్స్‌లో ఛాంపియన్. అదేవిధంగా వైజాగ్‌లో మెడికల్ కాలేజీలో చదివేటప్పుడు విశాఖ జిల్లా టెన్నికాయిట్ ఛాంపియన్ని. వరసగా మూడేండ్లు మూడు జిల్లాల్లో టెన్నికాయిట్ ఛాంపియన్‌గా నిలిచాను. స్పోర్ట్స్‌లో రన్నింగ్ విజేతను. ఆంధ్రా మెడికల్ కాలేజి స్పోర్ట్స్ చాంపియన్ని. ఇంటర్ మెడికల్, ఇంటర్కొలిజియేట్ గేంస్ అండ్ స్పోర్ట్స్ మీట్స్‌లో ఎన్నో కప్పుల్ని, పతకాల్ని గెలుచుకున్నాను
మీ సాహిత్య ప్రయాణం ఎలా కొనసాగింది?
పి.యు.సి. పరీక్షలు వ్రాసి రిజల్ట్ కోసం వేచి చూస్తున్న సమయంలో డా.పి. శ్రీదేవి రాసిన 'కాలాతీత వ్యక్తులు' చదివాను. ఆమె రచయిత్రి, డాక్టర్ కనుక ఆమెలాగా కావాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నాను. అంతవరకూ చదవడమే తప్ప రాయలేదు. అప్పుడే మొదటి కథ 'మలుపు'ను ఓ వీక్లీ పత్రిక నిర్వహించిన దీపావళి కథల పోటీకి పంపిస్తే తిరిగి వచ్చింది. వెంటనే దాన్ని మరో పత్రిక నిర్వహించిన దీపావళి కథల పోటీకి పంపగా కథకు స్పెషల్ బహుమతి వచ్చినట్టు టెలిగ్రామ్ వచ్చింది. స్నేహితులతో కలిసి హాస్టల్ కారిడార్‌లో చదువుతూ ఉండగా ఈ విషయం తెలిసి అందరిలో ఎంతో ఆనందం నిండింది. ఇంటర్ ఫస్టియర్‌లో ఉండగానే విశాఖ రచయితల సంఘం కార్యక్రమాలలో పాల్గొనగలిగాను. అప్పుడు రాచకొండ విశ్వనాథశాస్త్రి, ముప్పాళ రంగనాయకమ్మ, కారా మాస్టారు, బలివాడ కాంతారావు, అంగర వెంకటకృష్ణారావు వంటి మొదలగు మహా రచయితలు అందులో ఉండేవారు. సమావేశాలు చాలా రెగ్యులర్‌గా జరిగేవి. విశాఖ రచయితల సంఘం కార్యక్రమాలకు హాజరవడం కార్యక్రమాలకు హాజరవడం పెద్ద, పెద్ద రచయితల ప్రసంగాల్ని వినడం ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తాను. వారు వెలువరించిన 'విశాఖ' సాహితీ పత్రిక సంపాదకవర్గంలో నన్ను చేర్చారు. అది నాకు గర్వకారణమైంది. ఆ సమయంలో ఆరుద్ర, రామలక్ష్మి, ముళ్ళపూడి వెంకటరమణగార్ల తోటి పరిచయాలు చాలా గొప్పగా అనిపించేవి. భీమిలి మొదలగు వేరే ప్రాంతాలు కూడా తీసుకువెళ్ళేవారు. 2-3 సంవత్సరాలు చాలా రెగ్యులర్‌గా వెళ్ళేవాళ్ళం. నేనెందుకు రాశాను? వంటి అంశాలపై రాయించేవారు. క్లినికల్ వైపు రాగానే మేనమామతో వివాహం, ఏడాదిలో పాపాయి పుట్టడం జరిగింది.
వైద్య వృత్తి చేస్తూ రచనలు చేశారు. ఎలా సాధ్యం..?
ఆంధ్రజ్యోతి వీక్లీ సంపాదకులు పురాణం సుబ్రహ్మణ్యంశర్మగారు ఆయనే 'పేషంట్ చెప్పే కథలు' అనే శీర్షిక పెట్టి దాదాపుగా ఒక 25/30 కథలు రాయించారు. 1983లో సోవియట్ రష్యా పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ కథలు రాయడానికి అంతరాయం కలిగింది. కాకినాడ వెళ్ళిన కొత్తలో 'వనిత'లో కథ అచ్చు అయ్యాక సాహితీరంగంలో తిరిగి చూసుకొనవలసిన అవసరం లేకపోయింది. ఆంధ్రజ్యోతి, వనిత సంపాదకులు అడిగి మరీ నా చేత కథలు ప్రత్యేక సంచికలకు రాయించే వారు. వారి ప్రోత్సాహం లేకుంటే ఏనాడో రచయిత్రిగా కనుమరుగయ్యేదాన్ని అనుకుంటాను.
మీరు తీసుకొచ్చిన పుస్తకాల గురించి చెబుతారా..?
'రీడర్స్ డైజెస్ట్' అనే ఆంగ్ల పత్రికలో మన శరీరంలోని సుమారు 15 వ్యవస్థల గురించిన పరిచయం ఇంగ్లీషులో ప్రచురించారు. ''వనిత' పత్రికలో అదే నమూనాలో తెలుగులో రాసి ఇమ్మని అడిగారు. వాటినే 'మన దేహం కథ' పేరుతో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ పుస్తకంగా పబ్లిష్ చేసింది. చాలా ఏండ్లు మరల మరల ప్రచురించి పుస్తకానికి రాయల్టీ కూడా ఇచ్చేవారు. గర్భిణీ స్త్రీలకు సలహాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పడానికి సమయం లేక వారు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి 'మాతృత్వం' అను పేరుతో ఒక పుస్తకంగా రాశాను. మొదటిసారి నేనే ముద్రించుకున్నాను. తర్వాత విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారే ముద్రించేవారు. వృత్తిపరంగా చాలా బిజీగా ఉండేదాన్ని. ఓ.పీ పేషెంట్లను చూడడం, చిన్న చిన్న ప్రొసీజర్లు, మేజర్ సర్జరీలు అన్నిటితో ఊపిరి సలపని పని చేస్తున్నప్పుడే ఎక్కువ రచనలు చేసాను.
మహిళల కోసం మీరు చేసిన కార్యక్రమాలు..?
నాకు 50 ఏండ్లు వచ్చిన దగ్గర నుండీ నా సమయాన్నీ, ధనాన్నీ కూడా సమాజం కోసం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను. అలాంటి ఉద్దేశాలు గల సంస్థల్లో పనిచేసేదాన్ని. స్లమ్ ఏరియాలలో ఉచితంగా హెల్త్ కాంపులు నిర్వహించి, ఉచితంగా మందులు ఇవ్వడం చేసేదాన్ని. 1982లో మా ప్రాంతంలోని మహిళలంతా కలసి 'చైతన్య వనితా మండలి'ని ఏర్పాటు చేసి దానికి నన్ను అధ్యక్షురాలిగా ఉండమని కోరారు. అప్పటి నుండి నేటిదాకా ఆ మండలి అధ్యక్షురాలిగా కొనసాగుతున్నాను. మహిళల కోసం మహిళలే కాకుండా మహిళల అభివృద్ధి సాధికారత కోరుకునే పురుషులను కూడా చేర్చుకుని 'సెంటర్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ డెవెలప్మెంట్ ఆఫ్ ఉమెన్' అనే సంస్ధను ప్రారంభించాం. మహిళల ఉన్నతి కోసం మహిళల సాధికారత పట్ల అందరం కలిసి అనేక కార్యక్రమాలు ఉద్యమరూపంలో చేసాం.
మీరు మహిళల కోసం ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వహిస్తున్నారు అని తెలిసింది. వివరాలు చెప్పండి..?
వైద్యం కోసం నా దగ్గరకు వచ్చే వయసు పైబడిన మహిళలను గమనించాను. కుటుంబంలో తాము ఎదుర్కొనే నిరాదరణను, పడే అవమానాల్ని, బాధలను ఎవరికీ చెప్పుకోలేరు, కుటుంబం లోపల ఉండలేరు, బయటకు రాలేరు. అలాంటి మానసిక వ్యధలతో కుంగిపోయే మహిళలకు ఉపశమనం, ఆశ్రయం కలిగిచడం కోసం రోటరీ క్లబ్ అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయాలని పట్టుదలగా ప్రయత్నించాం. ముందుగా 'రోటరీ ఆశ్రయ' పేరుతో ఎనిమిది మంది వృద్ధ మహిళలతో మా ఆస్పత్రిలో వృద్ధాశ్రమాన్ని ప్రారంభించాం. తర్వాత కాలంలో వృద్ధాశ్రమం కోసం ప్రభుత్వ 1100 చదరపు గజాల స్థలం కేటాయించింది. అమెరికాలో ఉంండే ముత్యాల సీత వారి తల్లి చుండ్రు సుబ్బాయమ్మ పేరిట 5 లక్షలు విరాళంగా ఇచ్చారు. దాంతో పాటు మరెంతోమంది సహృదయంతో ఇచ్చిన విరాళాలతో 'చుండ్రు సుబ్బాయమ్మ రోటరీ ఆశ్రయ' ఏర్పడింది. 40 మంది ఉండేందుకు సౌకర్యవంతంగా, చక్కటి వాతావరణంలో ఏర్పాటు చేసిన ఆశ్రయ 22 ఏండ్లుగా నిరాటంకంగా నడుస్తుంది.
మీ భవిష్యత్ ప్రణాళిక..?
'సర్వైకల్ క్యాన్సర్ ముక్తభారత్' నినాదంతో జాతీయస్థాయి గైనిక్ అసోసియేషన్ వారి పిలుపు మేరకు పేద మహిళలకు సర్వికల్ కేన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన కలిగించి ఆవ్యాధుల నివారణకు కృషి చెయ్యాలని అనుకుంటున్నాను. కౌమార బాల్యం, ముఖ్యంగా బాలికలకు న్యూట్రిషన్, హైజీన్, లైంగిక హింస, పునరుత్పత్తి, లైంగిక ఆరోగ్యం మొదలైన అంశాలపై అవగాహన కలిగించేందుకు పుస్తకాల్ని రాయాలని అనుకుంటున్నాను.