Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెండ్లి తర్వాత చాలా మంది ఇక తమ ఆశలు, ఆశయాలు, కోర్కెలు వదిలేసుకుంటారు. కుటుంబమే జీవితంగా బతికేస్తారు. తమకంటూ సొంత ఆలోచనలు కోల్పోతారు. కానీ కొందరు మాత్రం ఎన్ని బాధ్యతలు వచ్చి పడినా తామేంటో నిరూపించుకోవాలని తపిస్తారు. దాని కోసం నిరంతరం శ్రమిస్తారు. తమకంటూ సమాజంలో ఓ గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో ఎమ్మె.రాజమల్లమ్మ ఒకరు. కుటుంబం అండగా నిలబడితే మహిళలు విజయాలు సాధించడం పెద్ద కష్టమేమి కాదని నిరూపించిన ఆమె పరిచయం నేటి మానవిలో...
మాది మాడుగుల గ్రామం, రంగారెడ్డి జిల్లా (పాత పాలమూరు). నా అమ్మానాన్నలు ఎమ్మె. బాలమ్మ, ఎమ్మె. రాములు. నాకు ఇద్దరు తమ్ముళ్లు. మాది వ్యవసాయ కూలీ కుటుంబం. మా అమ్మానాన్నలు కొద్ది పాటి భూమిలో వ్యవసాయం చేసేవారు. దానిపై వచ్చే ఆదాయం సరిపోక కూలి పనులు కూడా చేసేవారు. ఎంతో కష్టపడి నన్నూ నా ఇద్దరు తమ్ముళ్లను చదివించారు. మగపిల్లలతో పాటు నన్ను చదివిస్తుంటే చాలా మంది అమ్మ నాన్నలను 'ఆడపిల్లకు ఇంటి పని, పొలంపని నేర్పించకుండ ఎచ్చులకు చదువు నేర్పిస్తున్నారు' అని అనేవారు. అయినా వాళ్ళ మాటను మా అమ్మా నాన్నలు పట్టించుకోలేదు. మా ముగ్గురిని సమానంగా పెంచారు.
కుటుంబ బాధ్యతలు మోస్తూ...
ఒకటో తరగతి నుండి 10వ తరగతి వరకు మాసొంత ఊరు మాడుగులలో చదువుకున్నాను. హైదరాబాద్లోని మహబూబియా కళాశాలలో ఇంటర్, ఇందిరా ప్రియదర్శిని కళాశాలలో డిగ్రీ, కోఠి మహిళా కళాశాలలో పీజీ, ఆంధ్ర మహిళా సభలో టి.పి.టి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ''పాలమూరు జిల్లా తీర్థ క్షేత్ర సాహిత్యం - సమగ్ర పరిశీలన'' అనే సిద్ధాంత వ్యాసం సమర్పించి పీహెచ్డి పట్టాన్నీ పొందాను. అయితే నాకు 9వ తరగతిలో పెండ్లి చేశారు. అయినా జీవన పోరాటం చేస్తూనే పీహెచ్ డీ పూర్తిచేశాను. మా భర్త బీరయ్య, లాబ్ టెక్నీషియన్. మాకు ఇద్దరు పిల్లలు. పిల్లలను కొన్ని రోజులు మా అమ్మానాన్నలు చూసుకున్నారు. తర్వాత ఇంటి పక్కన వాళ్ళు చూసుకునేవారు. సాయంత్రం వచ్చిన తర్వాత మావారు చూసుకునేవారు. ఇలా కుటుంబ బాధ్యతలు మోస్తూ, పిల్లల్ని చూసుకుంటూ చదువుకున్నాను. ప్రస్తుతం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ అప్పుడప్పుడు పత్రికలకు వ్యాసాలు, కవితలు రాస్తుంటాను. వివిధ కవి సమ్మేళనాలలో పాల్గొని కవితా గానం చేస్తుంటాను.
స్నేహంపై మొదటి కవిత
ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు మొట్టమొదటి సారిగా స్నేహంపై కవిత రాశాను. అది అప్పటి మా తెలుగు మాస్టారుకు చూపించాను. ఆయన బాగుందని మెచ్చుకున్నారు. ఇక అప్పటి నుండి ఆయన ప్రోత్సాహంతో రాయడం మొదలు పెట్టాను. 2005లో వందేమాతరం శతజయంతి ఉత్సవాల సందర్భంగా జాతీయ సాహిత్య పరిషత్ వారు నిర్వహించిన కవిసమ్మేలనంలో మొట్ట మొదటి సారిగా 'స్వాతంత్య్రం అంటే' అనే కవిత రాసి చదివాను. పాలమూరులో, హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కవిసమ్మేళనంలో పాల్గొన్నాను. ఆ తర్వాత గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ వారు నిర్వహించిన గాంధీ విశ్వకవి సమ్మేళనం, జల పరిరక్షణ కవిత్సోత్సవం, ఆజాదికా ఆమృతోత్సవం, శ్రీ విశ్వభారతి వారి ఉగాది కవిసమ్మేళనం మొదలైన కవిసమ్మెళనాలలో పాల్గొని కవితా గానం చేశాను.
అమ్మ మనసు...
జాతీయ సాహిత్య సదస్సులలో పాల్గొని పరిశోధన పత్ర సమర్పణలు చేశాను. నన్ను తెలుగు సాహిత్యపై మక్కువ కలిగేలా చేసి వ్యాస, కవితా, పద్య రచన మెళకువలు నేర్పించిన నా గురువు, అభిమాన కవి ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి. నామొదటి పుస్తకం 'అమ్మ మనసు' వ్యాస సంకలనం ఆయనకే అంకితంగా ఇచ్చాను. నా పరిశోధన సిద్ధాంత వ్యాసం 'పాలమూరు జిల్లా తీర్థ క్షేత్రాల సాహిత్యం - సమగ్ర పరిశీలన' తెలుగు విశ్వ విద్యాలయం వారి ఆర్థిక సహాయంతో ముద్రించాను. అది నా అమ్మానాన్నలకు అంకితం ఇచ్చాను. ఆచార్య ఎన్. గోపి సార్ ప్రోత్సాహంతో వారు ప్రవేశ పెట్టిన నానీల ప్రక్రియలో 'నానీల మాణిక్యాలు' (అముద్రితం) అనే నానీలను రాశాను. 2017 తెలుగు మహసభల సందర్భంగా తెలుగు అకాడమీ వారి పిలుపు మేరకు 'గంగాపురం హనుమచ్చర్మ' మోనో గ్రాఫ్ రాశాను.
ఎక్కడ అన్యాయం జరిగినా...
'బంగరు తెలంగాణ భవ్య వాణి' అనే ఆటవెలది శతకం(అముద్రితం) రాశాను. డా.భీంపల్లి శ్రీకాంత్ ప్రవేశ పెట్టిన 'మొగ్గలు', వడిచర్ల సత్యం ప్రవేశ పెట్టిన 'మణిపూసలు' రాశాను. అలాగే మరికొన్ని నూతన ప్రక్రియల్లో కూడా కవితలు రాశాను. నేను ఏది రాసినా, ఏమి చేసినా నాకు జన్మ నిచ్చినా తల్లి దండ్రులు, ఓనమాల నుండి సాహిత్య పాఠాలు, జీవిత పాఠాలు నేర్పిన గురువుల ప్రోత్సాహం మాత్రమే. ఎక్కడ అన్యాయం జరిగినా నా అక్షరాలతో ప్రశ్నిస్తాను. ఏదో ఒక ప్రక్రియలో నేను చెప్పాలనుకున్నది చెప్తాను. కుల వివక్ష, మహిళల పట్ల జరిగిన అన్యాయం, కులదురహంకార హత్యలపైన ఓ రచయిత్రిగా కచ్చితంగా నా కలాన్ని కదిలిస్తాను.