Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇల్లు, దుస్తులు, వంట పాత్రలు.. ఒక్కోదాని శుభ్రతకు ఒక్కోటి వాడుతుంటాం. క్లీనర్లు వగైరా ఒక్కోసారి అయిపో తుంటాయి. అప్పుడు నిమ్మ ప్రయత్నించి చూడండి. పైగా రసాయనాల బెడదా ఉండదు.
- కిటికీలు, గాజు ఉపరితలాలు మిలమిలా మెరవాలని స్ప్రేలు వాడుతుంటాం కదా! కప్పు గోరువెచ్చని నీటికి వైట్ వెనిగర్ ఒక స్పూను, అర చెక్క నిమ్మరసం కలిపి దాంతో తుడిచి చూడండి.. సులువుగా శుభ్రపడతాయి, సూక్ష్మజీవులూ పోతాయి.
- కడగాల్సిన వంటపాత్రలు సింకులో ఎక్కువ సేపు ఉంచితే దుర్వాసన ప్రారంభమవుతుంది. పాత్రలు కడిగేసినా ఆ వాసన మాత్రం కొద్దిసేపు అలానే ఉంటుంది. అలాంటప్పుడు రసం తీసిన నిమ్మ చెక్కలు ముక్కలుగా కోయాలి. వాటిలో కొద్దిగా వంటసోడా కలిపి సింకులో వేయండి. తర్వాత కొద్దిసేపు నీటిని తిప్పితే సరి. వాసన త్వరగా వదులుతుంది. తర్వాత ఆ ముక్కల్ని తీసేస్తే చాలు.
- దిండు కవర్లు తలలోని నూనెలు, క్రీములు పీల్చుకొని మాసినట్లుగా కనిపిస్తుంటాయి. వదలగొట్టడం ఇబ్బందిగా ఉందా? నిమ్మ చెక్కతో ఆ ప్రాంతంలో రుద్దండి. తర్వాత గోరువెచ్చని నీటిలో వెనిగర్ వేసి, కాసేపు నానబెట్టి, ఆపై ఉతికేయండి. మరీ మొండివైతే మరోసారి ప్రయత్నించండి. మరకలు వదలడమే కాదు.. మెరుపూ వస్తుంది.
- ట్యాపులు నీళ్లు, సబ్బు మరకలతో నిర్జీవంగా కనిపిస్తున్నాయా? నిమ్మ చెక్కతో రుద్ది కాసేపు వదిలేయండి. తర్వాత నీటితో కడిగేస్తే శుభ్రంగా కనిపిస్తాయి. మరీ మొండిగా తయారైతే కాస్త బేకింగ్ సోడాలో అద్ది రుద్ది చూడండి. కాపర్, ఇత్తడి పాత్రలు త్వరగా నలుపెక్కుతుంటాయి. అప్పుడు నిమ్మచెక్కకు కళ్లుప్పు అద్ది రుద్దితే తళతళ మెరుస్తాయి.