Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గెలుపు అనేది అంత సులభం కాదు. చేసే పనిలో సఫలీకృతం కావడం, మంచి పేరు సంపాదించడం చాలా కష్టం. అనేక కష్టాలు అనుభవించి.. వాటి ఫలితాలు రుచి చూసి.. జీవితంపై కసితో గెలిచి తీరాలన్న పట్టుదలతో... ఒక్కొక్కమెట్టు ఎక్కి అనుకున్న గమ్యం చేరడానికి ఎన్నో ఎన్నెన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. మాటల తూటాలు గుండెల్లో గునపాలలాగా గుచ్చుతున్నా చలించక తమ గమ్యానికి చేరేవారు నూటికో కోటికో కొందరుంటారు. అలాంటి వారిలో ఈ బామ్మలు కూడా ఉన్నారు. వారే పెన్మెత్స ఉషా, దాట్ల సీతా రాజేశ్వరి.
ఉరుకుల పరుగుల ఈజీవితంలో సరైన తిండి తినే సమయయే దొరకడంలేదు ఎవరికీ. యంత్రంలా బతుకుతు ఆధునిక పోకడల్లో కొట్టుకుపోతున్నారు ఎందరో. సంస్కృతి, సంప్రదాయాలు మరిచిపోతున్న ఈ తరుణంలో సంప్రదాయ వంటకాల రుచి చూపిస్తున్నారు ఈ బామ్మలు.
ఓటమి గెలుపుకు నాంది
న్యూ బోయిన్పల్లిలోని వారి ఇంటిలోనే వంటలు చేస్తున్నారు ఈ అక్కాచెల్లెళ్లు. పచ్చళ్లు, వివిధరకాల పొడులు, రకరకాల చిరుతిండ్లు, స్వీట్లు ఇలా ఏం కావాలన్నా మనం ఆర్డర్ ఇచ్చిన వెంటనే సిద్దం చేస్తారు. మన ఇంటికి కూడా పంపిస్తారు. వీరి వంటకాల సువాసన కేవలం హైదాబాద్కే పరిమితం కాలేదు. దేశ విదేశాలకు కూడా విస్తరించింది. ఆర్డర్లపై విదేశాలకు సైతం పార్శిల్లలో పంపుతున్నారు. అయితే ఈ గెలుపు వారికి అంత సులభంగా దరి చేరలేదు. ఓటమి గెలుపుకు నాందీ అంటారు పెద్దలు. అవి వీరి విషయంలో చక్కగా వర్తిస్తుంది.
అరవై ఏండ్ల వయసులో...
మొదట్లో వీరు కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అయినా కూడా సహనంతో, ధైర్యంతో ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళారు. రుచికరమైన వంటలు అందిస్తూ అందరి మన్ననలను పొందుతున్నారు. ఈ బంగారు బామ్మలు 60 ఏండ్ల వయసులో కూడా ఇంకా కష్టపడుతున్నారు. తాము సంపాదించడంతో పాటు ఎందరికో పనికల్పిస్తున్నారు. మరెందరికో ఆదర్శంగా నిలబడుతున్నారు.
యువతకు ఆదర్శం
చదివిన చదువుకు సరైన ఉద్యోగాలు రాలేదని చింతించే నేటి యువతకు వీరు చక్కని ఆదర్శం. ఒక్క శాఖాహార వంటలే కాదు మాంసాహార వంటకాల్లోనూ వీరిది అందెవేసిన చెయ్యి. వారి చేతి వంట ఒక్కసారి రుచిచూసారంటే మళ్ళీ మళ్ళీ అడగాల్సిందే. ఆర్డర్ ఇచ్చి ఇంటికి తెప్పించుకోవలసిందే. అంతటి మహాద్భుతమైన రుచులతో అందరి మనసు దోచేస్తున్నారు.
విజయ రహస్యం
సామాన్య ప్రజలే కాదు వీరి వంటకాలను ఎందరో ప్రముఖులు కూడా రుచి చూస్తున్నారు. మరిచిపోయామనుకున్న మన బామ్మల నాటి వంటకాలు తిరిగి మళ్ళీ ఇప్పుడు పరిచయం చేస్తున్నారు. నేటితరం వారికి తెలియని ఎన్నో వంటకాలకు పెద్దపీట వేస్తున్నారు. సందర్భానికి తగ్గట్లుగా స్వీట్లు చేయడం వీరి ప్రత్యేకం. పండుగలకు తగ్గట్టు స్వీట్లు తయారు చేసి అమ్మడం వీరి మరో ప్రత్యేకత. శుచిగా, రుచిగా, శుభ్రంగా చేసే ఈ వంటకాలు పిల్లలను, పెద్దలను కూడా ఆకర్షిస్తూ నోరూరించడం మాత్రం తథ్యం. అది వీరి విజయ రహస్యం మాత్రమే కాదు విజయ రహస్యం కూడా.
వంటిల్లే వ్యాపార కేంద్రంగా
నేటికీ ఎంతో మంది మహిళలు బయటకు రాకుండా వంటింటికే పరిమితం అవుతున్నారు. అనేక కట్టుబాట్లు, మూఢాచారాలను బలవంతంగా మోస్తున్నారు. అలాంటి పరిస్థితులను ఎదిరించిన ఈ మహిళలిద్దరూ ఆ వంటింటినే తమ వ్యాపార సామ్రాజ్యంగా మార్చుకున్నారు. దేశ, విదేశాలలో సైతం ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. స్త్రీలు అబలలు కారు ఏదైనా సాధించే సత్తా కలిగిన సబలలని నిరూపించారు ఈ అక్కాచెల్లెళ్లు అయిన పెన్మెత్స ఉషా, దాట్ల సీతా రాజేశ్వరి. తాము స్థాపించిన బాణలి అనే సంస్థ ద్వారా ఇంత మంచిపేరు తెచ్చుకున్నారు.
- వలిపే సత్యనీలిమ,
9502156813