Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తూనే వుంది. వాతావరణ కాలుష్యం కూడా ఇలాంటి వైరస్‌లకు ఓ ప్రధాన కారణం. మన పర్యావరణానికి హాని కలిగించే వాటిలో ప్లాస్టిక్ కూడా ఒకటి. మనకు చేతనైనంత వరకు ప్లాస్టిక్‌ను నియంత్రిస్తే పర్యావరణాన్ని కాపాడినవారవుతాము. ప్లాస్టిక్ వల్ల మన పర్యావరణానికి ఎంత నష్టమో మనందరికీ తెలుసు. కాబట్టి ప్లాస్టిక్‌ని ఎలా తగ్గించాలో ఆలోచిస్తూ ఆ దిశగా ముందుకెళదాం. ఇలాంటి పరిస్థితుల్లో ఓసారి మాత్రమే ఉపయోగించి పడేసే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు అందరూ తమ వంతు ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలో మీరు కూడా పర్యావరణాన్ని కాపాడేందుకు మీ వంతుగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? అయితే మొక్కలు నాటడం వంటివి చేయడంతో పాటు.. మీరు వ్యక్తిగతంగా ప్లాస్టిక్ వాడకాన్ని కూడా తగ్గించాలి.
ప్లాస్టిక్ భూమిలో కరిగిపోదు. నీటిలో కొట్టుకుంటూ పోయి నదులు, సముద్రాలను నాశనం చేస్తుంది. అందులో ఉన్న జీవ రాశులకు హాని కలిగిస్తుంది. అలాగే మనం ఉపయోగించే ప్రతి బ్యూటీ ఉత్పత్తి కూడా ప్లాస్టిక్ డబ్బాలు, ట్యూబుల్లోనే రావడం వల్ల వాటిని ఉపయోగించగానే పడేస్తే ప్లాస్టిక్ వేస్ట్ పెరుగుతుంది. అందుకే వీలైనంత మేరకు ఈ ప్లాస్టిక్ డబ్బాలను తిరిగి ఉపయోగించే ప్రయత్నం చేయండి. కొన్ని బ్యూటీ బ్రాండ్లు ఇప్పటికే ప్లాస్టిక్ బదులుగా గాజును ఉపయోగిస్తుంటే.. మరికొన్ని సంస్థలు మాత్రం ప్లాస్టిక్ ఖర్చు తక్కువ కాబట్టి దాన్నే ఉపయోగిస్తున్నారు. ఏదిఏమైనా మనం కూడా వ్యక్తిగతంగా పర్యావరణానికి హాని కలగకుండా మనం ప్రయత్నించాలి. అందులో మొదటగా ప్లాస్టిక్ ఉపయోగించని బ్రాండ్లను వాడడం మంచి పద్ధతి. కానీ అన్నింటినీ అలా ఉపయోగించలేకపోతే.. వీలైనంత తక్కువగా ప్లాస్టిక్‌ని వాడాల్సి ఉంటుంది. వాడిన తర్వాత కంటెయినర్ డస్ట్ బిన్లో పడేయకుండా దాన్ని తిరిగి ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాంటి వాటిని తిరిగి ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం...
టోనర్, మేకప్ రిమూవర్
ఏ కంటెయినర్ ఉప యోగించాలన్నా దాన్ని ముందుగా బాగా శుభ్రం చేయాల్సి ఉంటుంది. దాన్ని లోపలి నుంచి శుభ్రం చేసి పూర్తిగా పొడిగా అయ్యేలా ఆరబెట్టాలి. ఓ గుండ్రని స్కిన్ కేర్ కంటెయినర్ తీసుకొని దాన్ని పొడిగా తుడుచుకోవాలి. ఆ తర్వాత కాటన్‌తో తయారుచేసిన ప్యాడ్స్‌ని చిన్న ముక్కలుగా చేసుకొని అందులో ఒక దానిపై మరొకటి పెట్టాలి. అందులో మేకప్ రిమూవర్ లేదా టోనర్ వేసుకొని ఒక్కోసారి ఒక్కో కాటన్ ప్యాడ్ తీసి ఉపయోగించుకోవచ్చు. కావాలంటే బేబీ ఆయిల్ వంటివి కూడా వేసి ఉంచవచ్చు. దానితోనూ మేకప్ తుడుచుకోవచ్చు. దీన్ని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు.
ఇంటి అందాన్ని పెంచేలా
పెద్ద మూత ఉన్న సిలిండ్రికల్ జార్స్ మీ దగ్గర మిగిలిపోతే వాటిని మీ ఇంటి అందాన్ని పెంచడానికి ఉపయోగిం చండి. అందులో మట్టి నింపి మరీ పెద్దగా పెరగని పూల మొక్కలు అందులో నాటండి. దాని చుట్టూ తాడు చుట్టి మీ ఇంట్లో అక్కడ క్కడా వేలాడదీయండి. చిన్న చిన్న ఎడారి మొక్కలు నాటి ఇంట్లో ఒక దగ్గర ఉంచండి. కాస్త సూర్యరశ్మి.. మరికాస్త నీళ్లు ఉంటే చాలు.. మొక్కలు మీ ఇంటికి ఎంతో అందాన్నిస్తాయి. ఇక షాంపూ బాటిల్, లోషన్ వంటి సన్న మూత ఉన్న జార్స్‌లో నీళ్లు పోసి కొన్ని పూలు పెట్టి దాన్ని ఫ్లవర్ వేజ్లా ఉపయోగించండి.
మీరే తయారు చేసుకోండి
ఫేషియల్ మిస్ట్ మన చర్మాన్ని తాజాగా ఉంచేందుకు, ఎండ బారిన పడినా తట్టుకునేందుకు తోడ్పడుతుంది. అయితే దీన్ని మార్కెట్లో కొనాలంటే చాలా ఖర్చవుతుంది. అయితే ఒక్క బాటిల్ కొన్నాక అదే డబ్బాలో మీరు ఇంట్లో సులభంగా తయారుచేసుకున్న ఫేషియల్ మిస్ట్ ద్రావణం పోసి పెట్టుకోవచ్చు. గ్రీన్ టీ మిస్ట్.. దీన్ని తయారుచేయడం చాలా సులభం. ఇందులో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది జిడ్డు చర్మానికి బాగా ఉపయోగపడుతుంది. చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. దీని తయారీ కోసం వేడి నీటిలో గ్రీన్ టీ బ్యాగ్ వేసి గంట సేపు అలాగే ఉంచాలి. ఈ నీటిని చల్లార్చి.. అందులో విటమిన్ ఇ ఆయిల్ కొన్ని చుక్కలు వేయాలి. దీన్ని స్ప్రే బాటిల్లో పోసి పెట్టుకోవాలి. ఆ తర్వాత కావాల్సినప్పుడు ఉపయోగించుకోవచ్చు.
ఫేస్ ప్యాక్స్ కోసం
ఇంట్లో తయారుచేసుకునే ఫేస్ ప్యాక్స్‌ని మనలో చాలామంది ప్రయత్నించే ఉంటారు. అయితే వాటిని అప్పటికప్పుడు తయారు చేసుకొని వాడడం, మిగిలింది పడేయడం చేస్తుంటారు. మీరూ ఇలాగే చేస్తుంటే వాడిన తర్వాత మిగిలిన పదార్థాన్ని పడేయకుండా ఫేస్ ప్యాక్ కంటెయినర్స్‌లో నింపి ఫ్రిజ్‌లో పెట్టండి. ఉదాహరణకు తాజాగా పసుపు, తేనె, చందనం, పాలు కలిపి ముఖానికి పట్టించుకోవచ్చు. దీంతో చర్మానికి మంచి మెరుపు వస్తుంది. మిగిలిన పేస్ట్‌ని పాత కంటెయినర్లో నిల్వ చేసి ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు. దాన్ని తిరిగి వారం తర్వాత మళ్లీ అప్లై చేసుకోవచ్చు. అచ్చం మొదటిసారి ఉపయోగించినప్పుడు ఎలాంటి మెరుపు సొంతమవుతుందో ఆ తర్వాత కూడా అలాగే తయారవుతుంది.
పిగ్గీ బ్యాంక్
గుండ్రని పెద్ద జార్ మీ దగ్గర ఉంటే దాన్ని పిగ్గీ బ్యాంక్‌గా ఉపయోగించండి. ఇంట్లో ఉన్న చిల్లర మొత్తం అందులో వేసి దాచుకోవచ్చు. ఈ చిల్లర మీకు అత్యవసర సమయాలలో ఉపయోగపడుతుంది. చిన్న చిన్న కొనుగోళ్లకు ఈ చిల్లర బాగా పనికొస్తుంతసది. చిల్లరను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఇలా ఒక దగ్గర ఉంచడం వల్ల అత్యవసరమైనప్పుడు చిల్లర కోసం వెతుక్కోవలసిన అవసరం కూడా ఉండదు. అయితే కొన్ని బ్యూటీ ఉత్పత్తుల సంస్థలు పాత కంటెయినర్ తీసుకొని కొత్త ఉత్పత్తికి కొంత మొత్తాన్ని తగ్గించి ఇస్తున్నాయి. అలాంటివి కూడా ఓసారి ప్రయత్నించి చూడండి.