Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వైరస్ దేశాలు, రాష్ట్రాలు దాటి పట్టణాలు, పల్లెలవైపు ప్రయాణించటం మొదలుపెట్టింది. పల్లెల్లో దాదాపు ప్రతి ఇంటికీ వెళ్ళి పలకరిస్తోంది. పట్నాల్లో మాదిరిగా ఎవరింట్లో వారుండలేరు పల్లెల్లో. అక్కడ వారికి పండగైనా, పబ్బమైనా, బాధైనా, దు:ఖమైనా సమిష్టిగా చేసుకుంటారు. పొద్దున లేచిన దగ్గర్నుంచి నీళ్ళు తెచ్చుకున్నా, కూరగాయలు వండుకున్నా, చేలకు పోయినా అన్నీ పనులు కలిసిమెలిసి చేసుకుంటారు. కాబట్టి కరోనా వారిని చూసి సహించలేకపోతోంది. ఇంటింటికి పాకుతూ ఒకరినొకరు కలవకుండా చేస్తోంది 'చేయి చేయి కలిపి ముందుకు సాగండి' అనే ఐక్యతా రాగాన్ని చెడగొడుతోంది. మనిషిని మనిషి నుంచి విడగొడుతోంది. మాట్లాడించే మనిషి లేక, వ్యాధి సంక్ర మించిన వారు అంట రానివారుగా పడి ఉండి, దగ్గరకొచ్చి నాడి చూసే డాక్టర్లను చావులతో భయపెడుతూ మొత్తం భూ ప్రపంచాన్నే తన హస్తగతం చేసుకొని వికటాట్టహాసం చేస్తున్నది. ఈ మహమ్మారిని అంతమొందించడానికి వైద్యులు, శాస్త్రవేత్తలు మాత్రం అహర్నిశలూ శ్రమిస్తూనే ఉన్నారు. అప్పటి వరకు భౌతికదూరం పాటిస్తూ, ముఖానికి మాస్క్ కట్టుకుందాం. ఇంట్లోనే ఉండి పనికి రాని వాటితో అద్భుతాలు సృష్టిద్దాం రండి!
పాత గాజులతో
గతంలో ఇంట్లో వుండే పాతగాజులతో తామరపూలు ఎక్కువగా చేసేవాళ్ళు. ఇంకా ద్వారానికి తోరణాలు కూడా చాలామంది చేసేవాళ్ళు. అప్పట్లో నేను కూడా ఇవి చేశాను. కొద్దిగా వెరైటీ ఉండాలని ఒక కోడిని కొత్తగా సృష్టించాను. అందరూ ఏ పద్ధతిలో చేస్తారో అలాగే చేస్తుంటారు మార్పులు లేకుండా. కొత్తగా తాయారైన నా కోడిని చూసి అందరూ మెచ్చుకున్నారు. మట్టి గాజుల్ని రాయితో ఎక్కడివ వరకు కావాలో అక్కడి వరకు చితగ్గొట్టి ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక దీపం పెట్టుకొని మనకు తామరపువ్వు రెక్కల్లా కాల్చుకోవాలి. ఇలా తయారైన వాటిని మరల కార్డ్‌బోర్డు మీద అతికించుకోవాలి. గాజుల్ని చితక్కొట్టేప్పుడు చిన్నచిన్న రవ్వలు ఎగిరి కంట్లో పడకుండా జాగ్రత్త వహించాలి. ఇంకా కిందపడ్డవి కాల్లో గుచ్చుకోకుండా జాగ్రత్తగా ఎత్తిపారబోయాలి. దీపం దగ్గర కాల్చేటపుడు చేయి కాల్చుకోకుండా ఉండాలి. ఇన్ని కష్టాలు పడి తయారు చేసే వాళ్ళం అప్పటి రోజుల్లో. అయితే ఇప్పుడు నేను ఆ కష్టమంతా లేకుండా సులభంగా నేర్పిస్తున్నాను. ఇంట్లో మిగిలిన పాత గాజులన్నీ ఒక దానిమీద ఒకటి వచ్చేలా, కొద్దిగా కవర్ చేస్తూ ఉండేలా అమర్చాలి. నేను స్వక్తిక్ గుర్తును, ఓంకారాన్ని కూడా గాజులతో అమర్చాను. చాలా బాగుంది మీరూ ట్రై చేయండి. వీటిని అతికించు కోవాలన్నా అతికించవచ్చు.
ప్లాస్టిక్ విడిభాగాలతో
ఈ ప్లాస్టిక్ వస్తువులు ఏ మిషన్‌లో చెడిపోయిన భాగాలో గుర్తులేదు మా హాస్పిటల్లో ఎన్నో రకాల మిషన్లు ఉంటాయి. వాటికి రిపేర్లు వస్తుంటాయి. తీసేసిన భాగాల్ని మాస్టాఫ్ ఒక పక్కగా పెడతారు వాటిని నేనేదో బొమ్మగా మారుస్తానని. సరే అలా గిన్నెలా ఉండి మధ్యలో కన్నం ఉన్న ఈ ప్లాస్టిక్ వస్తువుల్ని చూశాక ముందు పెయింట్ చేయాలన్పించింది. ఎందుకంటే పాల తెలుపు రంగులో ఉండి, ఉపరితలం నున్నగా ఉండి నీ ఇష్టం నన్నేమైనా చేసుకో అన్నట్టు ఊరిస్తున్నాయి. అందుకే వాటిపై పువ్వులు, వర్ణాలు నింపాను. సరే ఆ తర్వాతేం చేయాలో అర్థం కాలేదు. అలాగే ఉంచేద్దాలే కనువిందు చేస్తున్నాయి కదా అనుకున్నాను. అప్పుడే ఇంట్లో కాఫీ మగ్గులు పెద్దవి కనిపించాయి. దానిమీద మాఫోటోలు వేసి బహుమతిగా ఇచ్చిన మగ్గులవి. వెంటనే ఆలోచన వచ్చేసింది. ఆ కాఫీ మగ్గులపై వీటిని అమర్చాను. రెండింటి సైజు కరెక్ట్‌గా సరిపోయింది. కింద మగ్గు మీద ఫొటోలు, పైనున్న ఈ ప్లాస్టిక్ భాగంపై పెయింటింగులు అద్భుతంగా ఉన్నది. దానిలో పువ్వులే పెట్టుకుంటారో, పెన్నులే పెట్టుకుంటారో మీ ఇష్టం. ఇలా ఇంట్లో పారేసే ఏ భాగాలైనా దాయండి. దానితో అనేక చిత్రాలు చేయండి. ఇల్లంతా కళాత్మకంగా మారిపోతుంది.
ఆల్చిప్పలతో
నేను ఏ సముద్రం దగ్గరకు వెళ్ళినా అక్కడి గవ్వలు తెచ్చుకుంటాను ఆ సముద్రానికి గుర్తుగా. వాటితో ఏవో బొమ్మలు చేస్తుంటాను. ఈ విషయాన్ని ఇంకా వివరంగా కింద బొమ్మలో వివరిస్తాను. ఆల్చిప్పల్లో ముత్యాలు దొరుకుతాయని తెలుసు కదా! మనమెప్పుడూ ముత్యాలను మాత్రమే కొనుక్కుంటాం. ఆల్చిప్పలను కాదుకగా! అయితే ఆ మధ్యన వేరే దేశం నుంచి వచ్చిన బంధువు ఒకరు ఆల్చిప్పను తెచ్చి నాకు బహుకరించారు. బతికి ఉన్న ఆల్చిప్ప కాదండీ. పొట్టలో ఉన్న ముత్యాలతో సహా ఆల్చిప్పలను ప్యాక్ చేసి అమ్ముతున్నారంట అక్కడ నాకైతే చాలా సంతోషం అన్పించింది. వాటిలోని ముత్యాలను తీసి దాచిపెట్టుకుని పైనున్న పెంకును పారేయబుద్ధి కాలేదు. అందుకే దాని మీద ఒక చిత్రాన్ని పెయింట్ చేశాను. భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమను చూపించాను. ఈ మధ్య ఇద్దరి మధ్య అనుబంధాలు దూరమయ్యాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవడం లేదు. చిన్న విషయాలకే గొడవలు పడుతున్నారు. సర్దుకుపోవడం మర్చిపోయి అహంకారంతో ప్రవర్తిస్తున్నారు. దాన్ని నివారించే ఉద్దేశ్యాన్ని తెలిపే విధంగా చిత్రాన్ని వేశాను. ఇప్పుడు ఆల్చిప్పను కూడా దాచుకోవచ్చు.
ప్రవాళాల రాళ్ళతో
ప్రవాళాల రాళ్ళంటే ఏమిటి అనుకుంటున్నారా? మహా సముద్రాలలో పగడపు దిబ్బలుంటాయని మనకు తెలుసుకదా! చందమామ, బాలమిత్ర కథల్లో పగడపు దిబ్బల విహారం గురించి ఎన్నో కథలు చదువుకున్నాం. పగడాలంటే ప్రవాళాలు అన్నమాట. ఇవి సముద్ర జీవులు ఇవి ఆంథోతోవా తరగతికి చెందిన జీవులు. మరి రాళ్ళేంటి అంటారా? ఈ జీవులు కాల్షియం కార్బోనేట్‌ను విడుదల చేస్తాయి. అవి గట్టిపడి రాళ్ళలా మారతాయి. మరీ అంత గట్టిగా రాయిలా ఉండదు. సున్నపురాయిలా ఉంటుంది. తెల్లని తెలుపుతో ఉంటాయి. సముద్రాల దగ్గర రకరకాల ఆకారాల్లో ఉంటాయి. నేను అరేబియా, అట్లాం టిక్ సము ద్రాల దగ్గర కొన్నింటిని ఏర్పరచుకుంటాయి. అండమాన్ నికోబార్ దీవుల్లోని బంగాళా ఖాతంలో చాలా అందమైన కోరల్‌రీఫ్స్ ఉన్నాయి. వాటిని చూడటానికి అడు గున అద్దమున్న పడవల్లో ప్రయాణీ కుల్ని తీసుకెళతారు. అలాంటి తెల్లని సున్నపు రాళ్ళను తీసుకొచ్చి వాటిపై రకరకాల రంగులు వేశాను. ఒకదాన్ని గద్దలా తయారు చేశాను. మరొక దాన్ని కాక్టస్ చెట్టులా మార్చాను. ఇంకా చాలా బొమ్మలు తయారు చేశాను. వాటి గురించి మరోసారి వివరిస్తాను. మహాసముద్రాల్లో పగడపు దీవులు కిలోమీటర్ల పొడవున వ్యాపించి ఉంటాయి. ఎప్పుడూ కొత్త వస్తువులతో బొమ్మలు రూపొందించాలని అనుకోవడం వలన నాకు ప్రవాళాల రాళ్ళు కూడా బొమ్మలకు కాన్వాసులుగా కనిపించాయి.
- కందేపి రాణీప్రసాద్