Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొట్ట చుట్టూ కొవ్వు పెరిగితే బొజ్జ పెరిగిపోయి చూసేందుకు కాస్త ఇబ్బందిగా కనబడే సంగతి అలా వుంచితే అది అనేక అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. ఒక్కసారి కనుక బొజ్జ పెరిగిందంటే దాన్ని వదిలించుకోవడం అంత తేలిక కాదు. ఉదరంలోని అధిక కొవ్వు గుండె జబ్బులు, స్ట్రోక్‌తో సహా అనేక ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలకు దోహదం చేస్తుంది. కడుపులో కొన్ని అంగుళాల మేర కొవ్వును కోల్పోవటానికి ప్రయత్నిస్తున్నప్పుడు వ్యాయామం సరిపోకపోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామంతో పాటు సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల బొజ్జ కొవ్వును నియంత్రించవచ్చు. అదెలాగో చూద్దాం...
చక్కెరతో వుండే పానీయాలు : సోడాలో చక్కెరల రూపంలో కేలరీలు ఉంటాయి. ఈ పానీయాలు కూడా మీ నడుము కొలతను అమాంతం పెంచుతాయి. సోడా, ఇతర కార్బోనేటేడ్ చక్కెర పానీయాలు మీ జీవక్రియను నెమ్మదించేలా చేస్తాయి. శరీరంలో కొవ్వును నిల్వ చేస్తాయి. కాబట్టి చక్కెర శాతం ఎక్కువగా వుండే పానీయాలకు వీలైనంత దూరంగా వుండాలి.
ఫాస్ట్ ఫుడ్, వేపుళ్ళు : ఫాస్ట్ ఫుడ్, వేయించిన ఆహారాలలో విటమిన్లు, ఖనిజాలు లేదా ఫైబర్ చాలా తక్కువగా వుంటాయి. అవి సోడియం, ట్రాన్స్ కొవ్వులతో నిండి వుంటాయి. ఈ పదార్థాలు తీసుకోవడం వల్ల కొవ్వు పేరుకుపోతుంది. వీటిని వెంటనే మానుకోవాలి.
పాలు, పాల పదార్థాలు : క్రమం తప్పకుండా పాలు తీసుకునేవారిలో వారిలో కూడా కొవ్వు కాస్త ఎక్కువగానే పెరుగుతుంది. అందుకే పొట్టకొవ్వు అధికంగా వున్నవారు పాలు తక్కువగా తాగాలి. లేదంటే దానికి బదులుగా స్కిమ్, బాదం లేదా సోయా పాలు తాగవచ్చు.
బంగాళదుంప చిప్స్ : బంగాళాదుంప చిప్స్‌ను హైడ్రోజనేటెడ్ నూనెలు లేదా ట్రాన్స్ ఫ్యాట్లో తయారు చేస్తారు. ట్రాన్స్ ఫ్యాట్ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. గుండె జబ్బులకు దోహదం చేస్తుంది. బరువు పెరుగుతుంది. కాబట్టి వీటిని తగ్గించుకోవడం చాలా మంచిది.
పిండి, బియ్యం : తెల్ల పిండి పదార్థాలు ప్రాసెస్ చేయబడిన ఆహారాల వల్ల కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. కనుక వాటికి ప్రత్యామ్నాయంగా ఇతర ధాన్యం తీసుకోవాలి. ఇది బొజ్జ మరీ ఎక్కువగా వున్నవారి విషయంలోనే.
సోడియం అధికంగా ఉండే ఆహారాలు : ప్రతిరోజూ 2,300 ఎంజి సోడియం కంటే దాదాపు 90 శాతం మంది ప్రజలు ఎక్కువగా తీసుకుంటారు. సోడియం అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరం ఎక్కువ నీటిని నిలుపుకుంటుంది. ఫలితంగా లావవుతున్నట్టు కనిపిస్తారు. కనుక వ్యాయామంతో పాటు పైన చెప్పిన పదార్థాలను కాస్త దూరం పెడితే బొజ్జ చుట్టూ పెరిగే కొవ్వును నియంత్రించవచ్చు.