Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందమైన మోముతో పాటు ఆకర్షణీయమైన చిరునవ్వు ఆమె సొంతం. చిన్నతనం నుండి డ్యాన్స్ అంటే ఇష్టం. ఆ ఇష్టమే ఇప్పుడు ఆమెను బుల్లితెరకు పరిచయం చేసింది. మాతృభాష కన్నడ అయినా తమిళం, తెలుగులో కూడా మంచి అవకాశాలు ఆమెను వెదుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం 'నెం.1 కోడలు' సీరియల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంటుంది. ఆమే బుల్లితెర నటి మధుమతి. ఆమెతో మానవి చిట్‌చాట్...
మీ కుటుంబం, చిన్ననాటి సంగతులు చెప్పండి?
నేను పుట్టింది, పెరిగింది బెంగుళూరు. చదువుకుంది కూడా అక్కడే. అమ్మ పారిజాతా ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది. నాన్న హిరన్నయ్య రిటైర్ అయ్యారు. మేం ముగ్గురం ఆడపిల్లలం. నాకు ఒక అక్క ఒక చెల్లి. చిన్నప్పటి నుండి డ్యాన్స్, కల్చరల్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. ఆరూ, ఏడు తరగతుల నుండి భరటనాట్యం నేర్చుకున్నా. కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేశా. తర్వాత వెస్ట్రన్ కూడా నేర్చుకున్నా.
ఇండిస్టీకి ఎలా వచ్చారు?
కాలేజీకి వచ్చేసరికి మా నాన్న ఫ్రెండ్ ఒకరు ''అమ్మాయి బాగుంది, డ్యాన్స్ కూడా బాగా చేస్తుంది, ఇండిస్టీలో ప్రయత్నిస్తే బాగుంటుంది. మంచి అవకాశాలు వస్తాయి'' అన్నారు. దాంతో ప్రయత్నం చేశాం. అమ్మానాన్న కూడా చాలా ప్రోత్సహించారు. 2017లో కన్నడలో 'మహాసంగమ' అనే ఓ సీరియల్లో చిన్న పాత్రలో నటించే అవకాశం వచ్చింది. అలా ఇండిస్టీకి పరిచయమయ్యాను. తర్వాత ఓ నెగిటివ్ పాత్రలో చేశా. 'శని', 'జై హనుమాన్' అనే రెండు భక్తి సీరియల్స్‌లో కూడా నటించాను. ఆ తర్వాత తెలుగు సీరియల్ 'మనసున మనసై'లో నటించా. అలాగే తమిళంలో కూడా చేశాను. ప్రస్తుతం జీ తెలుగులో 'నెం.1 కోడలు' సీరియల్లో చేస్తున్నా.
తెలుగులో నటించడం, భాషా ఇబ్బంది ఏమీ కాలేదా?
తెలుగుకూ కన్నడకు పెద్ద తేడా ఏమీ అనిపించదు. తెలుగు చాలా తేలిగ్గా నేర్చుకున్నా. తెలుగులో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం నేను చేస్తున్న 'నెం.1 కోడలు'లో టీం చాలా సహకరిస్తారు. అందరం ఓ ఫ్యామిలీలా ఉంటాము.
ఇందులో మీ పాత్ర గురించి చెప్పండి?
నా పాత్ర పేరు సరస్వతి. అందరూ సరసూ అని పిలుస్తారు. చాలా మంచి పాత్ర చేసే అవకాశం వచ్చింది. పాజిటివ్‌గా ఆలోచిస్తూ అందరి తో మంచిగా ఉండే పాత్ర. అందరి మంచిని కోరు కునే క్యారెక్టర్ నాది. కుటుంబం పట్ల, మానవ సంబంధాల పట్ల ఎంతో బాధ్యతగా ఉంటాను. నా రియల్ లైఫ్‌కు సరిగ్గా సరిపోయే పాత్ర దొరికింది. తమిళలంలో కూడా ఇలాంటి క్యారెక్టరే ఒకటి చేశాను.
ఇండిస్టీకి వచ్చిన కొత్తలోనే పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేస్తున్నారు.. ఎలా అనిపిస్తుంది?
చాలా సంతోషంగా ఉంది. సుధా చందన్, ప్రియ గారి లాంటి సీనియర్స్‌తో నటించే అవకాశం దొరికింది. ప్రియ గారితో గతంలో ఓ తమిళ సీరియల్లో చేశాను. చాలా మంచి మనిషి. ఆప్యాయంగా పలకరిస్తారు. వారి నుండి చాలా నేర్చుకుంటున్నా. సుధాచందన్ గారితో అయితే మొదటి సారి చేస్తున్నా. ఆమెతో కలిసి పని చేస్తానని తెలిసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే కరోనా వల్ల ఇప్పటి వరకు ఆమెతో కలిసి ఒక్కరోజే వర్క్ చేశాను. త్వరలోనే ఆమెతో కంటిన్యూగా చేసే అవకాశం వస్తుంది. దానికోసమే ఎదురు చూస్తున్నాను.
సినిమాల్లో ఏమైనా ట్రై చేస్తున్నారా?
సినిమాల్లో కూడా నటించాలని వుంది. దాని కోసం ప్రయత్నిస్తున్నా. మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తాను.
ఇంట్లో సహకారం ఎలా వుంది?
ఇంట్లో నాకు అసలు ఇబ్బంది కాలేదు. పైగా చాలా సపోర్ట్ చేస్తారు. ఎక్కడైనా ఆడిషన్స్ వుంటే వెళ్ళి ట్రై చెయ్యి అని ప్రోత్సహిస్తారు. నాన్న, అక్కా దగ్గరుండి మరీ ఆడిషన్స్‌కు తీసుకెళతారు. కాబట్టే ఇంత ధైర్యంగా పని చేయగలుగుతున్నా. ఇంటి విషయంలో నేను చాలా లక్కీ అని చెప్పాలి. అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇక అమ్మ అయితే నా సీరియల్ రెగ్యులర్‌గా చూస్తుంది. ఎప్పుడైనా సరిగ్గా చేయకపోతే 'ఇంకా బాగా చేయాల్సింది' అని చెప్తుంది. బాగా చేసిన రోజు 'ఈరోజు బాగా చేశావు' అంటుంది. సలహాలూ సూచనలూ ఇస్తుంది. మా బంధువులు కూడా అమ్మ వాళ్ళ దగ్గర నా గురించి గొప్పగా చెప్తుంటారు.
ఇండిస్టీలో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది?
చాలా సంతోషంగా ఉంది. మనం పాజిటివ్‌గా ఆలోచిస్తే పాజిటివ్ కనిపిస్తుంది. చాలా మందికి ఇండిస్టీ అనగానే నెగిటివ్‌గా ఆలోచనలే వస్తాయి. సమస్యలు అనేవి అన్ని చోట్లా వుంటాయి. మనం పాజిటివ్‌గా ఆలోచిస్తే పాజిటివ్‌గానే ఉంటుంది. మన ఆలోచనలు, తీసుకునే నిర్ణయాలను బట్టి కూడా ఉంటుంది. ఇప్పటి వరకు నాకైతే ఎలాంటి ఇబ్బంది కలగలేదు. సీరియల్స్ చూసిన వాళ్ళు చాలా మంది ''బాగా నటిస్తున్నావు'' అంటూ మెసేజ్‌లు పెడుతుంటారు. వాళ్ళకు రిప్లరు కూడా ఇస్తుంటాను. ప్రేక్షకులు తమ ఇంట్లోని మనిషిలా భావిస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది.
ఆర్టిస్టు కావాలని ముందు నుండే అనుకున్నారా?
చిన్నప్పుడు డాక్టర్, ఇంజనీర్ ఇలా చాలా అనుకునేదాన్ని. కానీ ఊహతెలిసిన తర్వాత మాత్రం ఇండిస్టీలోనే చేయాలని నిర్ణయించుకున్నా. కాలేజీకి వచ్చేసరికి మరింత ఆసక్తి పెరిగింది. ఇండిస్టీకి వచ్చి మూడేండ్లే అవుతుంది. ఇంకా చాలా పాత్రలు చేయాలి. చేయడానికి ఇంకా చాలా సమయం ఉంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఉద్యోగం చేస్తే ఒకే పాత్రలో ఉండిపోతాము. అదే ఆర్టిస్టుగా అయితే అన్ని పాత్రల్లో కనిపించవచ్చు.
ఖాళీ సమయంలో ఎలా గడుపుతారు?
విజరు దేవరకొండ, మహేష్‌బాబు, సమంత సినిమాలు బాగా చూస్తాను. వేరే ఆర్టిస్టుల సినిమాలు చూస్తూ డైరెక్షన్ ఎలా వుందో గమనిస్తూ ఉంటాను. అలాగే షఉటింగ్స్ వల్ల ఫ్యామిలీతో ఎక్కువ సేపు గడిపే అవకాశం దొరకదు. అమ్మ చేతి వంటను చాలా మిస్ అవుతుంటా. అందుకే కుటుంబంతో ఎక్కువగా గడపడానికి ట్రై చేస్తా.
మీలా ఆర్టిస్టు కావాలని అనుకునేవారికి మీరేం చెప్తారు?
ఇండిస్టీ చాలా పెద్దది. సిన్సియర్‌గా, కాస్త ఓర్పుతో ప్రయత్నిస్తే కచ్చితంగా అవకాశాలు వస్తాయి. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి.. మనం వెళ్ళే దారి మంచిదై ఉండాలి. అప్పుడే మనకంటూ ఒక మంచి జీవితాన్ని నిర్మించుకోగలుగుతాం.
- సలీమా