Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓట్స్... ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలుసు. బరువు తగ్గాలనుకునే వారు ఓట్స్‌కే మొదటి ఓటు వేస్తారు. మామూలుగా అయితే ఓట్స్‌తో చేసిన వంటకాలు అంత రుచిగా ఉండవని కొంతమంది ఇష్టపడరు. ముఖ్యంగా పిల్లలు మొహం తిప్పుకుంటారు. వాటితో కాస్త వెరైటీగా సూప్స్, కుకీస్ లాంటివి చేసు కుంటే ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు. అలాంటి కొన్ని ఓట్స్ వెరైటీలు మీకోసం...
ఓట్స్ సూప్
కావల్సిన పదార్థాలు : ఓట్స్ - ఒక కప్పు, ఉల్లిగడ్డ - సగం (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), పచ్చి మిర్చి - ఒకటి (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), వెల్లుల్లి - ఒకటి, లవంగం పొడి - చిటికెడు, పెప్పర్ పౌడర్ - ఒక చిటికెడు, పాలు: ఒక కప్పు, నీళ్ళు - ఒక కప్పు, ఆయిల్ - రెండు టీ స్పూన్లు, కొత్తిమీర - గార్నిష్ కోసం, ఉప్పు - రుచికి సరిపడా.
తయారు చేయు విధానం : ముందుగా పాన్‌లో నూనెను వేసి, మీడియం మంట మీద వేడి చేయాలి. అందులో తరిగి పెట్టుకొన్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ముక్కలతో పాటు వెల్లుల్లి ముక్కలు వేసి దోరగా వేగించుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు లేత బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించికోవాలి. ఇప్పుడు వాటిలోనే ఓట్స్ కూడా వేసి, మరో రెండు నిముషాలు వేగించుకోవాలి. తర్వాత అందులో నీళ్ళు పోసి, తగినంత ఉప్పు వేయాలి. మీడియం మంట మీద ఈ మిశ్రమాన్నంతటినీ ఉడికించుకోవాలి. ఓట్స్ మెత్తగా మారేసమయం చూసి అందులో పాలు, పెప్పర్ పౌడర్ వేసి మరో నిమిషం పాటు ఉడికించుకోవాలి. అంతే ఓట్స్ మెత్తగా ఉడికిన తర్వాత స్టౌవ్ ఆఫ్ చేసి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి, వేడి వేడిగా సర్వ్ చేయాలి.
ఓట్స్, క్యారట్ సూప్
కావల్సిన పదార్థాలు : ఓట్స్ : పావు కప్పు, క్యారట్లు - రెండు, ఉల్లిగడ్డ - ఒకటి(చిన్నది), వెన్న - కొద్దిగా, ఉప్పు - రుచికి తగినంత, మిరియాలపొడి - చిటికెడు, కొత్తిమీర - కొద్దిగా.
తయారీ విధానం : ముందుగా క్యారట్ చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి మెత్తబడే వరకు ఉడికించాలి. స్టౌ ఆఫ్ చేసి కిందికి దించి పెట్టుకోవాలి. చల్లారాక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుని వడకట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌లో వెన్న వేడి చేసి ఓట్ మీట్ వేసి దోరగా వేయించాలి. తర్వాత అందులోనే నీళ్ళు పోసి రెండు, మూడు నిమిషాలు మీడియం మంట మీద ఉడికించాలి. ఓట్స్ ఉడికిన తర్వాత అందులో ముందుగా తయారుచేసి పెట్టుకొన్న క్యారట్ రసం, తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి కాస్త చిక్కబడేవరకు మరిగించాలి. ఇందులో టమాటా లేదా చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. రుచికరంగా, ఘాటుఘాటుగా ఉంటూ గొంతులో కమ్మగా దింగుతుంది.
ఓట్స్ కుకీస్
కావల్సిన పదార్థాలు : ఖర్జూరం - ఒక కప్పు(గింజ తీసి సన్నగా తరిగినవి), పంచదార - ఒక కప్పు(తీపి సరిపోదనుకుంటే), నీళ్లు - ముప్పావు కప్పు, వెన్న - అరకప్పు, మైదా - ఒకటిన్నర కప్పులు, బేకింగ్ సోడా - పావు కప్పు, ఓట్స్ - ఒకటింపావు కప్పు, ఉప్పు - అర స్పూన్.
తయారు చేసే విధానం : ఓవెన్‌ని 175 లేద 350లో వేడిచేయాలి. ఖర్జూరం ముక్కలు, పంచదార, అరకప్పు నీళ్లు కలిపి చిన్న మంటపై ఉడకనివ్వాలి. చిక్కగా మెత్తటి మిశ్రమం అయ్యే వరకు ఒక 15 నిమిషాఆలు పాటు ఉడకనిచ్చి దించేసి పక్కన పెట్టుకోవాలి. పంచదార, వెన్నని మెత్తగా క్రీంలాగా తయారుచేసుకోవాలి. మైదా, బేకింగ్ సోడా ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఓట్స్, మూడు లేక నాలుగు స్పూన్ల నీరు చల్లి బాగా కలపాలి. ఇప్పుడు ఆ మిశ్రమం చపాతీ పిండిలాగా తయారుచేసి ఆ ముద్దని 15 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉండాలి. ఫ్రిజ్ నుండి తీసిన తర్వాత ఆ ముద్దను చిన్న చపాతీలాగా గుండ్రంగా వత్తుకోవాలి. ఈ చపాతీ నుండి రెండు అంగుళాల కుకీస్‌ను కట్ చేసుకొని పెట్టుకోవాలి. సగం కుకీలను షీట్‌పై పరచి, వాటిపై తయారుచేసి పెట్టుకున్న ఖర్జూరపు మిశ్రమాన్ని ఒక స్పూన్ చొప్పున వేసి వాటిపై మిగతా సగం కుకీలను ఉంచాలి. ఓవెన్లో 15 నిమిషాలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు బేక్ చేస్తే కుకీస్ రెడీ.
టమాటా, ఓట్స్ మసాలా సూప్
కావల్సిన పదార్థాలు : టమాటాలు - రెండు, ఉల్లిగడ్డ - ఒకటి (చిన్నది), ఓట్స్ - నాలుగు టీ స్పూన్లు, పసుపు - చిటికెడు, కారంపొడి - పావు టీస్పూను, అల్లం వెల్లుల్లి ముద్ద - కొంచెం, నూనె - టీ స్పూను, కొత్తిమీర - కొద్దిగా.
తయారు చేసే విధానం : ప్యాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. ఇందులో పసుపు, కారంపొడి, అల్లం వెల్లుల్లి ముద్దవేసి మరికొద్ది సేపు వేపాలి. ఇందులో చిన్నగా తరిగిన టమాటాలు (లేదా గ్రైండ్ చేసి) తగినంత ఉప్పు వేసి కలపాలి. మొత్తం ఉడికిన తర్వాత రెండు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. అవి మరుగుతుండగా ఓట్స్ వేయాలి. ఓట్స్కూడా ఉడికి చిక్క బడ్డాక కొత్తిమీర కలిపి వేడిగా సర్వ్‌చేయాలి.