Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలకు రోజుకొక రుచికావాలి. వాళ్ళు కడుపునిండా తింటేనే అమ్మకు సంతోషం. సాధారణంగా అన్నం కంటే చిరుతిళ్ళను పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. బయటి ఫుడ్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పైగా ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో బయటి ఆహారం అసలు తీసుకోకపోతేనే బెటర్. కాస్త ఓపిక చేసుకుంటే పిల్లలతో పాటు పెద్దలూ ఇష్టపడేలా ఇంట్లోనే ఆరోగ్యకరమైన స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. మరి వాటిని ఎలా చేయాలో ఈ రోజు తెలుసుకుందాం...
స్పెషల్ సమోసా
కావలసిన పదార్థాలు: పెసర పప్పు - ఒక కప్పు, నెయ్యి - స్పూన్, కొత్తిమీర తరుగు - కొద్దిగా, నూనె - తగినంత, ఉప్పు - తగినంత, జీలకర్ర - ఒక స్పూన్, పచ్చి మిర్చిలు - ఆరు, ఆలూ - రెండు ( పెద్దవి), చింత పండు గుజ్జు - ఒక స్పూన్, అల్లం పేస్ట్ - ఒక స్పూన్, పసుపు - ఒక చిటికెడు, ఛాట్ మసాలా - అర స్పూన్, మైదా - రెండు కప్పులు.
తయారు చేసే విధానం: ముందుగా పెసరపప్పు, ఆలూ విడివిడిగా ఉడికించుకుని అందులో పచ్చిమిర్చి, ఛాట్ మసాలా, చింత పండు గుజ్జు, అల్లం పేస్ట్, పసుపు, కొత్తిమీర తరుగు వేసి కొద్దిసేపు స్టవ్ మీద ఉడికించుకుని కర్రీలా రెడీ చేసిపెట్టుకోవాలి. తరువాత మైదాలో సాల్ట్ వేసి పూరి పిండిలా కలుపుకుని పది నిముషాల ముందు నానపెట్టుకుని వుంచుకోవాలి. ఇప్పుడు చిన్న ఉండలుగా తీసుకుని వాటిని పూరీలా చేసుకుని దానిని మద్యలోకి కట్ చేసి ట్రయాంగిల్ షేప్‌లో చుట్టుకుని కర్రీని మధ్యలో స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ వేసి బాగా కాగాక సమోసాలు ఒక్కొక్కటిగా వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి సర్వింగ్ ప్లేట్ లో తీసిపెట్టుకోవాలి. అంతే స్పెషల్ సమోసా రెడీ...
ఓట్స్ చపాతి
కావల్సిన పదార్థాలు: ఓట్మీల్ పిండి - కప్పు, గోధుమపిండి - కప్పు, సెనగపిండి - కప్పు, మెంతిపొడి - అరటీస్పూను, నెయ్యి - తగినంత, ఉప్పు- తగినంత, జీలకర్ర పొడి - అరటీస్పూన్.
తయారుచేసే విధానం: ఓట్స్ పిండి, గోధుమ పిండి, సెనగ పిండి అన్నింటినీ కలిపి అందులో ఉప్పు, జీలకర్ర, మెంతిపొడి రెండు స్పూన్ల నెయ్యి గోరువెచ్చని నీళ్ళు వేసి చపాతీలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక అర గంట నానిన తరువాత ఉండలు చేసుకుని చపాతీల్లా చేసి పెనం మీద కాల్చాలి. చివరలో చపాతీ మీద నెయ్యి రాసుకుంటే సరిపోతుంది. ఈ చపాతీని ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గా కాని రాత్రీ డిన్నర్‌లోకి కాని తీసుకోవచ్చు...
స్టఫ్ఫింగ్ బ్రెడ్ రోల్ల్స్
కావాల్సిన పదార్థాలు: ఆలూ - 3, బ్రెడ్ స్లయిస్‌లు - 8, బఠానీలు - 50 గ్రాములు, ఉప్పు - తగినంత, ఉల్లిగడ్డ - ఒకటి, పచ్చిమిర్చి - 3, పసుపు - చిటికెడు, వెన్న - 100 గ్రాములు, కొత్తిమీర - అర కప్పు (కట్ చేసినది).
తయారు చేసే విధానం: ఆలూనీ బఠానీని విడివిడిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని అందులో కొంచెం వెన్న వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కల్ని వేసి వేయించాలి. తరువాత ఉడికించి, మెత్తగా చేసిన ఆలూ గుజ్జును, ఉడికించిన బఠానీలు కూడా కలిపి కొంచెం పసుపు, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి కలిపి కర్రీ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లయిస్ చివర్లు కట్ చేసి వాటి పైన తయారు చేసిన ఆలూ కర్రీని పెట్టి బ్రెడ్ స్లయిస్ కార్నర్ నుండి రోల్ల్లాగా చుట్టుకోవాలి ఇలా అన్నిటిని రెడీ చేసిపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఫ్రైయింగ్ పాన్ పెట్టి వెన్న వేసి, బ్రెడ్ రోల్ల్స్ ఒక్కొక్కటి వేసి బ్రౌన్ కలర్ వచ్చె వరకు వేయించుకుని తరువాత వాటిని రౌండ్‌గా కట్ చేసుకోవాలి...
స్వీట్ అండ్ సోర్ చాట్
కావలసిన పదార్ధాలు: ఆలూ - రెండు, మోరంగడ్డ - ఒకటి, పెరుగు - మూడు చెమ్చాలు, పుదిన ప్యూరి - ఒక చెమ్చా, డ్రై మంగో పౌడర్ - అర చెమ్చా, ఉప్పు - సరిపడ, కారం - తగినంత, నిమ్మ రసం - పావు చెమ్చా, చాట్ మసాలా - పావు చెమ్చా, మిరియాల పొడి - చిటికడు, స్వీట్ చట్నీ - అర చెమ్చా, నూనె - రెండు చేమ్చాలు.
తయారు చేసే విధానం: ఆలూ, మోరంగడ్డలని క్యూబ్‌లుగా కట్ చేసుకోవాలి. అన్నీ ఒకే సైజులో ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత వాటిని వేడి, వేడి నీటిలో వేసి ఒక్క ఉడుకు వచ్చేలా పోయ్యమీద పెట్టి తీసేయ్యాలి. అంటే పూర్తిగా మెత్త పడకూడదు అన్నమాట. ఆ తర్వాత వాటిని పెనం మీద కొన్ని, కొన్నిగా వేసి కొద్దిగా నూనెతో అన్ని వైపులా ఎర్రగా వచ్చేలా వేయించాలి. అంతకు ముందే ఒక కప్పులో పెరుగు, మిరియాల పొడి ,ఉప్పు , కారం, కలిపి ఉంచాలి. అలాగే పుదినా చట్నీ కూడా చేసి పెట్టుకోవాలి. (పుదినాని కొంచం, ఉప్పు,పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.) అలాగే చింతపండు, ఖర్జూరం, ఉప్పు, కారం కలిపి గ్రైండ్ చేస్తే స్వీట్ చట్నీ రెడీ అవుతుంది. వీటిని కూడా రెడీ చేసుకున్నాకా ఇప్పుడు వేయించిన పొటాటో, మోరంగడ్డ ముక్కలని ఒక బౌల్ లోకి తీసుకుని అందులో డ్రై మంగో పౌడర్, చాట్ మసాలా వేసి బాగా కలపాలి. చిటికెడు ఉప్పు, కారం కూడా వేసి కలిపి పక్కన పెట్టాలి. వడ్డించే ముందు పెరుగు మిశ్రమం, స్వీట్ చట్నీ, పుదినా చట్నీ కొంచం, కొంచం వేసి వడ్డించాలి. రుచి కోసం కొంచం నిమ్మరసం చల్లాలి. అంతే రుచిగా వుండే స్వీట్ అండ్ సోర్ చాట్ రెడీ ..