Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంట్లో ప్రతి రోజూ ఏం కూర చేయాలి అనే సందేహం తప్పకుండా వస్తుంది. పెద్దలకు నచ్చింది పిల్లలకు నచ్చదు. పిల్లల కోసం పెద్దలు కొన్ని రుచులు వదులుకోవాల్సి వస్తుంది. అయితే చూడటానికి కాస్త వెరైటీగా తింటానికి కమ్మగా ఉంటే ఏ కర్రీ అయినా పిల్లలే కాదు పెద్దలు కూడా హాయిగా తినేస్తారు. అలాంటి కొన్ని వెరైటీ కూరలే ఇవి. ఒకసారి మీరూ ట్రై చేసి చూడండి...
పనీర్ గోంగూర కర్రీ
కావలసిన పదార్థాలు : పనీర్ -100 గ్రాములు, నెయ్యి - కొద్దిగా, ఉల్లిగడ్డలు - రెండు, పచ్చిమిర్చి - నాలుగు, గోంగూర - నాలుగు కట్టలు, ఉప్పు - తగినంత, నూనె - తగినంత, లవంగాలు - ఆరు, కారం - టీ స్పూన్, జీడిపప్పు - పది, ఏలకులు - ఆరు, దాల్చిన చెక్క - చిన్న ముక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్, కరివేపాకు - రెండు రెమ్మలు, జీలకర్ర - స్పూన్, పసుపు - అర టీ స్పూన్.
తయారీ చేయు విధానం : ముందుగా గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లుపోసి కాస్త వేడెక్కిన తర్వాత పనీర్ వేసి అయిదారు నిముషాల తర్వాత తీసి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చేస్తే పనీర్ ముక్కలు ముక్కలుగా విరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు పాన్లో నీళ్లు పోసి గోంగూరను ఉడకపెట్టుకోవాలి. తరువాత గిన్నెలో నెయ్యి, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర, జీడిపప్పు వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించి చల్లారిన తర్వాత వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత గోంగూరను కూడా మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. బాణలిలో నూనె వేసి వేడెక్కిన తరువాత కరివేపాకు, ఉల్లిగడ్డ పేస్ట్ , అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి అందులో గోంగూర పేస్ట్, పనీర్ ముక్కలు, కొద్దిగా పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి కలిపి రెండు కప్పుల నీళ్లుపోసి తక్కువ సెగమీద ఉడికించి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి.. పనీర్ గోంగూర కర్రీ రెడీ...
మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ
కావలసిన పదార్థాలు : ఆలూ - రెండు, క్యారట్ - ఒకటి, బీన్స్ - పది, కాప్సికం - ఒకటి, చిలకడదుంప - ఒకటి, వంకాయలు - రెండు, తీపి గుమ్మిడి - చిన్న ముక్క, పాలకూర - రెండు కట్టలు, నూనె - రెండు చెంచాలు, నువ్వులు - రెండు చెంచాలు, ఉప్పు - తగినంత, పచ్చిమిర్చి - మూడు, కరివేపాకు - కొంచం.
తయారు చేయు విధానం : ముందుగా పాలకూర, ఇతర కూరలని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత బాణలిలో నూనె వేసి జీలకర్ర, పచ్చి మిర్చి, కరివేపాకు, ఆఖరున నువ్వులు వేసి ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరలన్నీ వేయాలి. అప్పుడే కొంచం ఉప్పు కూడా వేసి మూత పెట్టాలి. కూరలు మెత్తపడుతుండగా పాలకూర కూడా వేసి బాగా కలిపి మళ్ళీ మూత పెడితే, రెండు నిమిషాలలో పాలకూర మెత్తపడుతుంది. అప్పుడు మూత తీసి కొంచం సేపు వేయించాలి. ఆఖరున కొంచం బెల్లం కావాలంటే కలుపుకోవచ్చు. మరి ఎక్కువ తీపి కాకుండా కలపాలి. తీపి ఇష్టం లేని వారు బెల్లం వేయక పోయినా కూర రుచిగా వుంటుంది.
రాజ్మా రస్మిసా
కావలసిన పదార్థాలు : ఉడికించిన రాజ్మా - రెండు కప్పులు, ఉల్లిగడ్డ - మూడు, టమాటా ప్యూరి - ఒక కప్పు, పెరుగు - పావు కప్పు, ఆవాలు - ఒక స్పూన్, జీలకర్రపొడి - పావు స్పూన్, ధనియాలపొడి - పావు స్పూన్, కారం, ఉప్పు - తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒకటిన్నర స్పూన్, కొత్తిమీర - కొద్దిగా.
తయారు చేసే విధానం : రాజ్మాని రాత్రి నానబెట్టి మర్నాడు నీళ్ళు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు వెయ్యాలి. అవి చిటపటలాడాకా దానిలో ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకోవాలి. అవి కాస్త ఎర్రగా వేగాకా దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తరువాత టమాటా ప్యూరి, పచ్చిమిర్చి వేయాలి. ఐదు నిమిషాల తర్వాత దానిలో జీరాపొడి, ధనియాలపొడి, ఉప్పు, కారం, పెరుగు వేసి కలపాలి. దానిపై మూట పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత మూత తీసి అందులో రాజ్మా వేసి కప్పు నీళ్ళు కలిపి పదిహేను నిమిషాలు సన్నని మంటపై దగ్గరకి రానీయాలి. ఇలా తయ్యారయిన రాజ్మా రస్మిసాని సెర్వింగ్ ప్లేట్ లోకి తీసి పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చూడటానికి నోరూరేలాగానే కాదు తినటానికి కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది.
ఆనపకాయ తెలగపిండి కూర
కావలసిన పదార్థాలు : ఆనపకాయ ముక్కలు - పావు కేజీ, వెల్లుల్లి రేకలు - 8 నుండి 10, తెలగపిండి - పావు కప్పు, ఎండుమిర్చి - రెండు, కరివేపాకు - పది ఆకులు, ఆవాలు - పావు చెంచా, జీలకర్ర - పావు చెంచా, పసుపు - పావు చెంచా, ఉప్పు - అర చెంచా, మినప్పప్పు - అర చెంచా, ఇంగువ - కొద్దిగా, నూనె - పోపుకు తగినంత.
తయారు చేయు విధానం : ఆనపకాయ ముక్కలు చిన్న ముక్కలు కోసుకుని నూనెలో ఎండుమిర్చి, వెల్లులి, కరివే పాకు, ఇంగువ మిగతా పోపు గింజలు వేసి వేయింఛుకుని ఆనప ముక్కలు మీద కొద్దిగా ఉప్పు, పసుపు, వేసి పోపులో ఈ ముక్కల్ని మగ్గనివ్వాలి. మూడు వంతులపైగా ఉడికాక తెలగ పిండి అచ్చుని చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలో పొడిగా ఆడాలి (లేదా) తెలగపిండి పొడి దొరికితే ఆ పొడి పావుకప్పు వేసి మూతపెట్టి మగ్గ నివ్వాలి. కమ్మని వాసనతో రుచికరమైన కూర తయారవుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అన్నంతో చాలా బావుంటుంది.