Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా మళ్ళీ తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది. గతనాలుగు నెలలుగా కొద్దిగా తగ్గు ముఖం పట్టిందనుకున్నాం. అందరం వ్యాక్సిన్లు వేయించుకునే హడావిడిలో ఉన్నాం. వ్యాక్సిన్లు వచ్చేశాయన్న ధీమాతో చాలా మంది మాస్కులు లేకుండానే తిరుగుతున్నారు. శానిటైజర్లను పూర్తిగా మరిచిపోయారు. భౌతిక దూరం పాటించడం మరిచిపోయాం. ఇదే మంచి అవకాశం అని దూరిపోయింది కరోనా. గత నాలుగు నెలల నుంచి చాలా తక్కువగా నమోదవుతున్న కరోనా కేసులు నిన్న ఒక్కరోజే వెయ్యికి పైగా వచ్చాయట. ఆంధ్రప్రదేశ్‌లో పన్నెండు వందల కేసులు పాజిటివ్ అని తేలిందట. ఇలా పెరుగుతూ పోతే మరల గతంలో వలె లాక్డౌన్ అవసరం పడవచ్చు. అంత శ్రమ ఎందుకు మనకు. వారానికొకసారే కూరగాయలు తెచ్చుకుందాం. నెలకొక్కసారే కిరాణా సరుకులు తెచ్చుకుందాం. ఇంట్లో ఉండి సమయాన్ని సద్వినియోగం చేద్దాం. అందమైన ఆకృతులు సృష్టిద్దాం. మనింట్లోనే జూ పార్కు పెట్టేసుకుందాం. బయట మాత్రం తిరగద్దు. తిరిగినా మాస్కులు లేకుండా ఉండొద్దు.
అవకాడో కాయతో...
పోయిన వారం అవకాడో పండును చాలా మంది వాడుతున్నారని చెప్పుకున్నా కదా! అవకాడో పచ్చిగా ఉన్నపుడు చాలా చేదుగా ఉంటుంది. పండిన తర్వాత వెన్నలా ఉంటుంది. అందుకే దీనిని వెన్నపండు అంటారు. పిల్లలకు పాలు దొరకనప్పుడు దీనిని పెట్డడానికి ఎక్కువ ఇష్టం చూపిస్తారు. ఇది లారేసి కుటుంబానికి చెందిన మొక్క. దీనిని 'ఎలిగేటర్ పియర్' లేదా బటర్ ఫ్రూట్ అంటారు. క్రీ.పూ పదివేల సంవత్సరాల నుండి ఈ అవకాడో కాయలను వాడుతున్నారు. ఈ కాయ ఒకవైపు సన్నగా మరొకవైపు లావుగా బేరీ పండు ఆకారంలో ఉంటుంది. ఈ చెట్టు 66 అడుగుల ఎత్తు పెరుగుతుంది. నేను సగం కాయను జ్యూస్ చేసి మిగతా సగాన్ని ఫ్రిజ్‌లో ఉంచి మరిచిపోయాను. దాదాపు నెల రోజుల తర్వాత ఫ్రిజ్ సర్దేటపుడు బయటపడింది. అప్పటికి నల్లటి రంగుకు మారిపోయి ఎండిపోయింది. అయినా ఏదో జంతువు ఆకారంలా ఉందని కండ్లు ముక్కు పెట్టాను. 'యాంట్ ఈటర్' లా ఉందన్నారు పిల్లలు. కాళ్ళు లేని 'సీల్'లా ఉందన్నారు మరొకరు. సరే చర్మం మీద ముడతలకు అక్కడక్కడా రంగులు వేసి తోకను తగిలించాను. చాలా ముస్తాబయింది. నాకైతే ఏదో నీళ్ళలో ఉండే జంతువులా అనిపించింది. మరి మీకే జంతువులా కనిపిస్తుందో చెప్పండి.
ధర్మాకాల్ అట్టలతో...
మా హాస్పిటల్లో పాత ప్రింటర్ పాడయినందున కొత్త ప్రింటర్ కొనుక్కొచ్చాం. మా ఇంట్లో వాళ్లంతా ప్రింటర్ బాగా పని చేస్తుంది లేదా అని పరిశీలిస్తుంటే నేను మాత్రం లోపలున్న ధర్మోకాల్ ప్యాకింగులు ఏ విధంగా ఉన్నాయి? ఏం బొమ్మ చెయ్యవచ్చు అని చూసుకుంటున్నాను. ఆ బాక్స్‌లో కింది వైపు రెండు ప్యాకింగులు, పై వైపున రెండు ప్యాకింగులు ప్రధానంగా వచ్చాయి. మధ్యమధ్యలో విడి భాగాలకు అనుగుణంగా చిన్న చిన్న ముక్కలు వచ్చాయి. అవన్నీ నా కళ్ళకు చాలా అందంగా కనపడ్డాయి. వాటిని విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా బయటకు తీశాను. ఇవి చక్కగా కావాలని కత్తిరించి డిజైన్ చేసినట్టుగా ఉన్నాయి. ఏదో వాటిని డబ్బాలో నుంచి బయటకు తీస్తూ అనాలోచితంగా ఒక దానిపై ఒకటి పెట్టాను. ''ఏంటీ అపార్టుమెంట్ కట్టేస్తున్నావా ధర్మోకాల్తో'' అన్నాడు మా అబ్బాయి. అప్పుడే అపార్టుమెంట్ బిల్డింగ్ చెయ్యాలనిపించింది. వాటిని వరసగా బిల్డింగ్ డిజైన్ అనిపించేలా అతికించాను. మధ్యమధ్యన చిన్న చిన్న అట్టలు కూడా అతికించాను. బిల్డింగ్ లాగా అనిపించింది. కానీ సీలింగ్ లేనట్టనిపించింది. వెంటనే ఇంట్లో ఉన్న మరో ధర్మోకాల్ను పెట్టాను. దాని మీద ఒక ప్లాస్టిక్ డబ్బాను బోర్లించాను. ఇప్పుడు పూర్తిగా అపార్టుమెంటు ఆకారం వచ్చింది. నేను ఇంజనీరునయ్యాను.
ఎగ్ బాక్సులతో
నేను రోజూ బొమ్మలు చేస్తుండటం చూసిన మా కౌండౌండరు రెండు ఎగ్ బాక్సులు తెచ్చిచ్చాడు. 'వీటితో బొమ్మలు చేస్తారా' అని. సరే అని చూస్తే అవి మామూలు రంగుతో కాకుండా నీలం రంగులో ఉన్నాయి. సరే చేద్దామని వాటిని విడివిడిగా కత్తిరించాను. ప్రసాదం పెట్టే దొప్పల్లా తయారయ్యాయి. అలా అన్నీ కత్తిరించాక రెండో వైపు ఉన్న అట్టను అలాగే ఉంచాను. వాడేసిన 'నావాజెర్మినా' అనే మందుల యాంపుల్స్ ఉన్నాయి. వీటిని తెచ్చి ఒక్కొక్క దొప్పలో ఒక్కొక్క యాంపుల్ను అతికించాను. వెలుగుతున్న ప్రమిదల్లా కనిపించాయి. దాంతోపాటు 'బిస్లేరీ' వాటర్ క్యాన్ మూతలో వచ్చేరింగ్లు రెండింటిని తెచ్చి అమర్చాను. చూడండి మొత్తం ఒక చోట చేరితే ఎంత అందంగా తయారయిందో. మొత్తం నీలంతో మునిగిపోయింది.
కొబ్బరి పిందెలతో
నేను మా అబ్బాయి దగ్గరున్నపుడు చేశాను దీన్ని. అదొక గేటెడ్ కమ్యూనిటీ. అన్ని రకాల చెట్లున్నాయి. ఒక రోజు వాకింగ్ చేస్తుంటే పై నుంచి రెండు కొబ్బరి పిందెలు రాలి పడ్డాయి. ఎంత లేతగా ముద్దుగా ఉన్నాయో. వాటిని ఇంటికి తెచ్చుకున్నాను. వెంటనే ఏదో బొమ్మ చేయాలనుకున్నాను. కానీ కుదరలేదు. తీరా అవి ఎండిపోయి కింద ఉన్న రక్షక దళం విడిపోయి కేవలం కొబ్బరి బోండాల్లా మిగిలిపోయాయి. లేత ఆకుపచ్చ రంగుతో నవనవలాడేవి కాస్తా ముదురు గోధుమ రంగుకు మారాయి. ఒక పిందెను తీసుకొని కండ్లు, ముక్కు, నోరు పెట్టాను. మరో పిందెను శరీరం లాగా గుచ్చాల నుకున్నాను. అంతలో మర్నాడు వాకింగ్‌కు వెళ్ళినపుడు పాము పడగ లాంటి పూలు కనిపించాయి. ఒక్కటే రెక్క పాము పడగలానే ఉంటుంది. మధ్యలో మొక్కజొన్న కంకి లాంటి ఆకారం చిన్నగా ఉంటుంది. ఆ కంకుల్లాంటి ఆకారాలను కోసుకొచ్చి ఈ కొబ్బరి పిందె మనిషికి కాళ్ళూ, చేతులుగా అమర్చాను. చూడండి అల్లరి పిల్లోడులా భలే ఉన్నాడు.
ఆకులు, పువ్వులతో...
రెండు నెలల కిందట ఢిల్లీ వెళ్ళినపుడు ఒక హోటల్లో దిగితే లాన్లో నిలబడగానే ఒక పవ్వు రెండు ఆకులు నా మీద రాలాయి. పువ్వు ఆకారం గమ్మత్తుగా ఉంది. నన్నేదైనా బొమమ చేయవా అని నన్నడిగినట్టు అనిపించింది. గేటు దగ్గర ఉన్న ఒక అరుగు మీద కూర్చుని అప్పటికప్పుడే ఒక పక్షిని తయారు చేశాను. కన్ను కోసం అక్కడున్న మరో చెట్టు ఆకుల్ని. ఎండిన పుడకను వాడుకున్నాను. పువ్వు ఎరుపు రంగులో ఉండి సన్నని గొట్టం లాంటి తోకతో బాగుంది. దీనిని హంస చేయవచ్చు. కానీ నాకక్కడ టైము లేకపోవడంతో ఏదో ఒక పక్షిని చేశాను. పువ్వులోని కేసరాలే కాళ్ళలా ఉపయోగపడ్డాయి. ఫొటో తీస్తున్నానో లేదో, కార్ వచ్చేసిందని నాకు పిలుపు వచ్చింది.
- డా|| కందేపి రాణీప్రసాద్