Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎండాకాలం వచ్చిందంటే చాలు.. చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య స్కిన్ ట్యాన్. మామూలుగా కూడా ఎండలోకి వెళ్తే చర్మం నల్లబడడం మనం గమనిస్తూ ఉంటాం. కానీ వేసవిలో ఇది చాలా ఎక్కువ. అయితే ఎంత ప్రయత్నించినా మన శరీరంపై సన్ బర్న్, ట్యాన్ వంటివి కనిపిస్తూనే ఉంటాయి. వీటి కోసం కెమికల్స్ ఉపయోగించడం కాకుండా ఇంట్లోనే కొన్ని పదార్థాలను ఉపయోగించి ట్యాన్ తొలగించుకునే వీలుంది. అదెలాగా చూద్దాం...
- పెరుగుకి చర్మాన్ని చల్లబరిచే గుణంతో పాటు ట్యాన్ని కూడా తొలగిస్తుంది. 15 నుంచి 20 నిమిషాల పాటు ట్యాన్ వల్ల నల్లబడిన భాగాల్లో రాసి అలాగే ఉంచేయాలి. ఆ తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది.
- కలబంద మన శరీరంలోని మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. పిగ్మంటేషన్ తగ్గించేందుకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఇందులోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తాయి. అందుకే దీన్ని రెగ్యులర్ గా రాసుకుంటూ ఉండడం వల్ల మీ చర్మం డీటాన్ కావడం మాత్రమే కాదు ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది.
- సొరకాయ రసం కూడా నలుపుదనాన్ని పోగొడుతుంది. దీనికోసం ఎండలోకి వెళ్లి రాగానే ట్యాన్ బారిన పడిన ప్రాంతంలో ఈ రసాన్ని రుద్ది పది నిమిషాలు ఉంచుకొని కడిగేసుకోవాలి.
- కూరగాయలు కూడా ట్యాన్ బారిన పడకుండా మనల్ని రక్షిస్తాయి. ఇందులో ముఖ్యంగా కీర ముక్కలు, క్యాబేజీ ఆకులను వాడవచ్చు. ఈ రెండింటినీ ఫ్రిజ్లో ఉంచి వాడడం వల్ల మరింత ఫలితం ఉంటుంది. చల్లని క్యాబేజీ ఆకులను నల్లగా మారిన చర్మంపై కప్పి పావు గంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు రోజులు చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే కీరా గుజ్జును కూడా నల్లబడిన ప్రాంతంలో రుద్ది పావుగంట తర్వాత కడిగేస్తే నలుపు తొలగిపోతుంది.
- ఎర్ర పప్పును చర్మ సంరక్షణలో ఉపయోగించవచ్చు. దీనివల్ల ట్యాన్ కూడా సులభంగా తొలగిపోతుంది. దీనికోసం టేబుల్ స్పూన్ పప్పును మిక్సీలో బరకగా పట్టి అందులో టమాటా రసం, కలబంద గుజ్జు కలిపి నల్లబడిన ప్రాంతం మొత్తం పట్టించాలి. అరగంట అలాగే ఉంచుకొని తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల రెండుమూడు రోజుల్లో ప్రభావం కనిపిస్తుంది.
- టమాటా ముక్కలుగా చేసుకొని నల్లబడిన ప్రాంతాన్ని మసాజ్ చేసుకుంటే మంచిది. ఇలా పది నిమిషాల పాటు రుద్దుకొని ఆ తర్వాత ఐదు నిమిషాలు ఆరనివ్వాలి. ఆపై కడిగేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.