Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవసరాలు తీర్చలేని ఆదాయం, పెరుగుతున్న ఆర్థిక భారం ఆ భార్యాభర్తల మధ్య చిక్కులు తెచ్చిపెట్టింది. ఆపై లేనిపోని అపోహలు. భర్త తనకు తెలియకుండా అత్తకు దోచిపెడుతున్నాడని ఆమె ఆరోపణ. పుట్టింటి వాళ్ళే ఆమెకు నేర్పుతున్నారని అతని వాదన. ఇన్ని అపోహల మధ్య తన భర్తను ఎలాగైనా మంచిదారిలో పెట్టమంటూ కమల ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చదవండి...
'మేడమ్ నా భర్త పేరు కిషోర్. మా బాబుకు నాలుగేండ్లు. బాబుకు ఆరోగ్యం బాగోదు. అప్పుడప్పుడు స్పృహకోల్పోతుంటాడు. జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన మాత్రం ఇంటిని అసలు పట్టించుకోడు. మా అత్త ఆయనకు బాగా నేర్పుతుంది. గతంలో అందరం కలిసే వుండేవాళ్ళం. అక్కడ ఉండలేక వేరు కాపురం పెట్టాం. అయినా మా ఆయన నాకు తెలియకుండా వాళ్ళ అమ్మకు డబ్బులిస్తాడు. మా ఇంటి ఖర్చులకు మాత్రం ఇవ్వడు. దాంతో అప్పులు చేయాల్సి వస్తుంది. వేరు కాపురం పెట్టినప్పటి నుంచి నన్ను మా పుట్టింటికి వెళ్ళనీయడు. మా వాళ్ళతో మాట్లాడనీయడు. తాగొచ్చి గొడవచేస్తాడు. అందుకే మూడు నెలల నుంచి మా పుట్టింట్లోనే వుంటున్నా. ఈ మధ్య మా బాబుకు చాలా సీరియస్ అయింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్ళాం. ఆయనకు ఫోన్ చేసి డబ్బులు తీసుకురమ్మన్నా. కానీ ఆలస్యంగా వచ్చాడు. అందుకే మా నాన్న ఆయన్ని కాస్త కోప్పడ్డాడు. దాంతో గొడవ పెట్టుకొని బాబుని చూడకుండా వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఒక్క ఫోన్ కూడా చేయలేదు. నేను చేస్తే తియ్యడం లేదు. ఆయనతో మీరే మాట్లాడి నా సంసారాన్ని నిలబెట్టండి' అంటూ కమల ఏడ్చేసింది.
కమల మాటలు విన్న సభ్యులు ఆమెను ఓదార్చి వచ్చేవారం కిషోర్‌ను రమ్మని లెటర్ పంపారు. కిషోర్ తన తల్లిని వెంటబెట్టుకొని లీగల్‌సెల్‌కు వచ్చాడు. అతను మాట్లాడుతూ 'మేడమ్ పెండ్లి తర్వాత యేడాది అమ్మవాళ్ళతో వున్నాం. అప్పుడు కమలకు, అమ్మకు ఎప్పుడూ గొడవలే. దాంతో వేరు కాపురం పెట్టాం. అప్పటి నుంచి నన్ను మా ఇంటికి వెళ్ళ నివ్వదు. మా అమ్మా, నాన్నలకు ఆరోగ్యం బాగోదు. మా తమ్ముడు ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్ళను చూసుకోవడం వాడికి అసలు కుదరదు. అందుకే కమలకు తెలియకుండా వాళ్ళను చూసి వస్తుంటా. నాకు వచ్చేది పది వేలు. అందులో వెయ్యి అమ్మకు ఇస్తా. ఎనిమిది వేలు ఇంట్లో ఇస్తా. వెయ్యి రూపాయలు నా ఖర్చులకు వుంచుకుంటా. కమల చీటికీ మాటికీ నాతో గొడవపడి మాట్లాడితే పుట్టింటికి వెళుతుంది. వాళ్ళే ఈమెకు బాగా నేర్పుతున్నారు. అందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళద్దని అంటాను. అయినా గొడవ పెట్టుకొని మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరే వుంటుంది.
బాబు ఆస్పత్రిలో వుండగా ఫోన్ చేసింది. సమయానికి నా దగ్గర పైసల్లేవు. నేను పనిచేసే దగ్గర అప్పు చేసి ఆస్పత్రికి వెళ్ళా. దాంతో కాస్త ఆలస్యమైంది. దానికే వాళ్ళ నాన్న నన్ను బూతులు తిట్టాడు. దాంతో కోపం వచ్చింది. అందుకే అక్కడి నుండి వచ్చేశా. ఆమే, ఆమె పుట్టింటి వాళ్ళు నన్నసలు గౌరవించరు. అక్కడకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఆమె నాతో వస్తానంటే ఆమెను, బాబును తీసుకెళతా' అన్నాడు కిషోర్.
ఇద్దరూ మాట్లాడింది విన్న తర్వాత తప్పు ఇద్దరిలో వుందని సభ్యులకు అర్థమయింది. ముందు కమలతో 'చూడు కమల తల్లిని కలవొద్దని నువ్వు కిషోర్‌తో అంటున్నావు. అందుకే అతను నిన్ను నీ పుట్టింటికి వెళ్ళొద్దంటున్నాడు. పైగా దొంగతనంగా వెళ్ళొస్తున్నాడు. ఎవరూ తల్లిని వదులుకోలేరు. నువ్వు కూడా అంతే. కిషోర్ వద్దన్నా నువ్వు నీ పుట్టింటికి వెళుతున్నావు. మీ సంసారాన్ని మీ అత్త నాశనం చేస్తుందని అపోహ పడుతున్నావు. అసలు కారణం నీ ఆలోచనలు. తల్లికి సాయం చేయడం తప్పెలా అవుతుంది. అది అతని బాధ్యత. మీ పుట్టింటి వారికి ఏదైనా సమస్య వస్తే నువ్వు కూడా సాయం చేయాల్సి వస్తుంది. అందుకే ముందు నువ్వు మీ అత్తగారి కుటుంబాన్ని గౌరవిస్తే అతను నీ కుటుంబాన్ని గౌరవిస్తాడు' అని చెప్పారు.
కిషోర్‌తో మాట్లాడుతూ 'నువ్వు మీ అత్తగారి కుటుంబాన్ని గౌరవించాలి. తాగుడు మానెయ్యాలి. అసలే ఆర్థిక సమస్యలు, నీ తాగుడు వల్ల ఇంకా ఖర్చులు పెరుగుతాయి. ఇద్దరూ వచ్చిన ఆదాయాన్ని జాగ్రత్తగా ఖర్చుచేసుకోండి. బాబు ఆరోగ్యం, చదువును దృష్టిలో పెట్టుకొని పొదుపుగా వాడుకోండి. కమలకు కూడా ఏదైనా పని చూడు. అప్పుడే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. అలాగే మీ అమ్మ దగ్గకు వెళ్ళేటపుడు కమలను కూడా తీసుకెళ్ళు. ఆమెకు తెలియకుండా వెళ్ళడంతో నీ సంపాదన మొత్తం మీ అమ్మకు ఇస్తున్నావని ఆమెకు అనుమానం. అందువల్లే ఇన్ని గొడవలు. అలాగే కమలను తన పుట్టింటికి వెళ్ళనివ్వు. మీ పుట్టింటికైనా, ఆమె పుట్టింటికైనా ఇద్దరూ కలిసి వెళ్ళండి. అప్పుడు మీ మధ్య అపోహలకు అవకాశం వుండదు' అని సభ్యులు ఇద్దరికీ వివరంగా చెప్పారు.
సభ్యులు తర్వాత కిషోర్ తల్లిని పిలిచి 'మీ అబ్బాయికి ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ. అందుకే వాళ్ళ మధ్య గొడవలు. మీరు కూడా కాస్త పెద్దమనసుతో అర్థం చేసుకోండి. మీ రెండో కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఇంకా పెండ్లి కాలేదు. కాబట్టి మీ పెద్దబ్బాయి ఆదాయం పెరిగే వరకు వారి కుటుంబం సాఫీగా సాగేలా సహకరించండి'. అన్నారు.
దానికి ఆమె 'వాడు నాకు ఒక్క పైసా ఇవ్వకపోయినా పర్లేదు. వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు. ఇప్పటి వరకు మా ఇంట్లో ఇలా గొడవలు పడి రోడ్డెకినోళ్ళు లేరు. మొదటిసారి మా కోడలు మా పరువు తీసింది' అంటూ బాధపడింది.
దానికి సభ్యులు 'ఇక్కడికి రావడం చిన్నతనమేమీ కాదు. మేము కూడా మీ కుటుంబ సభ్యులమే అనుకోండి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి' అన్నారు. 'మేమూ సంసారాలు చేశాం. మాకూ సమస్యలొచ్చాయి. అయినా మేమెప్పుడూ ఇలా రొడ్డెక్కాలా?' అని వాదించింది ఆమె. మీ కాలం కాదు ఇది. ఇప్పుడు సమస్యలు వస్తే పరిష్కరించుకోడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. గతంలో ఎన్ని గొడవలొచ్చినా మహిళలు మౌనంగా భరించేవారు. కానీ ఇప్పటి కాలం వేరు. ఒకరితో ఒకరికి పడనప్పుడు నలుగురి సాయం తీసుకొని పరిష్కరించుకుంటే జీవితం సాఫీగా సాగుతుంది. మీరు అనవసరంగా ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకోవద్దు. చిన్నవాళ్ళను అర్థం చేసుకోండి. మేము కమలతో మాట్లాడాం. తన వల్ల మీకేదైనా ఇబ్బంది వస్తే మీరు కూడా మాకు చెప్పొచ్చు' అని ఆమెకు సర్ధిచెప్పారు.
అంతా విన్న తర్వాత అందరూ లీగల్‌సెల్ సభ్యులు చెప్పిన ప్రకారం చేస్తామని అందకే వెళ్ళిపోయారు. మళ్ళీ నెల రోజుల తర్వాత కమల వచ్చి 'మేడమ్ నేను కూడా ఓ బట్టల షాప్‌లో పనికి వెళుతున్నాను. నెలకు ఆరు వేలు ఇస్తున్నారు. బాబు స్కూల్‌కి వెళుతున్నాడు. ఆయన కూడా చాలా మారాడు. అంతా మీ వల్లనే' అని సంతోషంగా చెప్పింది.
మీ ఆనందానికి కారణం మేము కాదు, మీరే... మీ ఆలోచనలు మార్చుకుని ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారు. అందుకే సంతోషంగా ఉంటున్నారు. అందరూ ఇలా ఉంటే ఎలాంటి సమ్యలు వచ్చినా సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఇకపై మీ సంసారంలో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకునే బాధ్యత మీ ఇద్దరిదే' అని చెప్పి పంపారు.
- సలీమ