Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెండకాయలు సంవత్సరమంతా మార్కెట్లో లభిస్తాయి. కానీ... ఇంట్లోనే వాటిని పండించుకుంటే ఆ తృప్తే వేరు. పైగా బయట దొరికేవాటిని పండించేందుకు పురుగుమందులు వాడుతారు. అదే ఇంట్లోనే పండించుకుంటే ఎంతో ఆరోగ్యం. ఇందుకోసం భారీగా స్థలం అక్కర్లేదు. పెద్దగా ఉండే కుండీ ఉన్నా చాలు. మరి కుండీలోనే బెండకాయ సాగు ఎలా చేపట్టాలో తెలుసుకుందాం.
- ఇళ్లలో ఏ మొక్కలు పెంచాలన్నా మంచి విత్తనాలు, నాణ్యమైనవి వాడాలి. ముందుగా ఓ వీలైనంత పెద్దగా ఉండే కుండీ తీసుకోండి. మరీ ఎక్కువగా ఎండ పడని చోట ఆ కుండీని ఉంచండి. అలాంటి చోట బెండ మొక్క బాగా పెరుగుతుంది.
- నాణ్యమైన విత్తనాలు కొనండి. లేదంటే ఆన్లైన్ ఈ కామర్స్ సైట్లలోనూ లభిస్తాయి. విత్తనాలు సరిగ్గా ఉంటే మొక్క ఏపుగా, బలంగా పెరుగుతుంది. మట్టిలో విత్తనాలను 3 అంగుళాల లోతున ఉంచాలి.
- ముందుగా కుండీలో మట్టివేసి కాసేపు ఎండలో ఉంచండి. మట్టిలోని తడిని ఎండ లాగేసుకుంటుంది. మొక్క సరిగా పెరగాలంటే ఈ ప్రక్రియ అత్యంత ముఖ్యమైనది. ఇలా చేయకపోతే విత్తనం నుంచి మొక్క సరిగా రాదు.
- విత్తనాలను కుండీ మధ్యలో 3 అంగుళాల లోతున ముంచి కాస్త ఒత్తిడితో నొక్కండి. తర్వాత మట్టితో మొత్తం మూసేయండి. తర్వాత కొద్దిగా నీరు పొయ్యండి. ఇందుకోసం నెమ్మదిగా నీరు పోసే వాటర్ కేన్ వాడితే మంచిదే.
- విత్తనాలకు మొక్కగా ఎదిగేందుకు నీరే ముఖ్యం. ఎండాకాలంలో నీరు చాలా అవసరం. అందువల్ల కుండీలో ఉదయం, సాయంత్రం వేళ కొద్దిగా నీరు పొయ్యండి. దాంతో విత్తనాలు త్వరగా మొక్కగా పెరుగుతాయి.
- ఇళ్లలో పెంచే మొక్కలకు సహజ ఎరువులు వాడాలి. కంపోస్ట్ ఎరువును కుండీల్లో వాడితే మంచిది. అది మొక్కలకు కావాల్సిన పోషకాలను ఇస్తుంది. కంపోస్ట్ ఎరువు మొక్కలకు చాలా మంచిది. దాన్లో చాలా పోషకాలు ఉంటాయి.
- ఒక విషయం గుర్తుంచుకోండి. విత్తనాలను నాటిన తర్వాత కుండీని వీలైనంతవరకూ నీడలోనే ఉంచండి. డైరెక్టుగా ఎండ పడితే చిట్టి మొక్కలు తట్టుకోలేవు. ఏదైనా చెట్టుకింద ఉంచితే మరీ మంచిది. తద్వారా తక్కువ ఎండను అవి తీసుకుంటాయి.
- విత్తనాల నుంచి బెండకాయ మొక్కలు 2 నుంచి 3 వారాల్లో పెరుగుతాయి. ఈ సమయంలో కుండీలో గడ్డిమొక్కలు ఇతరత్రా ఏవైనా మొలిస్తే వాటిని తొలగించండి. లేదంటే బెండకాయ మొక్కలు సరిగా రాకుండా అవి అడ్డుకుంటాయి.
- ఒక్కసారి మొక్క రావడం మొదలైతే ఇక బెండకాయలు కాసేవరకూ పెరుగుతూనే ఉంటుంది.
- రోజువారీ జాగ్రత్తలు తీసుకుంటే ఇలా సాగుచేసుకుంటే ఇంట్లోనే తాజా బెండకాయలు లభిస్తాయి.