Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2020 మార్చి... ఇద్దరు అమ్మాయిలు... హనీన్ ఫరీద్.. దిషా పాండా... 17 ఏండ్ల వయసున్న వీరిరువురు కలిసి విద్యలో లింగ అసమానతపై పోరాడాలని దృఢ సంకల్పంతో అడుగులు ముందుకు వేశారు. దానికోసం 'ప్రాజెక్ట్ ఆరంభ' ను ప్రారంభించారు. ప్రస్తుతం 44 మంది అమ్మాయిలకు కాలేజీ విద్యను ఉచితంగా అందించేందుకు 15 లక్షలు సమీకరించారు. ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన లాభాపేక్షలేని సంస్థగా ఇది మారిపోయింది. ఆ ఇద్దరు యువతులు చేస్తున్న కృషి గురించి నేటి మానవిలో తెలుసుకుందాం...
ఈ ఇద్దరమ్మాయిలు ఆడపిల్లల చదువు కోసం నిధుల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టి గత సంవత్సరంలో 44 మంది బాలికలకు సుమారు 15 లక్షల రూపాయలను సమీకరించారు. ''మేము మొత్తం మూడు విద్యా సంవత్సరాలకు కావల్సిన ఆర్థిక సహకారం అందిస్తామని వారికి మాట ఇచ్చాము. వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటే మాకు మరో రూ.19 లక్షలు అవసరం'' అంటుంది ఫరీద్.
ప్రాజెక్ట్ ఆరంభం
పరీద్ చెప్పిన ప్రకారం ఈ ప్రాజెక్ట్‌ను రెండు భాగాలుగా విభజించుకున్నారు. ఒకటి నిధుల సేకరణ, మరొకటి అమ్మాయిలకు ప్రత్యేక కెరీర్ ప్రోగ్రామ్. దీనికోసం కావల్సిన డబ్బును సేకరించడానికి వీరు మూడు ఆన్లైన్ క్రౌడ్-ఫండింగ్ ప్రచారాలను నిర్వహించారు. వాటిలో ఒకటి ఇంపాక్ట్ గురులో కొనసాగుతోంది. అయితే హిమాలయ హెర్బల్స్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ నుండి కార్పొరేట్ స్పాన్సర్‌షిప్‌ను పొందగలిగారు. దీని ద్వారా వారికి రూ .8 లక్షల గ్రాంట్ వచ్చింది. ఈ మొత్తం 14 మంది బాలికల విద్యావసరాలను తీర్చగలిగింది.
కెరీర్ గైడెన్స్
పత్యేకమైన కెరీర్ ప్రోగ్రాం కింద వారు ఆన్లైన్ వర్క్‌షాప్‌లను నిర్వహిస్తారు. దీని కోసం వారు భారతదేశంలోని అత్యంత అర్హత కలిగిన కెరీర్ కోచ్‌లు దేబేషి చక్రవర్తి, పారుల్ సిద్దిఖీతో పాటు ఇతరుల సహకారం కూడా తీసుకున్నారు. విద్యార్థులకు ఉద్యోగం సంపాదించుకోవడానికి అవసరమైన ప్రాధమిక నైపుణ్యాలను వారు అక్కడ నేర్పిస్తారు. ఇంటర్వ్యూలకు అవసరమైన పత్రాలను ఎలా తయారు చేసుకోవాలి, లింక్డ్ఇన్ వంటి ఉద్యోగ ఇంటర్వ్యూకు అవసరమైన కొన్ని ప్రాథమిక నైపుణ్యాలను వారికి అందిస్తారు. అలాగే ప్రొఫైల్-బిల్డింగ్, గోల్ సెట్టింగ్‌లో కూడా శిక్షణ ఇస్తారు.
బలహీనతలు అధిగమించేలా
వీరిప్పుడు జీవితంలో ఏదో సాధించాలని పెద్ద పెద్ద కలలు కనే విద్యార్థులకు సహాయం చేయగలుగుతున్నారు. దానితో వారు ఇప్పుడు ఆర్థికంగా వారి కాళ్ళపై వారు నిలబడేలా తమ జీవితాలను తీర్చిదిద్దుకుంటున్నారు. ''మేము మా అమ్మాయిలలో సాంకేతిక నైపుణ్యాలను అందించాలనుకోవడమే కాక.. పెద్దగా కలలు కనేలా సహాయపడతాము. పేదరికం నుండి, అట్టడుగు వర్గాల నుండి వచ్చిన అమ్మాయిలకు ఎన్నో బలహీనతలు వుంటాయి. ముఖ్యంగా వారిపై వారికి నమ్మకం ఉండదు. విజయం సాధించాలంటే ముందు ఉండాల్సింది మనపై మనకు బలమైన నమ్మకం. ముందు వారిలో అలాంటి నమ్మకాన్ని కల్పించే ప్రయత్నం చేస్తాము'' అంటుంది ఫరీద్.
అసలు ఎలా ప్రారంభమైంది?
సంవత్సరం కిందట 1వీ1దీ వారు వీరి పాఠశాలకు వచ్చి తమ 1వీ1దీ నిర్వహించే ఫ్యూచర్ లీడర్స్ ప్రోగ్రామ్‌ను పరిచయం చేశారు. ఇది ప్రపంచంలోని అత్యంత ఆశాజనక నాయకులుగా మనల్ని తీర్చిదిద్దుతుంది. యుఎన్ ఎస్డీజీ వారి ద్వారీ ఈ శిక్షణ ఇవ్వబడుతుంది. వారు ఈ వాలంటీర్లకు శిక్షణ ఇస్తారు. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ మంది ప్రజలను ప్రభావితం చేయబోయే ఒక మిలియన్ మంది నాయకులను సృష్టిస్తారు. ఇది వారి జీవితాలకే కాక అనేక ఇతర మహిళల జీవితాలకు కూడా ఓ మంచి మార్గాన్ని చూపించబోతోందని వారు గ్రహించారు.
న్యూయార్క్ సమ్మిట్‌లో...
న్యూయార్క్‌లోని యుఎన్ ప్రధాన కార్యాలయంలో 1వీ1దీ యాక్టివేట్ ఇంపాక్ట్ సమ్మిట్ 2021లో చేరడానికి 120 మంది విద్యార్థుల నుండి ఎంపికైన వారిలో ఈ ఇద్దరమ్మాయిలు కూడా ఉన్నారు. ఫరీద్ చెప్పిన ప్రకారం వారి ప్రాజెక్ట్ ప్రారంభించిన సంవత్సరంలోనే ఎంతో అభివృద్ధి చేయాలనుకున్నారు. వారు అనుకున్నట్టే తమ ప్రాజెక్ట్ అభివృద్ది కోసం బీజాలు పడ్డాయి. న్యూయార్క్ సమ్మిట్‌లో పాల్గొనే అవకాశాన్ని పొందారు.
సవాళ్లను అధిగమిస్తూ...
వీరు ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత దేశవ్యాప్తంగా లాక్డౌన్ మొదలయింది. దాంతో వీరనుకున్న లక్ష్యం చేరడం అంత అంత సులభం కాదని అర్థమయింది. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా వారు అనుకున్నట్టుగా ఆన్ గ్రౌండ్ ఆపరేషన్లు చేయలేకపోయారు. దాంతో వీరిద్దరూ కలిసి ప్రత్యామ్నాయ పద్ధతులను ఆశ్రయించారు. వ్యక్తిగతంగా అమ్మాయిలను పిలిచి శిక్షణ ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. దాంతో ఆన్లైన్ వర్క్‌షాప్‌లను నిర్వహించడానికి ప్రయత్నించారు. దీని కోసం చాలా మంది స్పీకర్లను కలిసి సహకారం అడిగారు. అలాగే నిధుల సమీకరణ కోసం కార్పొరేట్ స్పాన్సర్‌షిప్‌ను కూడా పొందగలిగారు. వీరుత ఎదుర్కొన్న ప్రధాన సవాళ్లలో ఒకటి సాంప్రదాయ సంకెళ్ళల్లో చిక్కుకున్న అమ్మాయిలను బయటకు తీసుకురావడం. వారిని వ్యక్తిగతంగీ తయారు చేయడానికి, వారి గురించి పూర్తిగా తెలుసుకోవడానికే వీరికి కొన్ని వారాలు పట్టింది.
రాజకీయాల్లోకి వస్తా...
''ఏది ఏమైనప్పటికీ, మా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుండి మాకు ఎంతో సహకారం అందింది. అంతే కాకుండా నార్త్ బెంగళూరులోని మా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ మంజు బాలసుబ్రమణ్యం నుండి కూడా మాకు ఎంతో మద్దతు లభించడంతో మా ప్రయత్నం కొద్దిగా సులభం అయ్యింది. అయితే మొదట్లో విరాళాలు మాత్రం పెద్దగా రాలేదు. అంతేకాక నన్ను ఎప్పుడూ ఈ పోరాటంలో కొనసాగించేలా చేస్తున్నది ఒకటే. అది ఏదో ఒక రోజు నేను రాజకీయాల్లోకి రావాలన్న నా కోరిక. రాజకీయ నాయకులు ప్రజా సంక్షేమం కోసం పనిచేసే ప్రజా సేవకులుగా ఉండాలి. ఈ ప్రాజెక్ట్ ద్వారా నేను కూడా ఇదే చేయాలనుకుంటున్నాను'' అంటుంది ఫరీద్.
అంతిమ లక్ష్యం
300 మంది బాలికలను 'ప్రాజెక్ట్ ఆరంభ' ద్వారా విద్యావంతులను చేయడమే తమ అంతిమ లక్ష్యం అని ఆ ఇద్దరమ్మాలు చెబుతున్నారు. ''వారి జీవితంలో అద్భుతాలు చేయాలనుకునే విజయవంతమైన మహిళలకు అవకాశాలు సృష్టించడానికి మేము ప్రయత్నిస్తున్నాము'' అంటున్న ఈయువత సేవకులను పొగడకుండా ఉండగలమా...
అమ్మాయిలకు చోటేది?
రాజకీయాల పట్ల నా బలమైన అభిప్రాయాన్ని పంచుకున్న ప్రతి సారి ఎంతో మంది విమర్శిస్తూనే ఉన్నారు. రాజకీయాల పట్ల నాకున్న అభిరుచిని సమాజం నిరంతరం విస్మరిస్తుంది. 'మీరు రాజకీయాల్లో విజయం సాధించలేరు ఎందుకంటే మీరు అమ్మాయి కాబట్టి!', 'రాజకీయాల్లో అమ్మాయిలకు చోటు లేదు!' అనే మాటలో పదే పదే వినబడుతుంటాయి. ఇది నన్ను నిజంగా నిరుత్సాహపరిచింది. నా వయసులో ఉన్న అమ్మాయిలు నాలా నిరుత్సాహపడటం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ద్వారా వారి కలలను నిజం చేసుకోవడానికీ, వారు తమ జీవితంలో ఏం కావాలనుకుంటున్నారో అది కావడానికి అవసరమైన సహాయం చేయాలనుకుంటున్నాను.
- హనీన్ ఫరీద్