Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొన్ని రకాల మొక్కలు ఇంటిలోపలి వేడిని లాగేసుకుంటాయి. అందువల్ల వేసవిలో కూడా చల్లగా ఉంటుంది. ఎండాకాలం మాత్రమే కాదు... అన్ని కాలాల్లోనూ మొక్కల్ని ఇంట్లో పెంచుకోవడం మంచిదే. అవి మన నుంచి వచ్చే కార్బన్ డై ఆక్సైడ్‌ను తీసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తాయి. అలాగే ఇంట్లో వేడిని తగ్గిస్తాయి. ఇవి పెరగడానికి ఎండ అంతగా అవసరం లేదు. ఇంట్లోని సాధారణ వేడి సరిపోతుంది. చూడటానికి కూడా ఎంతో అందంగా ఉంటాయి. వేడి ఎక్కువైనప్పుడు మొక్కలు తమ నుంచి చల్లదనాన్ని బయటకు వదులుతాయి. నాసా పరిశోధనలో ఈ విషయం తెలిసింది. మరి ఆ మొక్కలేవో మనమూ తెలుసుకుందాం.
బెంజమిన్ ఫైకస్: ఈ మొక్కలు ఇంటి లోపల ఎన్ని ఉంటే అంత చల్లగా ఉంటుంది. అంటే మరీ ఏసీలా అవ్వదు గానీ... చాలా వరకూ వేడిని లాగేస్తాయి.
బోస్టన్ ఫెర్న్: ఈ మొక్కను మీరు చూసే ఉంటారు. ఇది చెడు గాలిని మంచిగా మార్చేయగలదు. గాలిలో విష పూరిత వాయువులు ఉంటే ఇది లాగేసుకుంటుందని నాసా పరిశోధనలో తేలింది. దీనికి ఎండ తగలకుండా చూసుకోవాలి. ఇది ఉక్కపోతను తగ్గిస్తుంది.
అలోవెరా: ఈ మొక్క గురించి తెలియని వారు దాదాపుగా ఉండరు. ఇది చాలా ఇళ్లలో ఉంటుంది. ఇందులో నీరు చాలా ఉంటుంది. కాలిన గాయాలకు దీని గుజ్జు ఉపయోగపడుతుంది. ఇది కూడా గాలిలో వేడిని బాగా తగ్గిస్తుంది.
స్నేక్ ప్లాంట్: ఇది చూడటానికి పాములా ఉంటుంది. ఇందులో కూడా నీరు ఎక్కువగానే ఉంటుంది. ఇది కూడా వేడిని బాగా పీల్చుకుంటుంది. కిటికీ దగ్గర ఇవి ఎన్ని మొక్కలు పెట్టుకుంటే అంతలా చల్లదనం లోపలికి వస్తుంది.
బాంబూ పామ్: ఇంట్లో ఓ మూల ఈ మొక్కను ఉంచితే ఆ అందమే వేరు. ఇంట్లో ఉక్కపోత ఉంటే ఇది ఊరుకోదు. లాగేసుకుంటుంది. దీని పెద్ద ఆకులు చల్లదనాన్ని ఇస్తాయి. ఇది కూడా విష వాయువుల్ని లాగేసుకుంటుంది. దీనికి కొద్దిగా ఎండ పడుతూ, నీడ పడుతూ ఉండాలి. డైరెక్టుగా ఎండ పడకూడదు.
స్పైడర్ ప్లాంట్: దీన్ని ఎలా ఉంచినా హాయిగా పెరుగుతుంది. కచ్చితంగా ఇంట్లో వేడి తగ్గాలి అనుకునేవారు ఈ మొక్కను పెంచుకోవచ్చు.
పీస్ లిల్లీ: ఈ మొక్క చిన్నగా ఉంటే చల్లదనం అంతగా రాదు. పెద్ద ఆకులు ఉండేది ఎంచుకోవాలి. ఇది బాగా పెరిగేలా చుట్టూ ఎక్కువ ప్లేస్ దీనికి ఇవ్వాలి. డైరెక్టు ఎండ పడనక్కర్లేదు. చక్కగా చల్లదనం ఇస్తుంది.
రబ్బర్ మొక్క: దీనికి పెద్ద ఆకులు వస్తాయి. ఎక్కువ చల్లదనం ఇస్తుంది. చిన్న మొక్కకు కూడా పెద్ద ఆకులు ఉంటాయి. ఈ మొక్క ఉండే నేల మరీ తడిగా, మరీ పొడిగా లేకుండా చూసుకోవాలి. తరచూ నీరు పొయ్యాలి. ఆ జాగ్రత్త తీసుకుంటే ఇది చాలా చల్లదనాన్ని ఇస్తుంది.
పోథోస్ లేదా డెవిల్స్: ఈ మొక్క కూడా అందరి ఇండ్లలో ఉండే వుంటుంది. చాలా అందంగా ఉంటుంది. దీన్ని రోజూ పట్టించుకోవాల్సిన పని లేదు. దానంతట అదే పెరుగుతుంది. దీన్ని మనీ ప్లాంట్ అని కూడా అంటారు. దీని ఆకులు హదయం ఆకారంలో ఉంటాయి కాబట్టి చాలా మందికి ఇది అంటే ఇష్టం. ఇది నీడలోనే చక్కగా పెరుగుతుంది.
చైనీస్ ఎవెర్గ్రీన్: ఇది ఎప్పటికీ గ్రీన్‌గా ఉంటూ చల్లదనం ఇస్తుంది. అదే పనిగా వేడెక్కిపోయే ఇంట్లో ఈ మొక్కల్ని ఎక్కువగా పెంచుకోవాలి. ఇది చాలా వేగంగా వేడి గాలుల్ని పీల్చేసుకుంటుంది. అయితే ఎక్కువ ఆకులు ఉండేది కొనుక్కోవాలి.
అరెకా పామ్: దీనికి కాస్త స్థలం ఎక్కువ కావాలి. చాలా మంది నేలలో దీన్ని పాతుతారు. ఇది ఇంట్లోని ఉక్కపోతను తగ్గిస్తుంది. చూడటానికి అందంగా ఉంటుంది. చెడుగాలిని మంచిగా చేస్తుందని నాసా పరిశోధనలో తేలింది. ఎండ డైరెక్టుగా పడకపోతే ఇది బాగా పెరుగుతుంది.