Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత స్టార్ అథ్లెట్.. పరుగుల చిరుత హిమ దాస్‌కు అస్సాం రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఐపిఎస్ క్యాడర్ ఇచ్చి గౌరవించింది. 21 సంవత్సరాల హిమ 2018లో ప్రపంచ జూనియన్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశాన్ని ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపింది. అంతేకాదు ఆసియా క్రీడల్లోనూ స్వర్ణం, రజతం సాధించి మన దేశ కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేసింది. తన చిన్ననాటి కల ఈ రోజుతో నెరవేరిందని.. పోలీస్ అధికారి కావాలన్న తన కోరికను క్రీడలపై ఉండే ఇష్టంతోనే నెరవేరిందంటున్న ఆమె గురించి మరిన్ని విశేషాలు ఈ రోజు మానవిలో తెలుసుకుందాం...
అస్సాంలోని నాగయోన్ జిల్లాలోని ఢింగ్ గ్రామంలో జనవరి 9, 2000 సంవత్సరంలో ఓ రైతు కుటుంబంలో పుట్టింది హిమదాస్. తండ్రి రొంజిత్ దాస్, తల్లి జొనాలి దాస్. కుటుంబంలోని నలుగురు పిల్లలలో హిమదాస్ అందరి కంటే చిన్నది. అయినా బరువు బాధ్యతలు మాత్రం ఎక్కువే. ఆమె తండ్రి వరి పండించేవారు. హిమ చిన్నతనంలోనే తండ్రితో పాటు పొలం పనికి వెళ్లేది. అలాగే చిన్నతనం నుండే క్రీడలపై మక్కువ కనిపించే హిమదాస్ ప్రపంచ ట్రాక్ ఈవెంట్ ప్రస్థానం అంచలంచలుగా సాగింది.
విద్యాభ్యాసం..
హిమ విద్యాభ్యాసం అంతా డింగ్ పబ్లిక్ హైస్కూల్లోనే జరిగింది. ప్రారంభంలో తాను ఫుట్ బాల్ ఆడటంలో ఆసక్తి చూపించేది. అందులోనే ప్రావీణ్యత సంపాదించింది. అంతేకాదు అప్పట్లోనే చిరుతపులిలా పరుగెత్తడాన్ని చూసి ఆమెను అందరూ 'డింగ్ ఎక్స్ ప్రెస్' అని పిలిచేవారు. స్కూల్లో వున్నప్పుడు అక్కడి మగపిల్లలతో కలిసి ఫుట్ బాల్ ఆడేది. మొదట్లో ఫుట్ బాల్ ఆటనే తన గమ్యంగా ఎంచుకుంది.
గోల్ మార్చుకుంది
చిన్నప్పటి నుండే ఫుట్ బాల్ ఆడటం ప్రారంభించినా తర్వాత కాలంలో తన పరుగును గోల్ పోస్ట్ నుండి ట్రాక్ మీదకు మార్చుకుంది. నవోదయ విద్యాలయకు చెందిన ఫిజికల్ ఎడుకేషన్ ట్రైనర్ అయిన సాంసుల్ హోక్వ్ సలహతో తన అభిరుచిని ఫుట్ బాల్ నుండి తక్కువ దూరం రేసుల్లో పరుగెత్తడం ప్రాక్టిసు మొదలెట్టింది. సాంసుల్ హోక్వ్ హిమదాస్‌ను నాగోన్ స్పోర్ట్స్ అసోసియేసకు చెందిన శంకర్ రోరుకు పరిచయం చేశారు. రన్నింగ్ ప్రాక్టీస్.. షంసుల్ హోక్ సలహాలతో ఫుట్ బాల్ నుండి రన్నింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది. తను స్కూలుకు వెళ్లే దారి కూడా కొండలు, లోయలతో నిండి ఉన్న ప్రాంతం కావడంతో కిలోమేటర్ల మేరకు అలాగే నడుచుకుంటూ వెళ్లేది. అలా కొండకోనలను దాటుతూ.. పరుగెత్తుతూ పాఠశాలకు చేరుకునేది. అలా అక్కడే పరుగెత్తుతూ పరుగులో రాటుదేలింది. ఈ విధంగా ఇంకా వేగంగా ప్రపంచంలో అందరికంటే వేగంగా పరుగులు తీసి కేవలం 18 ఏండ్ల వయసులో ప్రపంచాన్ని జయించింది. భారతదేశ పతాకాన్ని ఆకాశమంత ఎత్తుకు సగర్వంగా ఎగరవేసింది.
సరైన వసతులు లేకున్నా..
పాఠశాలకు వెళ్ళడం కోసం కిలోమీటర్ల కొద్ది కొండలు దాటిన హిమ సహజసిద్ధమైన అథ్లెట్‌గా అతి కొద్ది కాలంలో ఎదిగిపోయింది. ప్రతిరోజూ తన తండ్రితో కలిసి పొలం పనులు చేస్తూ మరింత దృఢంగా తయారైంది. అనంతరం అథ్లెటిక్స్‌లో అడుగుపెట్టిన హిమదాస్ సరైన వసతులు లేకపోయినా మొక్కవోని దీక్షతో సాధన కొనసాగించింది. బురదలా ఉండే ఫుట్‌బాల్ మైదానంలో కఠోర శిక్షణ చేసింది.
పరుగు పందెంలో మెరుపులు
మొదట్లో జిల్లా స్థాయి పోటీలలో పాల్గొని నాసిరకం దుస్తులు, షూలతోనే 100 మీటర్లు, 200 మీటర్లలో బంగారు పతకాలు పొంది తమ జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపింది. అంతర్ జిల్లా పోటీకి ఎన్నికై రెండు బంగారు పతకాలను సాధించింది. ఈ పోటీల్లో హిమ ప్రతిభను డైరెక్టరేట్ అఫ్ స్పొర్ట్స్ అండ్ యూత్ వెల్ఫెర్కు చెందిన అథ్లెటిక్ కోచ్ నిపోన్ దాస్ గుర్తించాడు. దాంతో అమెకు సరికొత్త క్రీడా జీవితం మొదలైంది. హిమ విజయకాంక్షకు అనుగుణంగా నిపోన్‌దాస్ రూపంలో స్ఫూర్తిని ఇచ్చే గురువుదొరికాడు. ఆయన హిమ తల్లి దండ్రులను ఒప్పించి అమెను గౌహతికి తీసుకెళ్లాడు. మొదట్లో అద్దె ఇంట్లో వుంటూ ప్రాక్టిసు చేసేది. ఇలా అయితే అనుకున్న లక్ష్యం సాధ్యం కాదని గ్రహించిన నిపోన్ దాస్ అమెను సరుస జారు స్పోర్ట్స్ కాంప్లెక్స్ హాస్టల్లో చేర్పించాడు. 100, 200 మీటర్ల పరుగు పందెంలో మెరుపులు మెరిపించిన హైమదాస్ను నిపోన్, సహకోచ్ నవజీత్ అమెను 400 మీటర్ల కేటగిరికి మార్చారు.
తొలి స్వర్ణంతో చరిత్ర..
ఐఏఏఎఫ్ ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్లో భారతదేశం తరపున తొలిసారి స్వర్ణం గెలిచిన తొలి మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. ఫిన్లాండ్ వేదికగా జరిగిన ఐఏఏఎఫ్ వరల్డ్ అండర్ -20 అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. అక్కడ 400 మీటర్ల పరుగు పందెంలో విజేతగా నిలిచింది. ఈ ట్రాక్‌లో భారతదేశం స్వర్ణం సాధించడం అదే తొలిసారి.
18 రోజుల్లోనే..
అథ్లెట్లోకి అడుగు పెట్టిన అతి తక్కువ కాలంలోనే హిమ అంటే ఆడ పిల్ల కాదు.. ఆడపులి అనే పేరును తెచ్చుకుంది. చెక్ రిపబ్లిక్స్లో జరుగుతున్న అథ్లెటిక్స్‌లో కేవలం 18 రోజుల్లో ఐదు స్వర్ణాలను సాధించింది. అంతేకాదు 400 మీటర్ల పరుగు పందెంలో 52.09 సెకన్ల సమయంలో పూర్తి చేసి రికార్డు నెలకొల్పింది.
ఎన్నో అవార్డులు..
హిమదాస్ ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం 2018లో అర్జున అవార్డు ఇచ్చి సత్కరించింది. అదే ఏడాదిలో యునిసెఫ్ ఇండియాకు యూత్ అంబాసిడర్‌గా నియమితురాలైంది. అంతర్జాతీయ ఈవెంట్లో భోగేశ్వర్ బరువా తర్వాత అస్సాం నుండి గోల్డ్ మెడల్ సాధించిన రెండో ప్లేయర్‌గా హిమ చరిత్రకెక్కింది. అస్సాం ప్రభుత్వం కూడా తనను స్పోర్ట్స్ అంబాసిడర్‌గా నియమించింది. పరుగుల రాణి ఉషను గుర్తు చేస్తూ 19 ఏండ్లకే స్ప్రింటర్‌గా అంతర్జాతీయ ఈవెంట్లో సత్తా చాటింది. ప్రస్తుతం డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్న ఆమెపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కూడా హిమకు అభినందనలు తెలిపారు. 'నిన్ను ఇలా చూడటం గర్వంగా ఉంది' అంటూ తన ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.