Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వినీతా బాలి... బ్రిటానియా సంస్థ మాజీ ఎండి అయిన ఈమె ప్రస్తుతం అక్షయ పాత్ర ఫౌండేషన్ కన్సల్టేటివ్ సభ్యురాలిగా ఉన్నారు. పిల్లలు, వృద్ధులకు పోషకాహారం అందించేలా కృషి చేస్తున్నారు. కరోనా సమయంలో ఎంతో మంది ఆకలి తీర్చారు. వలస కార్మికులకు అండగా నిలిచారు. అంతేకాదు సమాజం మహిళల పట్ల చూపుతున్న వివక్షపై ప్రశ్నిస్తూ అసమానతలను రూపుమాపేందుకు తన వంతు కృషి చేస్తూ ఆకలి లేని దేశాన్ని చూడాలి అంటూ ఆమె ఇటీవలె హర్ స్టోరీకి ఇచ్చిన ఇంటర్య్వూ సారాంశం ఈ రోజు మానవిలో...
ప్రపంచ జనాభాలో ఆరవ వంతు భారతదేశంలోనే వుంది. కానీ ప్రపంచ పోషకాహారలోపంలో మాత్రం మూడింట ఒక వంతు వుంది. లాక్డౌన్ ప్రజలకు జవనోపాధి లేకుండా చేసింది. కోవిడ్ - 19 మహమ్మారి ప్రారంభం కావడంతో పోషకాహార సమస్య మరింత తీవ్రమైంది. చాలామంది పేద పిల్లలు మధ్యాహ్న భోజనం ప్రారంభించిన తర్వాత పాఠశాలకు వెళ్ళి కాస్త కడుపు నింపుకుంటున్నారు. ప్రస్తుతం పాఠశాలలు మూసివేయడంతో దాన్ని కూడా కోల్పోయారు. ఆకలితో అలమటిస్తున్నారు.
అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా పిల్లల ఆకలిని తీర్చడానికి మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు?
వాస్తవానికి నాకు అక్షయ పాత్రతో ఎన్నో ఏండ్ల నుండి అనుబంధం వుంది. అప్పటి నుండి ఈ సంస్థ వివిధ రూపాలను తీసుకుంది. బ్రిటానియా న్యూట్రిషన్ ఫౌండేషన్‌లో భాగంగా మధ్యాహ్న భోజనాన్ని ప్రత్యేకంగా రూపొందించి ఐరన్ కలిగిన బలవర్థకమైన బిస్కెట్లు అందించడంతో మా పని ప్రారంభించాము. బ్రిటానియాలో ఉన్నప్పటి నుండే అక్షయ పాత్రతో సన్నిహితంగా ఉన్నాను. ఇటీవలె వారి కన్సల్టేటివ్ కౌన్సిల్లో సభ్యురాలినయ్యా. ఇప్పుడు దాని ప్రాముఖ్యత గురించే నిత్యం చర్చించుకుంటాము. పిల్లలకు కనీసం ఒక్కపూటైనా తాజాగా ఉండే పోషకాహారం అందించేలా ప్రయత్నిస్తున్నాం.
ప్రస్తుతం కరోనా వల్ల పిల్లలు పాఠశాలకు వెళ్ళలేకపోతున్నారు. మరి ఇలాంటి సమయంలో వారికి ఆహారం ఎలా అందిస్తున్నారు?
ఇది చాలా దురదృష్టకర పరిస్థితి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం మొదలైన తర్వాతనే కొద్దోగొప్పో పిల్లలు పాఠశాలల్లో ఉంటున్నారు. రోజూ తమకు ఆహారం దొరుకుతుందని ఆశపడ్డారు. కోవిడ్ - 19 తో పాఠశాలలు మూసివేయబడ్డాయి. ఈ సమస్యను ఎదుర్కోడానికి అక్షయ పాత్ర చాలా త్వరగా ఒక మోడల్‌ను తయారు చేసింది. ఆహారం పాడుకాకుండా ఉండేలా ప్రత్యేకమైన రేషన్ కిట్లను తయారుచేసింది. ఆ కిట్లను విద్యార్థుల కుటుంబాలకు పంపిణీ చేస్తున్నాము. రోజూ 1.8 మిలియన్ల పిల్లలకు ఈ కిట్లు అందిస్తున్నాం.
ఇంత మంది పిల్లలకు కిట్లు అందించడం అంటే సాధారణ విషయం కాదు. మరి ఎలా చేయగలుగుతున్నారు?
ఒక్క పిల్లలకు మాత్రమే కాదు పని కోల్పోయి నగరాల నుండి తిరిగి వారి గ్రామాలకు తరలివచ్చిన వలస కార్మికులకు కూడా ఫౌండేషన్ భోజనం అందిస్తోంది. మేము ఈ రెండు ప్రయోజనాల కోసం వంటశాలలను ప్రారంభించాం. ఆహారం కోసం కిట్లను తయారు చేయడం ఒకటైతే. పిల్లలు వారి కుటుంబాలకు ఆ సమయంలో అవసరమయ్యే పరిశుభ్రత కోసం శానిటైజర్లతో పాటు విద్యను అందించే ప్రయత్నం కూడా చేశాము. అయితే ఈ పని అంత సులభమైనది కాదు. అందుకే పాఠశాలలు తిరిగి తెరవడం గురించి అందరూ ఆలోచించాలి.
కరోనా వల్ల ఇంటి నుండి పనిచేస్తున్న మహిళల సంఖ్య బాగా పెరిగింది. దాంతో మహిళలపై అదనపు భారం పడిందని అనుకోవచ్చా?
ఈ కాలంలో పురుషులతో పోలిస్తే ఎక్కువ మంది మహిళలు ఉద్యోగాలు కోల్పోయారు. గృహహింస కేసులు గణనీయంగా పెరిగాయి. పురుషాధిక్యతను ప్రశ్నించలేని సమాజం మనది. ఈ ప్రభావం పిల్లలు, మహిళలపై తీవ్రంగా పడుతుంది. పురుషులు నేరాలకు పాల్పడుతున్నారు. దీన్ని కేవలం సామాజిక దృక్పథం నుండి మాత్రమే కాకుండా చట్టపరంగా కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అప్పుడే సమస్య పరిష్కారమవుతుంది.
మహమ్మారి ప్రభావం మానసిక ఆరోగ్యంపై కూడా పడింది. ముఖ్యంగా స్త్రీలకు ఇదో సవాలుగా మారింది. దీనిపై మీ అభిప్రాయం?
ఇప్పటికే ఉన్న భారాలు చాలక కరోనాతో కొత్త భారాలు మహిళలపై వచ్చిపడ్డాయి. దీనిపై ప్రతి ఒక్కరూ స్పందించాలి. ఆమెకు అసవరమైన సహకారం అందించాలి. ఇంతకు ముందు ఎన్నడూ అనుభవించని కష్టాలను మనం అనుభవిస్తున్నాం. ఇలాంటప్పుడే ఇంటి సభ్యులతో పాటు స్నేహితులు, పొరుగువారు, సహోద్యోగులు ఇలా అందరూ ఒకరి కష్టాలను ఒకరు పంచుకోవాలి. మనసులోని భావాలను చెప్పుకునే అవకాశం ఆమెకు కల్పించాలి. అప్పుడే సమస్య కొంత వరకైనా పరిష్కరించబడుతుంది.
మీరు కార్పొరేట్ ప్రపంచంలో సుదీర్ఘకాలం విశిష్టమైన బాధ్యతల్లో ఉన్నారు. అయినా నాయకత్వ స్థానాల్లో చాలా తక్కువ మంది మహిళలు ఉన్నారనే భావన మీకెందుకు వుంది?
ఈ సమస్య మన పరిసరాలతో సంబంధం కలిగి ఉందని నేను భావిస్తున్నాను. ఆఫీసులోనే కాదు ఇళ్లలో, సమాజంలో పురుషులను పని చేయాలని ఎంతగానో ప్రోత్సహిస్తారు. మరి మహిళలు పని చేయాలనుకున్నప్పుడు ఎంతవరకు సహకరిస్తారు..? కాబట్టి ఇది మన వ్యవస్థ సమస్య అని నేను అనుకుంటున్నాను. సంస్థలు ఈ వ్యవస్థల సూక్ష్మదర్శిని. కార్యాలయంలో ఎక్కువ మంది మహిళల ఈ సమస్యను పరిష్కరించుకోవాలంటే తల్లిదండ్రుల పెంపకంలో, విద్యను నేర్పే ఉపాధ్యాయుల్లో మార్పు రావాలి. మహిళలు ఈ సమాజంలో ఎన్నో ఆంక్షల మధ్య జీవిస్తున్నారు. చాలా మంది స్త్రీలు తాము త్యాగం చేయడానికే ఉన్నాము అనుకుంటారు. అయితే దీనిపై కేవలం స్త్రీలు మాత్రమే ప్రశ్నిస్తున్నారు. కానీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ దీనిపై స్పందించాలి. ఎందుకంటే మనం పరస్పరం ఆధారపడి ఈ సమాజంలో జీవిస్తున్నాము. పురుషులు దీన్ని గుర్తించాలి.
మరి ఈ వివక్షా సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం కష్టమే అంటారా?
కష్టమని నేను ఎప్పుడూ భావించలేదు. ఆడా మగా అనే తేడా పోయినప్పుడు ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్టే. నేను పని చేసిన సంస్థల్లో సమగ్ర మనస్తత్వం ఉన్న వ్యక్తులతో కలిసి పనిచేయడం నాకు కలిసొచ్చిన అంశం. అందువల్ల నాతో పాటు కలిసి పని చేసిన మగవారికి నాకు వచ్చినట్టు అవకాశాలు రాలేదు. కానీ వివక్ష ఆధారాలు అన్ని సంస్థల్లో కచ్చితంగా ఉన్నాయని మాత్రం నా అనుభవం ద్వారా చెప్పగలను. శ్రామిక శక్తిలో మహిళల పట్ల వివక్ష తీవ్రంగా ఉంది. వైవిధ్యం, చేరిక గురించి మాట్లాడుకుంటున్నాము. కానీ చాలా సంస్థల్లో మహిళలకు నాయకత్వ స్థానం రావడం లేదంటే అక్కడ అర్హత కలిగిన మహిళలు లేరని కాదు. వారికి అవకాశాలు ఇవ్వడం లేదని అర్థం చేసుకోవాలి. ఈ అంశాలపై సంస్థ యాజమాన్యం దృష్టి పెట్టాలి.
అక్షయ పాత్ర కాకుండా ఇతర ప్రాజెక్టులలో కూడా పనిచేస్తున్నారా?
పోషకాహారానికి సంబంధించిన సీఐఐ నేషనల్ కమిటీకి అధ్యక్షత వహిస్తున్నా. ఇక్కడ మేము ఎక్కువగా ప్రైవేటు రంగంలో ఉన్న సంస్థలతో లేదా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న ఆహారం తాజాగా వుందో లేదో చూసుకుని వాటిని సరఫరా చేయడానికి అనుకూలమైన అవకాలు ఉన్నాయని నిర్ధారించుకొని ప్రజలకు ఈ పోషకాహారం అందిస్తాము. అలాగే మేము అనేక ప్రాంతాల్లో కళారూపాలను ప్రదర్శించాము. ముఖ్యంగా కోవిడ్ - 19 చేత ప్రభావితమైన వారికి ఎలా సహాయం చేయాలి అనే కళారూపాలపై కూడా దృష్టిపెట్టాము. అయితే మహమ్మారి కారణంగా ప్రదర్శనలు ఇవ్వడానికి కళాకారులు చాలా మంది సాహసం చేయలేదు.
పోషకాహారాన్ని అందించేలా...
ప్రపంచ బిజినెస్ లీడర్ అయిన వినీతా బాలికి భారతదేశంతో పాటు విదేశాలలోనూ పెద్ద కంపెనీలలో విస్తృతమైన అనుభవం ఉంది. బ్రిటానియా సంస్థకు ఇండియాలో మాజీ ఎండిగా పని చేశారు. అలాగే యుకె, నైజీరియా, దక్షిణాఫ్రికా, లాటిన్ అమెరికా, యుఎస్‌లోని ది కోకాకోలా కంపెనీ, క్యాడ్బరీ ష్వెప్పెస్ పీఎల్సీ వంటి బహుళజాతి సంస్థలతో కలిసి ఆమె పనిచేశారు. 2014 ఏప్రిల్‌లో ఆమె బ్రిటానియా నుండి వెళ్లిపోయారు. ప్రస్తుతం అక్షయ పాత్ర ఫౌండేషన్‌లో కన్సల్టేటివ్ సభ్యురాలిగా పనిచేస్తూ పిల్లలు, వృద్ధులకు పోషకమైన భోజనం లభించేలా చూడటం లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ 2030 నాటికి ఆకలిలేని దేశాన్ని చూడాలనుకుంటుంది. మహమ్మారి సమయంలో మార్చి 2020 నుండి దేశవ్యాప్తంగా 12 కోట్ల మందికి పైగా భోజనం అందించింది. 2025 నాటికి, ఫౌండేషన్ లక్ష్యం పాఠశాల పిల్లలకు ఐదు బిలియన్ల మందికి పోషకాహారం అందించడం.