Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మామిడికాయల సీజన్ ఇది. తర్వాత దొరకడం కష్టం. అందుకే వీటితో రకరకాల వంటకాలు చేసుకుని ఆస్వాదిద్దాం. పచ్చిమామిడితో జ్యూస్, చట్నీ, ఫలూదా ఇలా ఎన్నో వెరైటీలు చేసుకోవచ్చు. ఇక అవకాయ రుచిని ఆస్వాదించడానికి ఆంధ్ర, తెలంగాణ అనే తారతమ్యాలు ఉండవు. చిన్న పెద్ద అనే బేధం అస్సలే ఉండదు. పేదవాడికీ, ధనికుడికీ అందరికి బంధువు ఈ ఆవకాయ. వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరూ పచ్చళ్ళు పెట్టె బిజీలో ఉంటారు. కానీ రుచిగా, సంవత్సరం వరకు నిల్వ ఉండే పచ్చడి పెట్టడం అందరి వల్ల కాదు. అయితే సులభమైన పద్దతిలో కూడా అవకాశం పెట్టుకోవచ్చు. మరి మామిడితో చేసే ఆ వంటకాలేంటో తెలుసుకుందాం...
పచ్చి మామిడికాయ జ్యూస్
కావల్సిన పదార్థాలు: పచ్చి మామిడికాయలు - అర కిలో, నల్ల ఉప్పు - ఒకటిన్నర స్పూన్, జీలకర్ర పౌడర్ - ఒక స్పూన్, పంచదార - తగినంత, చాట్ మసాల - ఒక చెంచా, వాటర్ - లీటర్.
తయారు చేసే విధానం: ముందుగా మామిడికాయలు కడిగి ముక్కలు తరిగి పెట్టుకొవాలి. స్టవ్ వెలిగించి పాన్‌లో నీళ్ళు పోసి అందులో ఈ మామిడికాయ ముక్కలు వేసి మూత పెట్టి ఉడికించాలి. ముక్కలు బాగా ఉడికాక అవి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారక మిక్సిలో వేసి పేస్ట్‌లా చేసి కొద్దిగా నీళ్ళు కలిపి వడ కట్టి రసాన్ని తీసుకోవాలి. ఈ రసానికి సరిపడా నీళ్ళు పోసి కలిపి అందులో నల్ల ఉప్పు, జీరా పౌడర్, పంచదార, చాట్ మసాల వేసి బాగా కలిపి గంటసేపు ఫ్రిజ్‌లో పెట్టుకుని తర్వాత సర్వ్ చేసుకోవాలి..
ఫలూదా
కావలసిన పదార్థాలు: మామిడి ముక్కలు - అర కప్పు, పాలు - కప్పు, చక్కెర - రెండు టేబుల్ స్పూన్లు, ఫలూదా (రైస్ నూడుల్స్) - 2 టేబుల్ స్పూన్లు, సబ్జా గింజలు - టేబుల్ స్పూన్, రూఆఫ్జా - టేబుల్ స్పూన్, ఐస్ క్రీం - రెండు టేబుల్ స్పూన్లు, కాజు బాదం ముక్కలు - టేబుల్ స్పూన్.
తయారుచేసే విధానం: ముందుగా ఫలూదాని వేడి నీళ్ళల్లో వేసి కాసేపు వుంచి, తరువాత చల్లని నీళ్ళల్లో వేసి తీసి పక్కనపెట్టుకోవాలి. సబ్జా గింజలను నీళ్ళలో నానబెట్టుకోవాలి. తరువాత మిక్సీలో మామిడి పండు ముక్కలు, చక్కెర, పాలు వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓ గ్లాసులో సబ్జా గింజలు వేసి దానిపైన ఫలూదా వేయాలి. తరువాత సన్నగా తరిగిన మామిడి పండు ముక్కలు వేయాలి. తరువాత మిక్సిలో బ్లెండ్ చేసుకున్న పాలు పోయాలి. దానిమీద ఐస్ క్రీం వేసి, కాజు బాదం, రూఆఫ్జాతో అలంకరించాలి.
చట్నీ
కావాల్సిన పదార్ధాలు: మామిడి కాయలు - మూడు, ఆవాలు - అర స్పూన్, ఇంగువ - స్పూను, మినపప్పు - స్పూను, మెంతులు - స్పూను, ఎండు మిర్చి - పది, ఉప్పు - రెండు స్పూన్లు, పచ్చి మిర్చి - ఐదు, పసుపు - చిటికెడు, నూనె - రెండు స్పూన్లు.
తయారు చేసే విధానం: ముందుగా మామిడి కాయలను బాగా కడిగి తొక్క తీసేసి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత బాండి తీసుకుని దానిలో నూనె వేసి మినపప్పు, ఆవాలు, మెంతులు, ఇంగువ, పసుపు, ఎండు మిర్చి, వేసి దోరగా వేయించి పెట్టుకోవాలి. పోపు చల్లారాకా మిక్సిలో వేసి పచ్చి మిర్చి, ఉప్పు, మామిడి ముక్కలు కూడా వేసి కొద్దిగా నీళ్ళు పోసి గ్రైండ్ చెయ్యాలి. తర్వాత తాలింపు వేసి చల్లారక పచ్చడిలో కలపాలి...
ఆవకాయ
కావాల్సిన పదార్థాలు: మామిడి ముక్కలు - ఆరు కప్పులు, కారం - కప్పు, వెల్లుల్లి - కప్పు, మెంతిపిండి - కప్పు, పసుపు - తగినంత, నువ్వుల నూనె - ముక్కలు మునిగేంత, ఉప్పు (దొడ్డు ఉప్పు) - ముప్పావు కప్పు.
తయారు చేసే విధానం: ముందుగా మామిడికాయలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి వాటి ముచుకను తీసి ఒక అరగంటా పాటు నీళ్ళల్లో ఉంచి ఆ తర్వాత వాటిని శుభ్రంగా తుడిచి మనకు కావాల్సిన సైజులో ముక్కలు కోసి పెట్టుకోవాలి. తర్వాత మనం కొలత కోసం ఎదో ఒక కప్ తీస్కుని దానితో ఆరు కప్పుల మామిడి ముక్కలు తీసుకుందాం. ముక్కలు మునిగేంత నూనె తీసుకుని ఆ నూనెలో మామిడి కాయ ముక్కల్ని వేసి ముక్కలకి నూనె పట్టించి వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇపుడా నూనెలో ఒక కప్పు కారం వేయాలి. ఇంకా ఒక కప్పు ఆవపిండి కూడా వేయాలి. ఉప్పు కూడా ఒక కప్పు కంటే కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఒకవేళ కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు. పసుపు అర చెంచా వేసుకోవాలి. ఇందులోనే ఒక కప్పు వెల్లుల్లి కూడా కచ్చా పిచ్చా గా దంచి కలపాలి. చివరిగా మామిడికాయ ముక్కల్ని కూడా వేసి అన్ని బాగా కలపాలి. ఇలా కలిపిన ముక్కల్ని మూడు రోజుల పాటు ఉంచి, మూడవ రోజున ఉప్పు చూసుకుని ముక్కలు మునిగేంత నూనె పోసుకుని జాడీలో భద్రంగా పెట్టుకుంటే సంవత్సరం వరకు ఆవకాయ పాడవకుండా ఉంటుంది.