Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్లో లింగ అసమానతలు నానాటికి పెరుగుతున్నాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా లింగ అసమానతలు ఎక్కువగా ఉండే దేశాల్లో భారత్ చేరిందని గత అధ్యయనాలు కూడా తెలిపాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్-2021లో భారత్ 140వ స్థానంలో నిలిచింది. మొత్తం 156 దేశాలకు గానూ ఈ నివేదికను తయారు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం భారత్ 28 స్థానాలు దిగజారిందని నివేదిక పేర్కొంది. కరోనా మహమ్మారి కారణంగా భారత్లో లక్షలాది మంది మహిళలు, బాలికలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా గత కొన్ని దశాబ్దాలుగా లింగ సమానత్వంపై సాధించిన పురోగతి మళ్లీ వెనక్కు వెళ్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్- 2021ను నాలుగు అంశాల ఆధారంగా రూపొందించారు. రాజకీయ సాధికారత, విద్యాపరమైన విజయం, ఆర్థిక భాగస్వామ్యం, ఆరోగ్యం.. వంటి అంశాల ఆధారంగా ఈ రిపోర్టును తయారు చేశారు. ఒక దేశంలో లింగ అంతరాలను (జెండర్ గ్యాప్) ఈ నాలుగు ప్రధాన కారకాలుగా నిర్ణయిస్తాయి. భారతదేశంలో ఈ సంవత్సరం మొత్తం లింగ అంతరం 62.5 శాతానికి పెరిగిందని ప్రపంచ ఆర్థిక సంస్థ తెలిపింది. దక్షిణాసియా దేశాల్లో భారత్ ఇతర దేశాలకంటే వెనుకబడి ఉందని సంస్థ పేర్కొంది.
అన్నిట్లోనూ వెనకే: రాజకీయ సాధికారత సూచీలో భారత్ చాలా వెనుకబడి ఉంది. దేశంలోని మహిళా మంత్రుల సంఖ్య 23.1 శాతం నుంచి 9.1 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం ఆరోగ్యం, మనుగడ విషయంలో అత్యంత వెనుకబడి ఉన్న ఐదు దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాల అంతరం కూడా ఒక శాతం క్షీణించింది. మహిళా శ్రామిక శక్తి రేటు 24.8 శాతం నుంచి 22.3 శాతానికి తగ్గింది. అంతేకాకుండా ప్రొఫెషనల్, టెక్నికల్ విభాగాల్లో మహిళల వాటా 29.2 శాతానికి దిగజారింది. సీనియర్, మేనేజర్ ఉద్యోగ స్థానాల్లో మహిళల వాటా కూడా తక్కువగా ఉంది. ఈ విభాగాల్లో మహిళలు 14.6 శాతం మంది మాత్రమే ఉన్నారు. అత్యున్నత స్థాయి మేనేజర్లలో మహిళలు ఉన్న సంస్థలు కేవలం 8.9 శాతం మాత్రమే ఉన్నాయని నివేదిక పేర్కొంది.
దృష్టి పెట్టాలి: లింగ అంతరాన్ని తగ్గించేందుకు ప్రపంచ దేశాలు కృషి చేయాలని ప్రపంచ ఆర్థిక సంస్థ సూచిస్తోంది. లింగ సమానత్వాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణించాలి. అన్ని రంగాల్లోనూ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందుకు అవసరమైన చట్టాలను పాలకులు రూపొందించాలి. కరోనా వైరస్ మహమ్మారి అన్ని రంగాల్లోనూ మహిళలపై తీవ్రమైన ప్రభావం చూపింది. ఇప్పటికే ఉన్న అసమానతలను కోవిడ్-19 మరింత తీవ్రం చేసింది. ఈ అంతరాలను పూడ్చడంతో పాటు మహిళా సాధికారతకు విలువ ఇవ్వడం ద్వారా సుస్థిరాభివృద్ధిని సాధించగలుగుతామని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.