Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో కరోనా తీవ్రత వేగంగా పెరిగిపోతోంది. రాబోయే నాలుగు వారాలు ఇంకా సంక్లిష్టంగా ఉండబోతోందని వైద్య వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. చాలా చోట్ల భౌతిక దూరం అన్న మాట మర్చిపోయినట్టుగా కనిపిస్తున్నది. మాస్క్‌ను పెట్టుకోవటమైతే పాటిస్తున్నారు గానీ శానిటైజర్, భౌతిక దూరం పాటించడం లేదు. అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. అదీ విదేశీ యాత్రలైతే రెండు సంవత్సరాల పాటు వెళ్ళకుండా ఉంటే మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. బయటి ఫంక్షన్లలోని ఆహారం, హాటళ్ళలోనూ తినకుండా ఉండాలి. వివాహాలు, పుట్టిన రోజులు వంటి వుడుకలకు దూరంగా ఉంటే మంచిది. బ్యూటీ పార్లర్లు, సెలూన్లలో వారు వాడే వస్తువులను పరిశీలించాలి. బయటకు వెళ్ళి వచ్చాక బూట్లు, చెప్పుల్ని ఇంటి బయటనే వదిలి పెట్టి శానిటైజర్‌తో శుభ్రం చేయాలి. మనమైతే ఇంట్లోనే క్వాలిటీగా గడుపుదాం...
ప్లాస్టిక్ ప్యాకింగులతో
నాకు ఇంట్లోకి కొత్త వస్తువులు వచ్చాయనే ఆనందం కన్నా అందులో ఏం ప్యాకింగులు వస్తాయో అనే ఆనందపడుతాను. అలాగే కొత్త ఎ.సి కొన్నపుడు బయట అంతా ధర్మోకాల్ ప్యాకింగులే వచ్చాయి. మధ్యలో చిన్న చిన్న ముఖ్యమైన విడిభాగాలను ప్లాస్టిక్ ధర్మోకాల్ లాంటి ప్యాకింగుల్లో పెట్టారు. అవి ప్లాస్టిక్‌గా ఉన్నాయి. అలాగే గట్టిగా విరక్కుండానూ ఉన్నాయి. అలా రెండు ముక్కలు వచ్చాయి. ఈ రెండింటినీ ఒకదానిపై ఒకటి పెట్టి అతికించాను. ఈ ప్లాస్టిక్ నలుచదరపు పెట్టెకు చుట్టూరా ముత్యాలు అతికించాను. అవీ రంగురంగుల ముత్యాలను అతికించాను. వాటి మధ్యలో ఫోమ్ షీటు కట్ చేసిన పువ్వుల్ని అతికించాను. అంతలో అరచేయి వెడల్పున్న మామూలు ధర్మోకాల్ ముక్క కనిపించింది. అది దాచాను. తెల్లవారి మా వంటామె రెండు చిన్నచిన్న వాజిలైన్ డబ్బాలను తెచ్చి ఇచ్చింది. వెంటనే ఈ రెండు వాజిలైన్ డబ్బాలకు రంగులతో పువ్వులు, హృదయం చిత్రించాను. ఈ రెండింటిని ఒక దాని మీద ఒకటి పెట్టి దీన్ని ధర్మోకాల్ మీద అతికించాను. ఒక రకమైన ప్లాస్టిక్ మందు సీసాలను నాలుగు తెచ్చి దీనికి నాలుగు వైపులా నిలబెట్టాను. ఇలా తయారైన దాన్ని తెచ్చి ప్లాస్టిక్ నలుచదరపు అట్టపెట్టె మీద అతికించాను. ఇలా చూస్తే చార్మినార్ వలె కనిపించింది. మీకెలా కనిపిస్తోందీ..?
పాలపీకలతో...
ఇప్పుడు స్వాతంత్య్ర దినోత్సవపు అమృతోత్సవాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 3వ తేదీ అన్ని జిల్లాల్లోనూ ఆజాదీకా అమృతోత్సవం పేరిట కవిసమ్మేళనాలు కూడా జరిగాయి. మా ఆసుపత్రిలోని పాల పీకలతో నేను ఎన్నో బొమ్మలు తయారు చేశాను. ఇప్పుడు భారతదేశం చిత్రపటం తయారు చేస్తున్నాను. దానికోసం నేల మీద పెద్దగా భారతదేశ పటాన్ని గీశాను. ఈ గీతను అనుసరించి ఒక్కొక్క పాలపీకను పెట్టుకుంటూ వచ్చాను. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రంగు పాలపీకలను అమర్చాను. ఈ భారతదేశ పటం మధ్యలో జెండాను ప్రతిష్టించాను గదా. అందుకని జెండాను స్కెచ్‌తో గీశాను. దీనికోసం ఇంజక్షన్ సీసాలకు వుండే ప్లాస్టిక్ మూతల్ని వాడాను. జెండానూ మధ్యలో అశోక చక్రాన్నీ అందంగా అమర్చాను. భారతదేశ చిత్రపటం మువ్వన్నెల జెండాతో సహా మా ఇంట్లో చిత్రించబడింది. ఏదో అందం తగ్గినట్టనిపించింది. వెంటనే ఇంట్లో విరగకాస్తున్న బంతిపూలు, చామంతిపూలు, గోరంట పూలు, లింగమల్లి పూలు, కనకాంబరాలూ అన్నీ కోసుకొచ్చి భారతదేశానికి పూలతో నమస్కరించాను. ఇప్పుడు రంగురంగుల పూలతో కళకళలాడుతున్నది భారతదేశం.
పాత క్యాలెండర్‌తో
ఫార్మ స్యూటికల్ కంపెనీల వాళ్ళు ఒక్కో సంవత్సరం ఒక్కో ధీమ్‌తో క్యాలెండర్లను తయారు చేస్తుంటారు. అలాంటి వాటిలో నుంచి ఔషధ మొక్కల చిత్రాలను సేకరించాను. బీఎస్సీ చదువుకునే రోజుల్లో ''ఔషధ మొక్కల గురించి చదువుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక ఔషధ మొక్క అయినటువంటి 'శాతావరి' మొక్క చిత్రాన్ని తీసుకొని చార్టులా తయారు చేశాను. దీని శాస్త్రీయనామం ''ఆస్పరాగస్ రెసిమోసస్''. పిల్లలు పుట్టాక పాలు పడని తల్లులకు ఎక్కువగా పాల ఉత్పత్తి జరగడానికి ఈ మందును వినియోగిస్తారు. ఆయుర్వేద మందులలో చాలా ప్రధాన ఔషధమిది. కీళ్ళ నొప్పులు, నాడీ వ్యవస్థపై కూడా చక్కగా పని చేస్తుంది. నేను ఈ ఛార్టులకు చుట్టూతా డిజైన్‌గా తెలుగు అక్షరాలను వాడాను. ఛార్టు చాలా అందంగా వచ్చింది. పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది.
కరోనా ముగ్గు
గత సంవత్సరపు లాక్డౌన్లో కరోనా గురించి అవగాహన కల్పించేందుకు చేయని ప్రక్రియలేదు. అందులో భాగంగా కరోనా వైరస్‌కు, అప్పుడు అది చేస్తున్న నష్టం గురించి చెప్పడానికి ముగ్గులు కూడా వేశాను. ఇంతకు ముందు కొన్ని ముగ్గులు మీకు పరిచయం చేశాను. ఇప్పుడు కరోనా సెకండ్‌వేవ్ ఉధృతి కారణంగా మరల కొన్ని చిత్రాలను పరిచయం చేయదలచుకున్నాను. ఈ ముగ్గులో చుట్టూ ఇళ్ళను నిర్మించాను. మధ్యలో కరోనా వైరస్‌ను వేశాను. ఈ ఇళ్ళను కలుపుతూ ఒక గొలుసును వేశాను. అప్పుడు లాక్డౌన్ నడుస్తున్నది. కాబట్టి అందరూ ఇళ్ళలోనే ఉంటున్నారు. ఇళ్ళలో నుంచి బయటకు వెళ్ళేందుకు ఇనుపగొలుసులు అడ్డంగా ఉన్నాయని చెప్పాలనుకున్నాను. ఇళ్ళ ముందు ముగ్గులు కూడా పెట్టాను. ఈ ముగ్గును 15 చుక్కలు 8 వచ్చ వరకు మధ్య చుక్కలో అమర్చాను.
ప్లాస్టిక్ గుండీలు, రబ్బర్లతో
డబ్బుల్ని కట్టలు కట్టడానికి రంగురంగుల రబ్బర్లను వాడతాయి. వీటిత కూడా బొమ్మలు, డిజైన్లు వేసుకోవచ్చు. దీని కోసంగానూ ముందుగా రంగురంగుల గుండీలను సేకరించుకున్నాను. పాత బట్టలకున్న గుండీలను కత్తిరించి ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటాను. ఇప్పుడు వీటి అన్నింటినీ కలిపి ఒక డిజైను చేయాలనుకున్నాను. వీటిని కూడా నేలపై పెద్ద డిజైన్‌గా చేశాను. రంగు డుండీలు, రబ్బర్లు ఒక క్రమ పద్ధతిలో అమర్చేసరికి అందమైన డిజైను ఏర్పడింది. ఇలా నేల మీద చేశాను గానీ చిన్నగా చేస్తే ఫ్రేవమ్ చేయించి గోడకు పెట్టుకోవచ్చు.
- డా|| కందేపి రాణీప్రసాద్