Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంజలీ, అరవింద్ భార్యా భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. అరవింద్ కూరగాయల వ్యాపారం చేస్తాడు. కొడుకు పుట్టే వరకు ఆమెకు ఎలాంటి సమస్యా లేదు. ఇంట్లో మహరాణిలా ఉండేది. బాబు పుట్టిన దగ్గర నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. భర్తకు ఆమెపై అనుమానం. సొంత అన్న ఇంటికి వెళ్ళినా అనుమానమే. తాగొచ్చి గొడవ చేస్తాడు. అసలు కొడుకు పుట్టిన తర్వాతనే ఆమె సమస్యలు ఎక్కువయ్యాయి? ఐద్వా అదాలత్‌లో ద్వారా తెలుసుకుందాం....
పన్నేండేండ్ల కిందట అంజలి ఇంటి పక్క గదిలో అద్దెకు దిగాడు అరవింద్. అప్పటికే అతని మొదటి భార్య ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆమెకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. వాళ్ళు నాయనమ్మ దగ్గర పెరుగుతున్నారు. అరవింద్ ఆ కేసు నుంచి ఎలాగో బయటపడి, తల్లితో గొడవపెట్టుకుని వేరుగా అక్కడికి వచ్చి ఉంటున్నాడు. అక్కడే అతను అంజలికి పరిచయం. అరవింద్ తన విషయాలన్నీ ఆమెతో చెప్పుకునేవాడు. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ పెండ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అరవింద్ తల్లికి ఆ పెండ్లి ఇష్టం లేదు. కారణం అంజలిది పేద కుటుంబం. దాంతో ఇంట్లో చెప్పకుండా పెండ్లి చేసుకున్నారు. మొదటి భార్య పిల్లల్ని కూడా తమతో పాటే తెచ్చుకున్నారు. అంజలి పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకునేది. పిల్లలు కూడా ఆమెను అమ్మా అని పిలిచేవారు. కూతురికైతే అంజలి అంటే ప్రాణం. ఇద్దరూ చాలా ప్రేమగా ఉండేవారు.
అలా కుటుంబం ఎంతో అన్యోన్యంగా ఉండేది. అరవింద్, అంజలినీ ప్రేమగా చూసుకునేవాడు. సంపాదించిన ప్రతిపైసా భార్య చేతికే ఇచ్చేవాడు. పెండ్లయి రెండేండ్లయినా వాళ్ళకు పిల్లలు కలగలేదు. దాంతో ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. చివరకు ఏడేండ్లకు అంజలి నెల తప్పింది. కూతురు పుట్టింది. పెద్దకూతురు చదువురీత్యా మేనత్త ఇంట్లో ఉండి కాలేజీకి వెళ్ళేది. కొడుకు మాత్రం వీళ్ళతోనే ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత అత్తగారింటికి అంజలి రాకపోకలు మొదలయ్యాయి.
ఇంట్లో ఖాళీగా కూర్చోవడం అంజలికి నచ్చలేదు. దాంతో కొంత డబ్బు అప్పుచేసి సొంతంగా షాపుపెట్టుకుంది. అక్కడ ఓ వ్యక్తితో పరిచయం అయింది. అతనితో కాస్త చనువుగా మాట్లాడడం వల్ల అరవింద్‌కు అనుమానం పెరిగింది. దాంతో షాప్ మూసేసి ఇంట్లోనే ఉండేది. అయినా భార్యపై అనుమానం పోలేదు. తల్లికి నచ్చజెప్పి భార్యను, అరవింద్ సొంత ఇంటికి తీసుకెళ్ళాడు. అప్పుడే కొడుకు పుట్టాడు.
అక్కడకు వెళ్ళినా అరవింద్‌లో మార్పు రాలేదు. ఆ వ్యక్తితో తనకు ఎలాంటి సంబంధంల లేదని అంజలి ఎంత చెప్పినా వినేవాడు కాదు. ఇదే అదనుగా అత్త కూడా అంజలినీ సూటి పోటి మాటలు అనేది. బంధువుల ఇండ్లకు వెళ్ళనిచ్చే వారు కాదు. ఇంటి పక్క వారితో కూడా మాట్లాడనివ్వరు. పెద్ద కొడుక్కి ఇప్పుడు ఇరవై ఏండ్లు వచ్చాయి. ఇంటర్ మధ్యలోనే ఆపేసి ఏదో పని చేసుకుంటున్నాడు. తండ్రి అనుమానం కొడుక్కు ఎక్కించాడు. అప్పటి నుంచి కొడుకు కూడా అంజలితో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. బూతులు తిడుతున్నాడు. అమ్మా అని పిలిపించుకున్న ఆ నోటితో బూతులు తిడుతుంటే అంజలి తట్టుకోలేకపోయింది. మరోపక్క తండ్రి కొడుకును రెచ్చకొడుతూ ఉండేవాడు. కొడుకు రెచ్చిపోయి చివరకు అంజలిపై చేయిచేసుకునేవరకు వచ్చాడు.
అటు నాయనమ్మ కూడా మనవడిని రెచ్చకొట్టేది. అంజలికి కొడుకు పుట్టడం వల్ల తనకు మాత్రమే రావాల్సిన ఆస్థిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని పదే పదే చెప్పేది. దాంతో అతను అంజలిపై, ఆమె పిల్లలపై ద్వేషం పెంచుకున్నాడు. ఇప్పుడు ఆ ఇంట్లో అంతకు ముందున్న ఆనందం లేదు. రోజూ గొడవలు, ఏడుపులు. ఈ మధ్యనే అంజలికి మరో విషయం తెలిసింది. అదీ పెద్ద కూతురు ద్వారా.. తన తల్లి, తండ్రి వల్లే చనిపోయిందని, ఆమెను కూడా ఇలాగే అనుమానించేవాడనీ, అది భరించలేక ఆమె కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుందని. దాంతో అంజలిలో భయం మొదలయింది. తనను కూడా అలాగే చంపేస్తే, పిల్లలు అనాథలైపోతారనే దిగులు పట్టుకుంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఆమె తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది. సభ్యులు అరవింద్‌ను, అతని తల్లినీ, పెద్ద కొడుకునీ రమ్మని లెటర్ పంపారు. తర్వాతి వారం వాళ్ళు వచ్చారు.
''మేడమ్ నాకు నా భార్యంటే చాలా ఇష్టం. ఎంతో ప్రేమగా చూసుకుంటాను. ఆమె ప్రవర్తన వల్లనే ఇదంతా. తనకు చెడు అలవాట్లు ఉన్నాయి. అందుకే నాకు భయం. ఒక వ్యక్తి ఆమెకు ఎప్పుడూ మెసేజ్‌లు పెడుతుంటాడు. ఫోన్లు చేస్తుంటాడు. అయినా నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే నాకు ఇద్దరు చిన్నపిల్లలున్నారు. అంజలిపై ఉన్న ప్రేమతో ఆమె ఎన్ని తప్పులు చేసినా భరిస్తున్నాను. ఇప్పుడు కూడా ఎలాంటి తప్పూ చేయలేదని ప్రమాణం చేసి ఇంట్లోకి రమ్మని చెప్పాను. ఇప్పుడు ఆమె రెండు నెలల నుంచి ఇంటికి రమ్మంటే రావడం లేదు. మీరైనా నా భార్యను, పిల్లల్ని ఇంటికి పంపించండి' అంటూ దండం పెట్టాడు.
''ఎప్పుడూ అనుమానిస్తూ, తాగొచ్చి గొడవ చేస్తుంటే ఆమె నీతో ఎలా వస్తుంది. అయినా పరాయి వ్యక్తితో మాట్లాడినంత మాత్రానా సంబంధం అంటగడతావా? ఇంత అనుమాన రోగం ఉన్నవాడికి భార్యా, పిల్లలు ఎందుకు. నీ పెద్ద భార్యను కూడా ఇలాగే పోగొట్టుకున్నావు. ఇప్పుడు అంజలి వెంట పడ్డావు. ఆమె నీతో రావాలంటే ముందు నువ్వు తాగుడు మానుకోవాలి. ఆమెను అనుమానించకూడదు. అలాగే నీ పెద్ద కొడుకును బాగా రెచ్చగొట్టావు. ఇప్పుడు ఆ పిల్లోడు ఘోరంగా తయారయ్యాడు. అంజలిని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సొంత బిడ్డలా పెంచింది. అతని మాటలకు ఎంత బాధపడుతుందో నీకు తెలియడం లేదు. నీకున్న అనుమానాన్ని కొడుక్కి కూడా ఎక్కించావు. అయినా నీతో రావాలో వద్దో ఆలోచించుకోవల్సింది నీ భార్య, నీ పక్కనే ఉంది కదా ఆమెను అడుగూ' అన్నారు.
ఇంటికి రమ్మని భార్యను బతిమలాడుకున్నాడు. అయితే అంజలి కొన్ని షరతులు పెట్టింది. 'నేను ఇంటికి రావాలంటే నా పిల్లల పేరుతో కొంత ఆస్థి రాయాలి. అలాగే పెద్ద కొడుకు మనతో పాటు ఉండటానికి వీల్లేదు. ఇప్పుడు వాడు చాలా మారిపోయాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు' అంది. అయితే ఆస్థిలో వాటా రాయడానికి అరవింద్ తల్లి అంగీకరించలేదు. ఎందుకంటే ఆస్థి మొత్తం ఆమె పేరుతో ఉంది. పైగా అదంతా ఆమె కష్టార్జితం. అరవింద్ పేరుతో ఒక్క పైసా కూడా లేదు. ఆమె తన తదననంతరం మాత్రమే ఆస్థి రాసిస్తానని చెప్పింది. పెద్ద మనవడినైతే తనతో పాటు తీసుకెళతానని అంది. 'అలా ఇష్టమైతే రా లేదంటే లేదు' అని అత్త కచ్చితంగా చెప్పేసింది.
అంతా విన్న లీగల్‌సెల్ సభ్యులు 'చూడు అంజలీ, ఆస్థి మొత్తం మీ అత్తపేరుతో ఉంది. నీ భర్త పేరుతో చిల్లి గవ్వ లేదు. ఆ ఆస్థిపై నీ పిల్లలకే కాదు, ఆమె పిల్లలకు కూడా హక్కు ఉండదు. ఆమె ఇష్టం ఉన్నవాళ్ళకు ఇచ్చుకునే హక్కు ఆమెకే ఉంటుంది. కోర్టుకు వెళ్ళినా నీకు న్యాయం జరగదు. నిదానంగా ఆలోచించుకుని ఓ నిర్ణయం తీసుకో' అన్నారు.
దానికి ఆమె 'భవిష్యత్‌లో నా పిల్లలకు ఏమీ ఉండదని భయంగా ఉంది. నాకు కొడుకు పుట్టినప్పటి నుంచి సమస్యలు ఎక్కువయ్యాయి. అక్కడ ఉండాలంటే నాకు ఎంతో కొంత ఆర్థికంగా సెక్యురిటీ కావాల్సిందే' అంది. దానికి సభ్యులు ''మీరు ఉండేది సొంత ఇంట్లోనే కాబట్టి అద్దె సమస్య ఉండదు. పెద్ద కొడుకు కూడా నానమ్మ దగ్గరకు వెళ్లిపోతాడు. ఇకపై అతని వల్ల ఇబ్బంది ఉండదు. ఇక నీ భర్త వల్ల నీకు ఎలాంటి హానీ జరగదని రాయించుకుందాం. అలాగే ప్రతి రోజూ అరవింద్ నీకు ఐదు వందలు ఇవ్వాలని చెబుతాం. దీనికి నువ్వు సరే అంటే అతనితో మాట్లాడతాం' అన్నారు.
దానికి అంజలీ సరే అన్నది. దాంతో సభ్యులు అరవింద్‌తో మాట్లాడితే అన్నింటికీ అతను ఒప్పుకున్నాడు. అయితే రోజుకు నాలుగు వందలు మాత్రమే ఇస్తానన్నాడు. అలాగే పిల్లల పేరుతో పాలసీ కడతానని చెప్పాడు. దాంతో అంజలి కూడా ఒప్పుకుంది.
తర్వాత సభ్యులు అరవింద్‌తో మాట్లాడుతూ 'ఇకపై నీ వల్లగానీ, నీ పెద్ద కొడుకు వల్ల గానీ అంజలికి ఎలాంటి సమస్య వచ్చినా ఊరుకునేది లేదు. నీ మొదటి భార్య హత్య కేసు నుండి తప్పించుకుని వచ్చావు. ఇప్పుడు రెండో భార్య కేసుపెడితే సీరియస్‌గా ఉంటుంది. నిన్ను బయటకు రాకుండా జైల్లోనే కూర్చోబెట్టగలం. కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఏమాత్రం తేడా వచ్చినా నీకు జైలే గతీ' అని హెచ్చరించారు.
'నా భార్యను నేను ఒక్క మాట కూడా అనను. ఇకపై అనుమానించను. తాగుడు కూడా మానుకుంటాను. రోజూ కచ్చితంగా ఆమె చేతికి నాలుగు వందలు ఇస్తాను. పిల్లల్ని మంచిగా చూసుకుంటాను. మాకు ఏమైనా సమస్య వస్తే మీ దగ్గరకే వస్తాం' అని చెప్పి భార్యా, పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ప్రతి వారం ఆ జంట లీగల్‌సెల్‌కు వచ్చి సంతకం చేసి వెళుతున్నారు. ప్రస్తుతం అంజలి కాస్త ధైర్యంగా, ప్రశాంతంగా బతుకుతోంది.
- సలీమ