Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమె గురి చూసిందంటే ఆ లక్ష్యమే బెదరాలి. రింగ్‌లో అడుగుపెట్టిందంటే పతకాలు ఆమె మెడలో పడాలి. చూస్తే 11 ఏండ్ల చిన్నారి. కానీ ఏకకాలంలో రెండు క్రీడల్లో రాణిస్తూ శభాష్ అనిపించుకుంటోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని నలుమూలల వ్యాప్తి చేస్తోంది. ఇంతటి ప్రతిభ ఉన్నప్పటికీ.. ఆర్థిక చేయూత లేక అవస్థలు పడుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పోటీ చేసేందుకు అప్పులు చేయాల్సి వస్తోంది. ఇంట్లో ఉన్న బంగారం కుదవపెట్టి మరీ పోటీల్లో పాల్గొంటోంది. వెనుకబడిన తరగతుల నుంచి ఇప్పుడిప్పుడే క్రీడా ప్రపంచంలో పాదం మోపుతున్న ఈ చిన్నారికి ప్రోత్సాహం ఇస్తే ఇంకా అద్భుతాలు సృష్టించే అవకాశముంది. తైక్వాండ్‌లో ఈ నెల 15-16న జరిగే అంతర్జాతీయ పోటీలకు సన్నద్ధమవుతోంది. ఆమె ఎవరో కాదు.. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలానికి చెందిన మద్దుల శ్రీనిక.
నందిపేట్ మండలంలోని తొండాకూర్‌కు చెందిన మద్దుల మురళికి ఇద్దరు కుమార్తెలు. మురళీ సైతం ఆర్చరీ(విలువిద్య)లో మేటి ఆటగాడు. జాతీయస్థాయిలో ఏకంగా నాలుగు బంగారు పతకాలను సాధించాడు. ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాలన్న పట్టుదల, సంకల్పంతో ముందుకుసాగాడు. కానీ పేదరికం, ఆర్థిక ఇబ్బందులతో అతని కల కలగానే మిగిలిపోయింది. కానీ తనకున్న ఆర్చరీ నైపుణ్యాన్ని కుమార్తెలో గుర్తించి సాధన ప్రారంభించాడు. 'ఆనాడు నాకున్న ఆర్థిక ఇబ్బందులు, క్రీడా రాజకీయాలతో నాకెంతో ఇష్టమైన ఆర్చరీ నుంచి దూరమయ్యాను. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా నా కుమార్తెను ఒలింపిక్స్‌లో దేశం తరపున ఆడిస్తా' అంటూ సగర్వంగా చెబుతున్నాడు. ఒలింపిక్స్‌లో అర్హత సాధించాలంటే ఎంతటి కఠోర శ్రమ, సాధన చేయాలో మురళీకి తెలుసు.
హైదరాబాద్‌లో శిక్షణ..
మురళీ పెద్ద కుమార్తె శ్రీనికలో ఆర్చరీ నైపుణ్యం గుర్తించిన వెంటనే ఆమెకు ప్రత్యేక శిక్షణ ఇప్పించడం మొదలుపెట్టాడు. ఆర్థిక సమస్యలు వెన్నాడుతున్నా.. హైదరాబాద్‌లో ఏడాది పాటు శిక్షణ ఇప్పించాడు. ఇంతలో కరోనాతో ఇబ్బందులు తలెత్తడంతో స్వగ్రామం నందిపేట్ మండలంలోనే స్వయంగా శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. ఇందుకోసం ప్రతిరోజూ కిలోమీటర్ల మేర అడవుల్లోనే పరుగెత్తించేవాడు. అయితే గ్రామాల్లో ఆర్చరీకి సరైన వాతావరణం లేకపోవడంతో నిజామాబాద్ పట్టణంలో ఒక గది అద్దెకు తీసుకుని ఆర్చరీలో శిక్షణ ఇస్తున్నాడు. అయితే నిజామాబాద్‌లో ఆర్చరీకి మౌలిక సదుపాయాలు అంతంతే. దాంతో సొంత డబ్బులతో వివిధ రాష్ట్రాల నుంచి అవసరమైన క్రీడా పరికరాలు కొనుగోలు చేయించి అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైనవి సమకూరుస్తున్నాడు.
లాక్డౌన్లో అడుగులు తైక్వాండో వైపు..
లాక్డౌన్లో అందరూ ఇండ్లకే పరిమితమైతే.. మురళీ మాత్రం తన కూతుర్ల ద్వారా ఒలంపిక్ కలను సాకారం చేసుకునే దిశగా ప్రయత్నాలు సాగించాడు. అయితే ఆర్చరీలో రాణిస్తున్న అమ్మాయికి ఆత్మరక్షణ కోసం తైక్వాండోలో చేర్పించాడు. ఆత్మరక్షణ కోసమే ప్రాక్టీసు ప్రారంభించినప్పటికీ తనకున్న ప్రతిభతో కోచ్ చెప్పిన మెళకువలను త్వరగా ఆకలింపు చేసుకోవడంతో శ్రీనికలో ఉన్న నైపుణ్యాన్ని కోచ్ హీరాలాల్ గుర్తించాడు. ఆమెపై మరింత ఎక్కువ దృష్టి పెట్టి శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. అనతికాలంలోనే అంతర్జాతీయ స్థాయి ఆన్లైన్ ఇంటర్నేషనల్ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్‌మెడల్ సాధించింది. అలాగే బెంగళూరులో జరిగిన జాతీయస్థాయి తైక్వాండోలోనూ బంగారు పతకం సాధించి ఈ నెల 15-16లో నేపాల్‌లో జరిగే యూత్‌గేమ్స్ ఇంటర్నేషనల్ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది.
ప్రశంసలే తప్ప సాయం అందట్లే..
ఆర్థిక చేయూతలేక తన ఒలింపిక్స్ కలకు దూరమైన మురళీ.. తన కూతురు విషయంలో ఆ పరిస్థితి రానీయకుండా కృషి చేస్తున్నాడు. అయినా శ్రీనిక లక్ష్యసాధనకూ ఆర్థిక అడ్డంకులే కారణమవుతున్నాయి. బెంగళూరులో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి మరీ పోటీల్లో పాల్గొన్నది. ప్రస్తుతం అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు నేపాల్ వెళ్లాలంటే లక్షల్లో ఖర్చవుతుంది. ఆ ఖర్చులు భరించడం కుటుంబానికి ఇబ్బందిగా మారింది. దాంతో ఆర్థిక సాయం కోసం తొక్కని గడపలేదు. ప్రతి ఒక్కరూ ఆ చిన్నారిని ప్రశంసించి పత్రికల్లో ఫొటోలు వేయించుకుంటున్నారు తప్ప ఆర్థికంగా అండగా వెన్నుతట్టి సాయం చేయడం లేదు. స్పోర్ట్ అథారిటీ నుంచి మొదలు నిజామాబాద్ జిల్లాలోని ప్రముఖులను కలిసి సాయం కోరినప్పటికీ పైసా సాయం దక్కలేదు. ఇప్పటికైనా తన కూతురి ప్రతిభను గుర్తించి ఆర్థికంగా అండగా నిలవాలని తండ్రి కోరుతున్నాడు.
- ఎం. భాస్కర్, నిజామాబాద్ ప్రతినిధి