Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనల్ని అన్నిటికంటే ఇబ్బంది పెట్టే సమస్య నెలసరి. నెల నెలా వచ్చే ఈ ఇబ్బందిని భరించడం అంత తేలికేమీ కాదు. కడుపునొప్పి, కాళ్లు లాగడం, వికారం, విసుగు... ఇలా ఒకటి కాదు రెండు కాదు ఆ సమయంలో ఎన్నో రకాల సమస్యలు వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. కొన్ని నియమాలు పాటిస్తూ ఆ మూడు రోజుల్నీ మూడు క్షణాల్లా గడిపేయవచ్చంటున్నారు నిపుణులు. దానికేం చేయాలంటే...
న్యాప్కిన్ మార్చుకోవాలి: చాలామంది కడుపు నొప్పిగా ఉందనో, విసుగ్గా ఉందనో భోజనం సరిగ్గా చేయరు. ఏదో కాస్త తినేసి ఊరుకుంటారు. అది చాలా తప్పు. రక్తస్రావం వల్ల శరీరంలోని శక్తి సన్నగిల్లుతూ ఉంటుంది. కాబట్టి సమయానుకూలంగా తగిన ఆహారాన్ని తీసుకోవడం ఎంతో అవసరం. అలాగే వీలైనంతవరకూ కష్టతరమైన పనులు చేయకూడదు. బరువులు ఎత్తడం లాంటివి చేయడం వల్ల కడుపు, నడుము నొప్పులు ఎక్కవవుతాయి. శానిటరీ న్యాప్ కిన్ని తరచూ మార్చుకుంటూ ఉంటే చిరాకు ఉండదు. కొందరు రోజంతా ఒక్కటే న్యాప్ కిన్‌తో నెట్టుకొచ్చేస్తుంటారు. దానివల్ల మనకు తెలియకుండా కాస్తంత చిరాకు ఉంటుంది. అది లేకుండా ఉండాలంటే రెండు మూడుసార్లు న్యాప్ కిన్ మార్చుకోవాలి. రక్తస్రావం అవుతోంది కదా అని జననాంగాలను పదే పదే శుభ్రం చేసుకోవడం కూడా పొరపాటే. అక్కడ మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది. మితిమీరి శుభ్రం చేయడం వల్ల అది పోతుంది. అంతేకాదు ఈ సమయంలో వీలైనంత వరకూ శృంగారానికి దూరంగా ఉండాలి. లేదంటే ఇన్ఫెక్షన్లు రావడమే కాదు కడుపు, నడుము నొప్పి తీవ్రమయ్యే అవకాశం కూడా ఉంది.
నచ్చిన పని చేయండి: బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే మనసుకు నచ్చే పనులు చేయాలి. ఎందుకంటే నెలసరి సమయంలో మానసికంగా కూడా కొన్ని తేడాలు వస్తుంటాయి. అందుకే నచ్చని పనులు చేస్తే విసుగు, కోపం, ఒత్తిడి వంటివి కలుగుతాయి. దానికి అవకాశం లేకుండా ప్రశాంతంగా ఉండటానికి ట్రై చేయాలి. మ్యూజిక్ వినడం లాంటి హాయిపర్చే ఇష్టాలకు సమయం కేటాయించండి. అలాగే ఏది పడితే అది తినేయకూడదు. ఈ సమయంలో వీలైనంత వరకూ జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. నూనె, కారం, మసాలాల జోలికి పోవద్దు. లైట్ ఫుడ్ తీసుకుంటేనే అంతా పీరియడ్స్ ఇబ్బందుల్ని కూడా లైట్‌గా తీసుకోగలం.
ఇప్పటివరకూ మీరు కనుక ఈ కేర్ తీసుకుని ఉండకపోతే ఇప్పుడు తీసుకుని చూడండి. కచ్చితంగా తేడాను గమనిస్తారు. ఎప్పడూ ఇబ్బందిగా ఫీలయ్యే ఆ మూడు రోజులూ ఈసారి ఎప్పుడు గడిచిపోయాయో తెలియనంతగా రిలీఫ్ ఫీలవుతారు. ట్రై చేయండి.