Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఆరోగ్యంగా జీవించడం అతి పెద్ద సవాలుగా మారింది. చాలా మందికి పాతికేండ్లు నిండకుండానే రకరకాల వ్యాధులు వచ్చేస్తున్నాయి. నలభై ఏండ్లకే ముసలి తనపు లక్షణాలు కనిపిస్తున్నాయి. అరవై ఏండ్లు జీవించడమే కష్టమవుతోంది. అయితే కొంతమంది మాత్రం ఈ రోజుల్లోనూ ఎంతో ఆరోగ్యంగా జీవిస్తున్నారు. వందేండ్లకు పైగా ఎలాంటి రోగాలూ లేకుండా బతుకుతున్నారు. అలాంటి వాళ్ల ఆరోగ్య రహస్యాల్ని పరిశోధించారు. తమ పరిశోధన ద్వారా కొన్ని విషయాలను తెలుసుకున్నారు. వాటిని పాటిస్తే కచ్చితంగా మనమూ ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించవచ్చు. అవేంటో మనమూ తెలుసుకుందాం.
జంక్ ఫుడ్‌కి దూరం
ఈ విషయం చెబితే చాలా మందికి నచ్చదు. ఎందుకంటే ఈ రోజుల్లో పిజ్జాలు, బర్గర్ల వంటివి తినడం సర్వసాధారణమయింది. ఇంట్లో వండుకునే వీలు లేక చాలా మంది ఇలాంటి ఫుడ్‌కి అలవాటుపడిపోతున్నారు. కానీ ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు. జంక్ ఫుడ్ బదులు పండ్లు, క్యారెట్ల వంటి కూరగాయలు, పల్లీలు లాంటి పప్పులు తింటే ఎంతో మంచిది.
వ్యాయామం చేయాల్సిందే
టైముకి తినడం, టైముకి పడుకోవడం ఎంత ముఖ్యమో శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడమూ అంతే ముఖ్యం. వ్యాయామం చేస్తే శరీరంలో వృథాగా ఉన్న కొవ్వు కరుగుతుంది. శరీరంలోని వివిధ భాగాలు ఎంత సైజులో ఉండాలో అంత సైజుకి వచ్చేస్తాయి. అదే వ్యాయామం చెయ్యకపోతే కొన్ని శరీర భాగాలు కొవ్వు పేరుకొని అదనంగా పెరిగి అనారోగ్యాలకు కారణమవుతాయి. నడక, పరుగు, స్విమ్మింగ్, యోగా, మెడిటేషన్ ఇవన్నీ మనలోని ఒత్తిడిని పోగొట్టి ఫిట్ నెస్ పెంచుతాయి.
కాఫీ తాగండి
చాలా మంది కాఫీ తాగడాన్ని ప్రమాదకరంగా భావిస్తారు. ఎందుకంటే అందులో కెఫైన్ ఉంటుంది కాబట్టి. కానీ రోజుకు రెండు కాఫీలు తాగితే ఆరోగ్యానికి చెడు కంటే మేలే ఎక్కువ జరుగుతుందని పరిశోధనలు తేల్చాయి. ప్రధానంగా టైప్ 2 డయాబెటిస్, మతిమరపు, అల్జీమర్స్ వంటి రోగాలకు చెక్ పెట్టాలంటే కాఫీ తాగాలి. బాడీ హైడ్రేటెడ్‌గా ఉండేందుకు కూడా కాఫీ పనిచేస్తుంది.
రిఫైన్డ్ ఫుడ్ వద్దు
కొన్ని ఆహార కంపెనీలు ప్రాసెస్ చేసిన ఫుడ్ అమ్ముతాయి. రిఫైన్డ్ కార్బొహైడ్రేడ్స్ తయారుచేస్తాయి. అలాంటివి తినే బదులు ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్ బాగా ఉండేవి తినాలి. అంటే చేపలు, గుడ్లు తినవచ్చు. శాఖాహారులైతే ఆవకాడో, క్యారెట్లు, పాలకూర వంటివి తినవచ్చు. బెర్రీస్, కమలాలు, దానిమ్మకాయలు వంటి పండ్లు తింటే ఆరోగ్యమే ఆరోగ్యం.
సుగంధ ద్రవ్యాలు వాడాలి
సుగంధ ద్రవ్యాల్లో ఆరోగ్యాన్ని కాపాడే చాలా యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి. సూక్ష్మక్రిములతో అవి పోరాడతాయి. అందువల్ల మనం వంటల్లో తప్పనిసరిగా పసుపు, అల్లం, వెల్లుల్లి, చింతపండు, లవంగాలు, దాల్చిన చెక్క, ఆవాలు, ధనియాలు వంటివి తప్పనిసరిగా వాడాలి.
ఉదయం ఫుల్లుగా తినాలి
శరీరానికి రాత్రంతా విశ్రాంతి ఇస్తాం కాబట్టి తెల్లారే మన శరీర భాగాలన్నీ ఉత్తేజంతో ఉంటాయి. ఈ సమయంలో వాటికి సరైన ఆహారం ఇస్తే అవి బాగా పనిచేస్తాయి. అందుకే ఉదయం నిద్రలేచిన రెండు, మూడు గంటల్లో బ్రేక్ పాస్ట్ తినాలి. ఫాస్ట్‌గా కాకుండా బాగా నమిలి తినాలి. అలాగే కాస్త ఎక్కువగానే తినాలి. మధ్యాÛహ్నం కాస్త తక్కువ తినాలి. రాత్రికి ఇంకా తక్కువ తినాలి. అలాగే ఆహారంలో ఫ్రూట్స్ ఉండేలా చేసుకోవాలి. ఆహారం తినే ముందు, తర్వాత ఓ గ్లాస్ నీరు తాగడం మర్చిపోవద్దు.
డ్రై ఫ్రూట్స్ తప్పనిసరి
డ్రై ఫ్రూట్స్ రేటెక్కువ. వాటిని ధనవంతులు మాత్రమే తినగలరు అని చాలా మంది అనుకుంటారు. కావచ్చు గానీ... అందరూ డ్రై ఫ్రూట్స్ తింటూ ఉండాలి. గింజలు, పప్పులు, బద్దల వంటివి తినాలి. బాదం, పిస్తా, జీడిపప్పు వంటివి ఎక్కువ తినకపోయినా వారానికి మూడుసార్లైనా అలాంటివి కొద్ది మొత్తంలో తినాలి. ఇక పల్లీలు, బఠాణీలు, శనగలు, బీన్స్, మొక్కజొన్న ఇలాంటివి కాస్త ఎక్కువే తినొచ్చు. ఇవన్నీ మనల్ని ముసలి తనం రాకుండా కాపాడతాయి.
మంచి కొవ్వు కావాలి
మన బాడీలో మంచికొవ్వు, చెడ్డ కొవ్వూ రెండూ ఉంటాయి. మంచి ఆహారం తింటే మంచి కొవ్వు తయారవుతుంది. అది మనకు ఎంతో మేలు చేస్తుంది. అదే ఎక్కువగా నూనెలో వేయించిన ఫ్రైల వంటివి తింటే చెడ్డ కొవ్వు కూడా కడుతుంది. అది చాలా ప్రమాదం. దాని వల్ల సర్వ రోగాలూ వస్తాయి. చర్మం పాడవుతుంది. జుట్టు రాలిపోతుంది. జీర్ణక్రియ దెబ్బతింటుంది. షుగర్, బీపీ, హార్ట్ ఎటాక్ ఇలా ఎన్నో రోగాలు వస్తాయి. అందుకే మనం మంచి ఆహారం తినాలి. ఎక్కువగా ఉడికించినవి తినాలి.
అతిగా పని చెయ్యవద్దు
కొంతమందికి పని తప్ప మరో లోకం తెలియదు. అలా ఉండకూడదు. పని టైంలో పని చెయ్యాలి. రోజులో మూడు నాలుగు గంటలు రిలాక్స్ అయ్యేందుకు కూడా వీలు కల్పించుకోవాలి. మరీ ఎక్కువ టెన్షన్లు పెట్టుకోకూడదు. మాటిమాటికీ టెన్షన్ వద్దు. కూల్ కూల్ అనుకుంటూ మనసును తేలిక చేసుకోవాలి. టీవీల్లో, మొబైళ్లలో కామెడీ సీన్ల వంటివి చూడాలి. తద్వారా టెన్షన్లు కాస్త తగ్గుతాయి.
సరిపడా నిద్ర
మనందరం బాగా కష్టపడతాం. కానీ సరిగా నిద్రపోము. నిజానికి రాత్రి 8 గంటలకే పడుకొని ఉదయం 4 గంటలకు లేవడం సరైన పద్ధతి. కానీ ఈ రోజుల్లో చాలా మంది రాత్రి 12 గంటలకి పడుకొని తెల్లారి 6 గంటలకల్లా లేచిపోతున్నారు. రోజూ అదే సమయం కాకుండా వేర్వేరు సమయాల్లో పడుకుంటున్నారు. ఇవన్నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. రోజుకు కనీసం ఏడు గంటలు పడుకోవాలి. ఎనిమిది గంటలు పడుకుంటే ఇంకా మంచిది. నిద్ర సరిగా లేకపోతే బుర్ర హీటెక్కిపోతుంది. మతిమరపు మొదలవుతుంది. ఇర్రిటేషన్ వస్తుంది. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయి, షుగర్ వ్యాధి వస్తుంది. హార్మోన్లు దెబ్బతిని అడ్డమైన రోగాలూ వస్తాయి. వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే చక్కగా నిద్రపోవాలి.
స్వచ్ఛమైన గాలి
ఇళ్లలో, ఆఫీసుల్లో డోర్లన్నీ మూసేసుకొని ఏసీల్లో జీవిస్తే అంతా నష్టమే. బయటి నుంచీ వచ్చే గాలిలో ఆక్సిజన్ ఎక్కువ. అది మన మెదడుకి చాలా అవసరం. అది అందేలా చెయ్యాలి. మొక్కలు, చెట్ల మధ్య నడవాలి. వీలైనంతవరకూ ప్రకృతిలో జీవించేందుకు ప్రయత్నించాలి.