Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు.. దీన్ని మరో సారి రుజువు చేశారు సంధ్య రసకట్ల.. యోగేశ్వరి రాణే. భారతదేశపు మొట్టమొదటి మహిళా భూగర్భ గని మేనేజర్‌గా మన తెలంగాణ బిడ్డ సంధ్య బాధ్యతలు తీసుకోగా... భూగర్భ గని అభివృద్ధి నిర్వాహకురాలిగా యోగేశ్వరి రాణేను నియమించారు. ఇప్పటి వరకు మైనింగ్ రంగంలో మహిళలకు అనుమతి లేదు. అలాంటి చోట ఈ ఇద్దరు తమ సత్తా చాటుకున్నారు. మరెందరికో ప్రేరణగా నిలిచారు. దేశంలోనే ఓ విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టిన వారి గురించి ఈ రోజు మానవిలో తెలుసుకుందాం...
ప్రపంచంలోనే జింక్, సీసం, వెండి ఉత్పత్తి చేసే అతిపెద్ద పరిశ్రమల్లో ఒకటైన ఉదయపూర్ ప్రధాన కార్యాలయం హిందుస్తాన్ జింక్ ఓ విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. భారతదేశంలోనే మొదటిసారిగా ఓ మహిళకు భూగర్భ గని నిర్వాహకురాలిగా అవకాశం కల్పించింది. మైనింగ్ ఇంజనీర్లు సంధ్య రసకట్ల, యోగేశ్వరి రాణే భూగర్భ గనిలో నిర్వాహక స్థాయిలో నియమించబడిన మొదట్టమొదటి భారతీయ మహిళలుగా నిలిచారు.
మొదటి మహిళలు వీరే
2018 నుండి వేదాంత గ్రూప్‌లో భాగమైన హిందూస్తాన్ జింక్‌లో పని చేస్తున్న సంధ్య, యోగేశ్వరి 'అనియంత్రిత' విభాగంలో 'ఫస్ట్ క్లాస్ మైన్స్ మేనేజర్'గా సర్టిఫికేట్ పొందిన మొదటి మహిళలు. మైనింగ్ ఇంజనీర్లు గని మేనేజర్ బాధ్యతలు స్వీకరించాలంటే రెండు ధృవపత్రాలు ఉండాలి. మొదటిది 'సెకండ్ క్లాస్ మైన్స్ మేనేజర్' సర్టిఫికేట్, అలాగే 'ఫస్ట్ క్లాస్ మైన్స్ మేనేజర్' సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్‌ను పొందిన మొదటి మహిళలు కూడా వీరే. 1952లో ప్రవేశపెట్టిన గనుల చట్టం 2019లో సవరణల చేయబడింది. ఈ సవరణలో భాగంగా పై సర్టిఫికేట్లు పొందిన మహిళలు ఏదైనా గనిలో భూమి పైన లేదా లోపల పని చేయడానికి అర్హులు. గతేడాది అనియంత్రిత విభాగంలో 'సెకండ్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్' అందుకున్న తొలి మహిళ కూడా సంధ్య.
సాఫ్ట్వేర్ కావాలనుకొని
ఇంటర్ చదివే సమయంలో తనతోటి విద్యార్థుల లాగే, సంధ్య కూడా ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్‌వేర్‌లో తన కెరీర్‌ను కొనసాగించాలనుకుంది. అయితే అనుకోకుండా ఆమె జీవితం మారిపోయింది. ఆమెను మహిళల కోసం నిర్దేశించని భూభాగంలోకి తీసుకువెళుతుంది. భూపాల్పల్లికి చెందిన సంధ్య ఇప్పుడు భూగర్భంలో పనిచేస్తున్న మొదటి మహిళా మైనింగ్ ఇంజనీర్‌గా చరిత్ర సృష్టించింది.
మామయ్య ప్రేరణతో...
సంధ్య ఇంటర్ చేసే సమయంలో టెక్కీగా కెరీర్ కావాలని కలలుకంటున్నట్టు గుర్తుచేసుకుంది. అయితే ఆమె భవిష్యత్‌కు మేనమామలు ప్రేరణగా నిలిచారు. ఇంటి వద్దే ఉంటూ హాయిగా పని చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయని ఎంతో మంది ఆమెతో అన్నారు. అప్పుడే మైనింగ్‌లో నాకు సీటు వచ్చింది. ఆ సమయంలో మామయ్య ఇచ్చిన సలహా ఆమెకు ఎంతో ఉపయోగపడింది. 'మైనింగ్ అభివృద్ధి చెందుతున్న రంగం. ఈ రంగం ద్వారా ముందుకు వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు' అని అన్నారు. దాంతో ఆమె కొత్తగూడెం యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి మైనింగ్ ఇంజనీరింగ్ ఎంచుకుంది.
సమస్యలు ముందే తెలుసు
సంధ్య తండ్రి సింగరేణిలో పనిచేస్తున్నారు. కాబట్టి ఈ రంగంలో.. ముఖ్యంగా మహిళగా ఆమెకు ఎదురయ్యే అన్ని సవాళ్ళ గురించి ఆమెకు ముందే తెలుసు. 2018లో మైనింగ్ ఇంనీరింగ్లో నాలుగేళ్ల కోర్సు పూర్తి చేస్తున్న సమయంలో ఆమెకు హిందూస్తాన్ జింక్ లిమిటెడ్ వేదాంత, ఉదయపూర్‌లో సంధ్యకు ఉద్యోగ అవకాశం వచ్చింది.
రెండు సర్టిఫికేట్స్ తప్పనిసరి
ఉద్యోగంలో మొదటి సంవత్సరం పూర్తిచేసిన సమయంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డిజిఎంఎస్) ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. మైనింగ్ ఇంజనీర్లు తప్పనిసరిగా రెండు సర్టిఫికెట్లు కలిగి ఉండాలని. దాని గురించి సంధ్య వివరిస్తూ సంధ్య ''ఇది రెండవ తరగతి మేనేజర్ సర్టిఫికేట్ దీని తర్వాత ఫస్ట్-క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ పొందవలసి ఉంటుంది' అని అన్నారు.
కొన్ని నిబంధనలతో అవకాశం
''బిటెక్ పూర్తి చేసిన తర్వాత మేము ఓ విహార యాత్రకు వెళ్ళినట్టు భూగర్భ సైట్‌ను సందర్శించవచ్చు. కానీ అక్కడ పని చేయడానికి మాకు అర్హత లేదు. అందుకే పురుషులు మాత్రమే పని చేయగలరు'' ఆమె అన్నారు. ఏదేమైనా అమ్మాయిలకు ఆ అవకాశం 2019లో సృష్టించబడింది. మాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది కొన్ని నిబంధనలు, షరతులతో ఉన్నప్పటికీ మహిళలను భూగర్భంలో పని చేయడానికి వీలు కల్పించింది. ''నేను డీజీఎంఎస్ అసిస్టెంట్ మేనేజర్ పాత్ర కోసం దరఖాస్తు చేసుకున్నాను. సర్టిఫికేట్ అందుకున్నాను. నేను ఫస్ట్ క్లాస్ క్లియర్ చేస్తే, నేను మైనింగ్ మేనేజర్ అవుతాను. భారతదేశంలో ఈ సర్టిఫికేట్ పొందిన మొదటి మహిళ నేను'' అని సంధ్య గర్వంగా చెబుతున్నారు.
ఎందరికో వీరు ప్రేరణ- అరుణ్ మిశ్రా, సీఈఓ, హిందూస్తాన్ జింక్
మైనింగ్‌లో మహిళలను అనుమతించడం ఓ విప్లవాత్మక నిర్ణయం. ఇది మాకు అలాగే మహిళా మైనింగ్ ఇంజనీర్లకు సామాజిక మార్పు తీసుకురావడానికి ఓ గొప్ప అవకాశం. హిందుస్తాన్ జింక్ ద్వారా మేము దీన్ని ఆచరణలో పెట్టగలిగాము. మైనింగ్ కార్యకలాపాలలో మా మహిళా ఇంజనీర్లకు సమాన వేదికను ఇవ్వగలిగినందుకు గర్వంగా ఉంది. మైనింగ్ ఇంజనీర్లుగా తమ కెరీర్‌ను కొనసాగించాలనుకునే యువతులందరికీ సంధ్య, యోగేశ్వరి నియామకాలు ఓ ప్రేరణగా నిలుస్తాయని నేను కచ్చితంగా అనుకుంటున్నాను. మైనింగ్ పరిశ్రమలో నాయకులు కావాలని కోరుకునే యువతులకు ఇది ఓ మెట్టు మాత్రమే.
- సలీమ