Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంటర్వ్యూలకు వెళ్లినప్పుడు మనం ఏం చదివిందీ... మన ఫైల్ చూస్తే అర్థం అవుతుంది. మనం ఎలా ఉన్నదీ మనల్ని చూస్తే అర్థం అవుతుంది. కానీ వీటన్నింటికంటే మన వ్యవహార శైలి ఎలా ఉందో తెలుసుకోవడానికి వారు ప్రయత్నిస్తారు. ''ఇంటర్ వ్యూ'' మన లోపలి వ్యక్తిని తెలుసుకునేందుకే దాన్ని నిర్వహిస్తారు. మరి మన మంచితనాన్ని మనం వెంటనే చెప్పడం వీలు కాదు. దానికి టైమ్ పడుతుంది. కానీ ఇంటర్వ్యూలో అంత టైమ్ ఉండదు. ఆ క్షణం మనల్ని మనం నిరూపించుకోవాలి. ఇదో సవాలే. టెన్షన్ పడేవారికి ఇది ఇంకా పెద్ద సవాలు. అయితే మనం కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వడం ద్వారా... ఇంటర్వ్యూ అదరగొట్టవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
ఎదురుగా కూర్చోవాలి: మీరు ఇంటర్వ్యూలో ఎలా కూర్చున్నారనేది చాలా కీలకం. ఎప్పుడూ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వ్కక్తికి ఎదురుగా, కాన్ఫిడెన్స్‌తో కూర్చోవాలి. ఇందుకోసం బిగుతుగా ఉండిపోవాల్సిన పనిలేదు. కూర్చున్నప్పుడైనా, నిల్చున్నప్పుడైనా ఇంటర్వ్యూ చేసేవారివైపే మీరు ఉండాలి. ఇద్దరు లేదా ముగ్గురు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఎవరితో మాట్లాడితే వారివైపు మీరు పూర్తిగా తిరిగి మాట్లాడటం మేలు.
కండ్లలోకి చూడాలి: మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వారి కండ్లను లేదా వారి నోటిని చూస్తాం. ఇంటర్వ్యూలో మాత్రం కండ్లనే చూడాలి. అలాగని బలవంతంగా కండ్లలో కండ్లు పెట్టి అదే పనిగా చూడకూడదు. జస్ట్ మనం మాట్లాడేటప్పుడు వారి కండ్లలోకి చూసి క్యాజువల్‌గానే మాట్లాడాలి. తద్వారా వారికి మీరు ఎంతో ఆసక్తితో ఉన్నట్లు అర్థం అవుతుంది. ఇంటర్వ్యూ బాగా జరుగుతుంది.
నవ్వడం మర్చిపోవద్దు: ముందుగా మీరు నవ్వారంటే అవతలి వారు చాలా ఫ్రీ అవుతారు. మీతో ఫ్రెండ్లీగా మాట్లాడేందుకు సిద్ధపడతారు. అదే మీరు గంభీరంగా ఉంటే వారు ఫ్రీగా మాట్లాడలేరు. కాబట్టి నవ్వడం మర్చిపోవద్దు. అలాగని విరగబడి నవ్వకూడదు. చిరునవ్వుతో పలకరించాలి. అలాగే అనవసరంగా నవ్వకూడదు. చెప్పే మాట, సందర్భం అన్నీ లెక్కలోకి తీసుకొని సందర్భానుసారం నవ్వాలి. మొత్తంగా నవ్వు మాత్రం ఉండాలి. ఇదే మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది.
పేరుతో పలకరించండి: ఎవరితోనైనా షేక్ హ్యాండ్ తీసుకునేటప్పుడు, ఇచ్చేటప్పుడు ఏదైనా అనాలి. అలా అనడం ద్వారా మంచి ఇంప్రెషన్ వస్తుంది. షేక్ హ్యాండ్ ఇస్తూ వారి పేరు పలకవచ్చు. నైస్ టు మీట్ యూ సార్ అనొచ్చు. గ్రేట్ మీటింగ్ విత్ యు సార్ అనొచ్చు. వారి పేరు మీరు పలికితే వారితో పని చేయడానికి మీరు ఎంతో ఆసక్తితో ఉన్నారని అర్థం. తద్వారా వారు ఎంతో ఆనందపడతారు.
కుర్చీలో కూర్చునపుడు వెనక్కి ఆనుకొని కూర్చోకూడదు. కాస్త ముందుకు వాలి కూర్చోవాలి. మీరు దర్జాగా వెనక్కి ఆనుకొని కూర్చుంటే మీకు ఆసక్తి లేదనే ఫీలింగ్ అవతలి వారికి కలుగుతుంది. అదే ముందుకు వాలి కూర్చుంటే వారు చెప్పేది వినేందుకు మీరు సిద్ధంగా ఉన్నారనే విషయం వారికి అర్థం అవుతుంది. తద్వారా మీ సంభాషణ అదిరిపోతుంది. కొద్దిగా ముందుకు వాలి కూర్చొని మీ చేతుల్ని క్రాస్‌గా కాకుండా విడివిడిగా ఉంచుకోండి. కలుపుకోవద్దు.