Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎండలు మండిపోతున్నాయి. చెమటల చిరాకుతో తిండి సరిగా తినలేము. పెరుగుతో చల్లగా కాస్త కడుపులో పడితే హాయిగా అనిపిస్తుంది. అయితే కేవలం పెరుగుతో తినాలంటే బోర్ కొడుతుంది. అందుకే పెరుగుతో చేసిన కొన్ని వంటకాలు ఈ రోజు మీకు పరిచయం చేస్తున్నాం.
షోర్బా
కావల్సిన పదార్థాలు
పెరుగు 200 మి.లీ., నూనె - రెండు టీ స్పూన్లు, జీలకర్ర - రెండు టీ స్పూన్లు, ఆవాలు - టీ స్పూను, పచ్చిమిర్చి - రెండు, ఇంగువ - చిటికెడు, సెనగపిండి - మూడు టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి - పది రెబ్బలు, పసుపు - చిటికెడు, ఉప్పు - సరిపడా.
తయారు చేసే విధానం
వెల్లుల్లి సన్నగా తరగాలి. బాణలిలో నూనె పోసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. తర్వాత సెనగపిండి, పెరుగు వేసి మరిగించాలి. చివరగా టమాటా ముక్కలు, కొత్తిమీర, ఉప్పు వేసి దించాలి.
పూల్ మఖానా కీ కడీ
కావల్సిన పదార్థాలు
పెరుగు - అరలీటరు, పూల్ మఖానా - పావుకిలో, సెనగపిండి - వంద గ్రాములు, దనియాలు - రెండు టేబుల్ స్పూన్లు, అల్లం తురుము - టేబుల్ స్పూను, ఇంగువ - చిటికెడు, పసుపు - అర టీ స్పూను, కొత్తిమీర తురుము - టేబుల్ స్పూను, ఉప్పు - సరిపడా, నూనె - సరిపడా.
తయారు చేసే విధానం
బాణలిలో నూనె పోసి మఖానాలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో కొద్దిగా నూనె ఉంచి దనియాలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం తురుము, ఇంగువ వేసి వేయించాలి. గిన్నెలో సెనగపిండి వేసి నీళ్లు పోసి కలపాలి. పెరుగు కూడా వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని వేయించిన దనియాల మిశ్రమంలో కలిపి చిక్కగా అయ్యే వరకూ ఉడికించాలి. ఉప్పు సరిచూసి వేయించిన మఖానాలు, కొత్తిమీర తురుము వేసి దించాలి.
దహీ కీ సబ్జీ
కావల్సిన పదార్థాలు
బీన్స్ - పావుకిలో, క్యారెట్ - పావుకిలో, కాలిఫ్లవర్ - కొద్దిగా, బఠాణీ - వంద గ్రాములు, పెరుగు - పావు లీటరు, ఉప్పు - సరిపడా, పసుపు - టీస్పూను, గరం మసాలా - రెండు టీ స్పూన్లు, జీలకర్రపొడి - రెండు టీస్పూను, దనియాల పొడి - రెండు టీ స్పూన్లు, కొత్తిమీర తురుము - టేబుల్ స్పూను, కారం - టీస్పూను, నూనె - టేబుల్ స్పూను, అల్లం వెల్లుల్లి - టేబుల్ స్పూను, ఉల్లిగడ్డ - రెండు.
తయారు చేసే విధానం
కూరగాయలన్నీ ముక్కలుగా కోసి, బఠాణీలతో కలిపి ఉడికించాలి. పాన్లో నూనె పోసి కాగాక ఉల్లిగడ్డ ముక్కలు, అల్లం వెల్లుల్లి వేసి వేయించాలి. అవి వేగాక మసాలా పొడులన్నీ వేసి ఓ నిమిషం వేయించాలి. తర్వాత పెరుగు వేసి కలపాలి. ఉడికించిన ముక్కలు, ఉప్పు, కొత్తిమీర తురుము వేసి రెండు నిమిషాలు ఉడికించి దించాలి.
దహీ కబాబ్
కావల్సిన పదార్థాలు
పలుచని బట్టలో వేసి నీళ్లు లేకుండా వేలాడ దీసిన పెరుగు - కప్పు, మైదాపిండి - పావుకప్పు, పచ్చిమిర్చి - టీ స్పూను, అల్లం తురుము - టీస్పూను, జీలకర్రపొడి - టీస్పూను, యాలకుల పొడి - పావుటీస్పూను, కొత్తిమీర తురుము - టీస్పూను, ఉల్లిగడ్డ ముక్కలు - పావుకప్పు, ఉప్పు - సరిపడా, నూనె - వేయించడానికి సరిపడా.
తయారు చేసే విధానం
ఉల్లిముక్కల్ని నూనెలో వేయించి ఉంచాలి. వేలాడదీసిన పెరుగులో మైదాపిండి, ఉప్పు, వేయించిన ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి తురుము అన్నీ వీసి కలపాలి. ఈ మిశ్రమాన్ని గుండ్రని బిళ్లల్లా చేసుకుని నూనెలో వేయించి తీయాలి.
బెండకాయ పెరుగు కూర
కావల్సిన పదార్థాలు
బెండకాయలు - పావుకిలో, పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరగాలి), ఉల్లిగడ్డ - ఒకటి, టమాటాలు - రెండు, జీడిపప్పు - పది, పచ్చి కొబ్బరి తురుము - రెండు టేబుల్ స్పూన్లు, పసుపు - టీస్పూను, ఉప్పు - సరిపడా, కారం - టీస్పూను, దనియాల పొడి - అరటీస్పూను, పెరుగు - రెండు కప్పులు, కొత్తిమీర తురుము - టేబుల్ స్పూను, ఆవాలు - అర టీస్పూను, మినప్పప్పు - పావు టీ స్పూను, ఎండు మిర్చి - మూడు, కరివేపాకు - రెండు రెబ్బలు, నూనె - సరిపడా.
తయారు చేసే విధానం
బెండకాయ అంగుళం పొడవు ముక్కలుగా కోయాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ సన్నగా పొడవుగా తరగాలి. టమాటాలు ముక్కలుగా కోయాలి. బాణలిలో నూనె పోసి బెండకాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించి తీసి పక్కన ఉంచాలి. పచ్చికొబ్బరి తురుము, జీడిపప్పు కలిపి మెత్తగా రుబ్బాలి. బాణలిలో నూనె వేసి ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి వేయించాలి. వేగాక పసుపు, దనియాల పొడి వేసి కలపాలి. టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి. రుబ్బిన కొబ్బరి ముద్ద వేసి నూనె తేలే వరకు ఉడికించాలి. పెరుగు, బెండకాయ ముక్కలు, ఉప్పు వేసి ఏడెనిమిది నిమిషాలు ఉడికించి కొత్తిమీర తురుము చల్లి దించాలి.