Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్క్ ప్రతి ఒక్కరి శరీరంలో ఓ భాగమైంది. మాస్క్లు పెట్టుకోమన్న కొత్తలో మ్యాచింగ్ మాస్క్లు అడుగుతున్నారంటూ జోకులు వేసి నవ్వుకున్నాం గానీ.. నేనీ మధ్య షాపుకు వెళ్ళి ఓ డ్రెస్ కొనుక్కున్నప్పుడు దానికి మ్యాచింగ్ మాస్క్ కూడా ప్యాకింగ్తోనే ఇచ్చారు. కరోనా కాలంలో బట్టలు కొనుక్కోకపోవడం వల్ల నాకీ విషయం లేటుగా తెలిసింది. అంతగా మన జీవితాల్లోకొచ్చింది ఈ మాస్క్. అయితే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు లేదా సరిగా వినపడలేదనో అన్నప్పుడు మాస్క్ కిందికి దింపి మాట్లాడుతున్నారు. మనం కూడా అనాలోచితంగానే మాస్క్ తీసి మాట్లాడతాము. ఇది గుర్తుంచుకోవలసిన విషయం. మాస్క్ ముక్కును కూడా కప్పి ఉంచాలి. ప్రస్తుత తరుణంలో మాస్క్, వ్యాక్సిన్, శానిటైజర్, భౌతికదూరం అనే ఈ నాలుగు సూత్రాలే మనల్ని కాపాడగలిగేవి. ప్రపంచంలో ఇంకేవీ మనల్ని కాపాడలేవు. అందుకే ప్రశాంతంగా ఇంట్లో ఉండి సృజనాత్మకంగా గడుపుదాం!
చెట్ల ఆకులతో...
ఇది ఏమి చెట్లో నాకు తెలియదు. రోడ్డు పక్కన నాటిన హరితహారపు చెట్లలో ఇది కూడా ఒకటి. సరే దీని ఆకులు ముచ్చటగా ఉన్నాయని కోసుకుని తెచ్చుకున్నాను. వీటితో ఏదో ఒక జంతువును చేయాలనుకున్నాను. ఈ సారి బుడి బుడి అడుగుల బాతు మీద మనసు పోయింది. తెల్లని స్వచ్ఛమైన బాతును హరిత బాతుగా తయారు చేశాను. ఆకు చివరి కొనదేరి ఉన్న భాగాన్ని బాతు ముక్కుగా అమర్చాను. చక్కగా అదే విధంగా ఆకుల్ని అమర్చుకుంటూ వచ్చే సరికి ముచ్చటైన బాతు శరీరం తయారైంది. కన్ను కోసం ఒక కాగితాన్ని కత్తిరించి పెట్టాను. కాళ్ళ కొరకు ఆకులు పెట్టి, ఆ తర్వాత కరివేపాకు రెమ్మల్ని తుంచి అమర్చాను. చక్కని కాళ్ళు వచ్చాయి. హరిత రంగు బాతు వచ్చింది.
స్కెచ్ పెన్నులతో...
నాకు ఏదో ఒక బొమ్మలు వేయడం అలవాటు. ఒక్కోసారి వాటికి రంగులు కూడా దిద్దుతుంటాను. అందుకని అన్ని రకాల స్కెచ్ పెన్నులు ఉంటాయి. హాస్పిటల్ కోసం తెచ్చిన రెండు బాక్సుల పెన్నులు అప్పుడే సంతకం కోసం నా దగ్గరకు వచ్చాయి. వీటన్నింటినీ కలిపి ఒక బొమ్మ ప్లాన్ చేయాలనుకున్నాను. ఇంతకు ముందు పెన్నులతో పూల పెన్నులు తయారు చేశాను. ఈసారి ఈ పెన్నులతోనే ఒక చిత్రం రూపొందించాలనుకున్నాను. మా అబ్బాయి బెంగుళూరు నుంచి వస్తూ స్కేలంత పెన్నులు పెద్దవి తెచ్చాడు. ఆ పొడుగు పెన్నులతో ఇల్లు కట్టాను. ఇంటి కప్పుకు నటరాజ్ పెన్నులు ఉపయోగించాను. ఇల్లు తయారయాక సాదాగా ఉందని ఇంటి ముందు పార్కింగ్ టైల్స్ లాగా గుండ్రటి రింగులు పెట్టాను. ఈ ఆకుపచ్చ రంగున్న గుండ్రటి గాజుల్లాంటి రింగులు ఎక్కడ సేకరించాననుకున్నారూ! వాటర్ కాన్స్ మూతలు తీసేటపుడు ఈ గుండ్రటి రింగులు వస్తాయి. ఆ తర్వాత ఇంటికి రెండు వైపులా కొబ్బరి చెట్లను పెట్టాలనుకున్నాను. రంగురంగుల స్కెచ్ పెన్నులను చెట్ల లాగా అమర్చాను. రంగులతో బొమ్మలు వేయడమే కాదు ఇళ్ళూ కట్టొచ్చు.. చెట్లూ నాటొచ్చు... చూశారా.
వక్క చెట్ల పూతతో...
మా అబ్బాయి పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నాడు. అందులో రకరకాల చెట్లున్నాయి. వాటిలో పోక చెట్లు కూడా ఉన్నాయి. ఇది అరికేసి కుటుంబానికి చెందిన చెట్టు. చూడటానికి కొబ్బరి చెట్టులా ఉంటుంది. కానీ దీని కాండం తక్కువ లావుగా ఉంటుంది. దీని శాస్త్రీయనామం ''అరేకా కెటాచూ''. ఈ వక్కలను మనం తాంబూలంలో, కిళ్ళీలలో వాడతాము. ఏ పేరంటమైనా ఆకు, వక్క లేనిదే జరగదు. అయితే ఈ వక్క చెట్ల పూత ఆకులకు కిందగా ఉంటుంది. ఆడ, మగ పుష్పాలు రెండూ ఒకే పుష్ప గచ్ఛంలో ఉంటాయి. పుష్ప గుచ్ఛాలు చాలా బాగుంటాయి. అవి కొన్ని ఎండి రాలిపోతే మేం తెచ్చుకున్నాము. కొన్ని రాల గొట్టుకొని తెచ్చుకున్నాం. ఇవి బాగా ఎండి నలుపు రంగుకు తిరిగిపోయాయి. ఎండినందువల్ల వంగి రకరకాల ఆకారాల్లోకి వచ్చాయి. అన్నింటినీ ఒక చోట కూడగడితే పాముల్లా కనిపించాయి. పాముల కుటుంబమంతా సమావేశమై ఏదో విషయం చర్చించుకుంటున్నట్టుగా కనిపించింది. కాడకు పూత ఉండటం వలన గాలికి కూడా అటూ ఇటూ ఊగుతున్నాయి. అవి ఊగుతుంటే పాములు తలలు తిప్పి నాట్యం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. నాకివి తయారు చేసినపుడు చాలా గమ్మత్తుగా అనిపించింది.
బొప్పాయి గింజలతో...
గతంలో మీకు నెక్లెస్లు చూపించాను. ఈసారి బొప్పాయి గింజలతో, సగ్గుబియ్యంతో, మరమరాలతో తయారైన ఒక నెక్లెస్ను చూపిస్తాను. బొప్పాయి కాయ కోసినప్పుడు లోపల నల్లటి గింజలు ఉంటాయి. అవి జిగురు జిగురుగా ఉంటాయి. వాటిని కడిగి ఆరబెడితే జిగురు పోయి పోడిగా అవుతాయి. అలాంటి గింజల్ని తీసుకొని నల్లపూసల గొలుసు తయారు చేద్దామని నిర్ణయించుకున్నాను. బొప్పాయి గింజల్ని రెండు వరుసలుగా పెట్టాను. దానికి కిందుగా జాలకిలాగా మరమరాల గింజల్ని నిలువుగా పెట్టాను. ఈ మరమరాలకు రాళ్ళు పొదిగినట్టుగా సగ్గుబియ్యం గింజల్ని అమర్చాను. దీనికి వెనుక వైపు చైను కోసం పుట్నాల పప్పు గింజల్ని వరసగా పెట్టాను. అంతా తయారయ్యాక లాకెట్ లేకపోతే బాగోలేదని మా పనమ్మాయి అన్నది. వెంటనే ఎర్రటి పువ్వుతో లాకెట్ అమర్చాను. అందమైన నల్లపూసల గొలుసు తయారైంది.
ఎండిన కాయలతో...
ఇది చూడటానికి తుమ్మ చెట్టులా ఉంది. పూత అంతా తుమ్మ పూతలాగే ఉంది. కానీ ముళ్ళు లేవు. ఏం చెట్లో తెలియలేదు. కాయలు రెండుగా విడిపోయి కింద రాలి పడుతున్నాయి. కాయగా ఉన్నపుడు ముదురు గోధుమ రంగులో ఉంటుంది. విడిపోయాక లోపల తెల్లగా ఉంటుంది. వాటికి విత్తనాలు ఒక కాడ ద్వారా అతుక్కొని ఉంటాయి. నేను ఈ ఎండు కాయలను సేకరించాను. వీటితో బొమ్మలు చేస్తున్నాను. ఏదో ఒక మనిషి బొమ్మలా చెయ్యాలనుకున్నాను. ఒంపులు తిరిగిన ఆకును అమ్మాయి శరీరంగా తీసుకున్నాను. తల ప్రాంతంలో కళ్ళు, ముక్కు, నోరు పెట్టాను. కాడతో సహా ఉన్న విత్తనాలను చెవులకు లోలాకులుగా పెట్టాను. కొన్ని పెద్ద విత్తనాలను తలకు జుట్టుగా అమర్చాను. కింద పావడా లాగా కుచ్చులుగా ఆ కాయల్ని అమర్చాను. ఎండు కాయల అమ్మాయి తయారైంది.
- డా|| కందేపి రాణీప్రసాద్