Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నో ఊహించుకొని అత్తారింట్లో అడుగుపెట్టింది. కానీ అక్కడ ఆమె అనుకున్నట్టు లేదు. భర్త ప్రతి విషయానికి తల్లిపై ఆధారపడతాడు. అది తనకు నచ్చలేదు. కోరుకున్న ప్రేమా, ఆప్యాయత అక్కడ దొరకలేదు. అందుకే పుట్టింటికి వచ్చేసింది. అయినా భర్త ఫోన్ చేయడు, తీసుకెళ్ళడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె తన అన్నను తీసుకొని ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చి...
'మేడమ్ నా పేరు స్వప్న. నా పెండ్లి జరిగి నాలుగు నెలలు. మా వారి పేరు రమేష్. ఆయన సొంతగా ఏమీ ఆలోచించడు. ప్రతిదీ వాళ్ళ అమ్మ చెప్పాల్సిందే. మేము అడుగు బయట పెట్టాలంటే వాళ్ళ అమ్మ పర్మిషన్ కావాల్సిందే. ఆమె ముందు నాతో మాట్లాడటానికి కూడా భయపడతాడు. ఎక్కడికి తీసుకెళ్ళమన్నా డబ్బుల్లేవంటాడు. నేను ఉద్యోగం చేస్తానంటే వద్దంటాడు. ఇంట్లో ఎప్పుడూ గొడవలే. పైగా వాళ్ళ మరదలితో ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాడు. నాతో మాత్రం అస్సలు మాట్లాడడు. ఓ పక్క మా అత్త నేను చేసే ప్రతి పనికీ వంకలు పెడుతుంది. ఇంట్లో అన్నీ తనకు నచ్చినట్టే జరగాలి. లేదంటే బూతులు తిడుతుంది. ఇవన్నీ భరించలేక వారం రోజుల కిందట మా అమ్మవాళ్ళ దగ్గరకు వచ్చేశా. ఎలాగైనా వాళ్ళతో మీరే మాట్లాడి నాతో మంచిగా ఉండేలా చేయండి' అంటూ బాధపడుతూ చెప్పింది.
స్వప్న చెప్పిందంతా విన్న లీగల్‌సెల్ సభ్యులు వచ్చే వారం రమేష్‌ని, అతని తల్లిదండ్రులను రమ్మని లెటర్ పంపారు. తర్వాతి వారం ఇరువైపు వారు వచ్చారు. సభ్యులు ముందు రమేష్‌ని పిలిచి మాట్లాడితే...
'మేడమ్ స్వప్నకు పెద్దలను గౌరవించడం తెలీదు. మా నాన్న ముందు కాలు మీద కాలేసుకొని కూర్చుంటుంది. మంచంపై పడుకొని లేవదు. పెండ్లికి ముందు నేను ఓ షాప్‌లో పని చేసేవాడిని. స్వప్న వాళ్ళ అమ్మ ఆ పని మానేయమంది. సరే కదా అని డ్రైవింగ్ నేర్చుకున్నా. ఈ మధ్యే ఓ దగ్గర డ్రైవర్‌గా చేరా. అలసిపోయి ఇంటికి వచ్చి స్వప్నను అన్నం పెట్టమంటే పెట్టదు. టీవీ ముందు నుండి అస్సలు లేవదు. డ్రైవింగ్ ఫీల్డ్ నాకు కొత్త. పెద్దగా ఆదాయం లేదు. స్వప్నకేమో సినిమాలకు, షికార్లకు వెళ్లడమంటే ఇష్టం. డబ్బులు లేక తర్వాత వెళదామంటే వినదు. నోటికి ఎంత మాట వస్తే అంత అనేస్తుంది. మా అమ్మ మాట అస్సలు వినదు. ప్రతి దానికి పుట్టింటికి వెళ్ళి కూర్చుంటుంది. దాంతో కోపం వచ్చి రెండు సార్లు చేయిచేసుకున్నా. కానీ తనంటే నాకు చాలా ఇష్టం. ఆమె మాతో మంచిగా ఉంటే చాలు' అంటూ చెప్పుకొచ్చాడు.
రమేష్ చెప్పిన దానికి సభ్యులు 'నువ్వు నీ మరదలితో ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతున్నావని స్వప్న చెప్పింది. మరి దాని సంగతేంటి' అని అడిగారు.
'ఎప్పుడో ఓసారి తప్ప ఎక్కువగా మాట్లాడను. తను చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే పెరిగింది. దాంతో కాస్త చనువుగా ఉంటాం. అందుకే స్వప్న అపార్థం చేసుకుంది' అన్నాడు.
దానికి సభ్యులు 'ఏ ఆడపిల్లకైనా పెండ్లి తర్వాత కొత్త జీవితం ప్రారంభమవుతుంది. నీపై నమ్మకంతో తన వాళ్ళందరినీ వదులుకొని నీతో కలిసి మీ ఇంటికి వచ్చింది. ఏది ఏమైనా పెండ్లయిన తర్వాత తల్లితో పాటు నీ భార్యకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. లేకపోతే ఇలాంటి అపార్థాలే వస్తాయి. మీ మధ్య గొడవలకు కూడా ఇదే కారణం. మరో విషయం ఏమిటంటే ఎంత కోపం వచ్చినా కొట్టడం తప్పు. కేవలం చేతగాని వాళ్ళే చేయిచేసుకుంటారు. ఏమైనా ఉంటే చెప్పి చేయించుకోవాలి. కొత్తగా పెండ్లయినపుడు ఎవరికైనా చిన్న చిన్న కోర్కెలు ఉంటాయి. భర్తతో కలిసి బయటకు వెళ్ళాలని తనకు ఉంటుంది. అయితే ఆర్థిక సమస్యల వల్ల నువ్వు ఆమె కోర్కెలు తీర్చలేకపోతున్నావు. అందుకే ఆమె నీతో, మీ అమ్మతో అలా మాట్లాడుతుంది. అది ఆమెకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. మేము మీ అమ్మతో కూడా ఓసారి మాట్లాడాలి ఆమెను రమ్మని చెప్పు' అని రమేష్‌ను బయటకు పంపారు.
రమేష్ వాళ్ళ అమ్మ లోపలికి వచ్చి 'నేను ఎప్పుడూ కొడుకూ కోడలు సంతోషంగా ఉండాలనే అనుకుంటా. కాని ఆమె నా మాట అస్సలు వినదు. నాకు నా కొడుకు తప్ప ఎవరూ లేరు. ఆడపిల్లలంటే నాకు చాలా ఇష్టం. అందుకే స్వప్నను నా కూతురిలా చూసుకోవాలని అప్పుడప్పుడు మంచి మాటలు చెబుతుంటా. నా కోడలు అందరిలో మంచిగా కనిపించాలని చీర కట్టుకోమంటా. అది ఆమెకు నచ్చదు. ఇంట్లో వాళ్ళిద్దరూ, మేమిద్దరమే ఉంటాం. అందరం కలిసి అన్నం తిందామని ఎన్ని సార్లు పిలిచినా రాదు. అందుకే మా మధ్య గొడవలు వస్తున్నాయి' అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
ఆమె చెప్పింది విన్న సభ్యులు 'చూడండి, మీ కోడలిపై మీకు చాలా కోర్కెలు ఉన్నాయి. దాంతో మీకు తెలియకుండానే ఆమెపై ఆంక్షలు పెడుతున్నారు. ఈ రోజుల్లో చీరకట్టుకోమంటే ఎవరికీ నచ్చదు. కాబట్టి కాలానికి అనుగుణంగా మీరూ మారాలి. లేదంటే తనకు అర్థమయ్యేలా చెప్పాలి. మీ అతి ప్రేమ, అతి జాగ్రత్త వల్లనే ఆమె ఇలా మొండిగా తయారయింది. పైగా మీరు చెప్తే తప్ప రమేష్ ఆమెను బయటకు తీసుకెళ్ళడం లేదనుకుంటుంది. మీ కొడుకూ, కోడలు నిజంగా సంతోషంగా ఉండాలనుకుంటే, కొన్ని రోజులు వాళ్ళను స్వేచ్ఛగా వదిలేయండి. అప్పుడు స్వప్న అపార్థాలు తీరిపోతాయి. మీరూ సంతోషంగా ఉండొచ్చు' అని సభ్యులు ఆమెకు చెప్పి స్వప్నను, రమేష్‌ను లోపలికి పిలిచారు.
స్వప్నతో 'నీ చిన్న చిన్న కోర్కెలు న్యాయమైనవే, కాని రమేష్‌ను మీరే ఉద్యోగం మానేసి వేరే పని చేసుకోమన్నారు. దాంతో డబ్బుకు కాస్త సమస్యగా ఉంది. అయినా కూడా ఉద్యోగం విషయంలో అతను మీ మాట విన్నాడు. అంటే నీపై అతనికి ప్రేమ ఉన్నట్టే కదా.. అందుకే నువ్వు కూడా అతన్ని అర్థం చేసుకోవాలి. పెండ్లి అయిందంటే కేవలం భర్త మాత్రమే నీ వాడుకాదు. అత్తామామ కూడా నీ కుటుంబంలో సభ్యులే. కాబట్టి వాళ్ళతో కూడా ప్రేమగా ఉండాలి. అందరితో కలిసి సరదాగా ఉండు. నువ్వు ప్రతిదానికీ ఎదురు మాట్లాడటం వల్ల సమస్యలు ఇంకా పెరుగుతాయి. వాళ్ళ వల్ల నీకేమైన సమస్య వస్తే మాకు చెప్పు. నువ్వు మాత్రం వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దు' అని స్వప్నకు సర్ధిచెప్పారు.
దానికి స్వప్న 'మీరు చెప్పినట్టే చేస్తా, అయితే నేను కూడా ఉద్యోగం చేస్తాను, రమేష్‌ను ఒప్పించండీ' అని అడిగింది.
కానీ రమేష్ ముందు ఒప్పుకోలేదు. దాంతో సభ్యులు 'ఈ రోజుల్లో ఇద్దరూ ఉద్యోగం చేస్తేనే కుటుంబం గడవడం కష్టంగా ఉంది. ఇక నీకు చూస్తే పెద్దగా ఆదాయం లేదు. అందుకే స్వప్న కూడా ఉద్యోగం చేస్తే సమస్య పరిష్కార మవుతుంది. ఇకపై మీకు నచ్చినట్టు ఉండటానికి తను ఒప్పుకుంది. కాబట్టి తన కోర్కెను కూడా నువ్వు ఒప్పుకోవాలి. తను ఉద్యోగం చేస్తే నీకు వచ్చిన నష్టమేమీ లేదు. పైగా మీ ఆర్థిక సమస్యలు పరిష్కార మవుతాయి. అప్పుడు స్వప్నకు తన చిన్న చిన్న అవసరాలకు నిన్ను డబ్బు అడగాల్సిన అవసరం కూడా ఉండదు. మీరిద్దరూ కష్టపడేది మీ కుటుంబం కోసమే కదా..' అని సర్ధి చెప్పారు.
అయితే రమేష్ దానికీ 'ఇప్పుడే తను మా మాట వినదు. రేపు ఉద్యోగం చేస్తే తలకెక్కి కూర్చుంటుందేమో మేడమ్' అన్నాడు. దానికి సభ్యులు 'నువ్వు అనుకుంటుంది తప్పు. అమ్మాయిల గురించి ఎప్పుడూ అలా అనుకోకు. ఉద్యోగం చేస్తున్న అమ్మాయికు కొంత ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది. ఆ ధైర్యంతో తమ సమస్యలను పరిష్కరించుకోగలరు. అంతేకానీ ఉద్యోగం ఉంది కదా అని పెత్తనం చెలాయించాలని, కుటుంబాన్ని దూరం చేసుకోవాలని ఏ అమ్మాయి అనుకోదు. అంటే తనని ఉద్యోగం చేయనీయకుండా నీ చెప్పుచేతల్లో ఉంచుకుంటావా?' అని అడిగారు.
దానికి అతను 'అలా ఏమీ అనుకోవడం లేదు' అన్నాడు. అయితే ఆమెను కూడా ఉద్యోగం చేయనివ్వు. ఇకపై ఆమె వల్ల ఏమైనా సమస్య వస్తే మా దగ్గరకు వచ్చి చెప్పు. నువ్వు మాత్రం ఆమెపై చేయి చేసుకోవద్దు' అని చెప్పారు. చివరకు స్వప్న ఉద్యోగం చేయడానికి రమేష్ ఒప్పుకున్నాడు. స్వప్న కూడా భర్తను, అత్తమామలను గౌరవిస్తానని, ప్రేమగా చూసుకుంటానని మాట ఇచ్చింది.
రమేష్ కూడా అప్పటి వరకు ఉన్న కోపాన్ని మర్చిపోయి తన తల్లిదండ్రులతో కలిసి స్వప్న వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేసి అదే రోజు స్వప్నను తన ఇంటికి తీసుకెళ్ళాడు.
- సలీమ