Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచాన్ని భయపెట్టించిన కరోనా మహమ్మారి ఇంకా తన ప్రతాపాన్ని చూపుతూనే ఉంది. సినిమా థియేటర్లు, జిమ్‌లు, రెస్టారెంట్లు, మార్కెట్లు వంటి రద్దీ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతూనే ఉన్నారు. దీనికి తోడు కోవిడ్-19 మన జీవన శైలిపై ఎంతో ప్రభావం చూపింది. ఆహారం, వ్యాయామం విషయంలో చాలామంది జాగ్రత్తగా ఉంటున్నారు. కొన్ని రకాల వ్యాయామాలకు ఎలాంటి జిమ్ పరికరాలు అవసరం లేదు. ఇంట్లోనే ఉంటూ మెట్లను ఆధారంగా చేసుకొని కొన్ని వర్కవుట్లు చేసుకోవచ్చు. ఈ కార్డియో, స్ట్రెన్త్ బేస్డ్ ఎక్ససైజ్లు మంచి ఫలితాలను ఇస్తాయి. అవేంటో మనమూ తెలుసుకుందాం...
- రెండు కాళ్లనూ భుజాలకు సమాంతర దూరంలో పెట్టి కింది మెట్టు మీద నిల్చోవాలి. మోకాళ్ళను కాస్త వంచుతూ, నడుము బలంతో రెండు కాళ్లతో ఒకేసారి పై మెట్టు మీదకు గెంతాలి. ఇలా రెండు పాదాలతో స్టెప్స్ నుంచి ఆఖరి మెట్టు వరకు వెళ్లాలి. పై మెట్టు మీదకు ల్యాండ్ అవుతున్నప్పుడు మోకాళ్లను వంచాలి. దీని వల్ల ల్యాండింగ్ సులువుగా, ఒత్తిడి లేకుండా జరుగుతుంది. మెట్లపైకి గెంతుతున్నప్పుడు శరీరాన్ని బ్యాలెన్స్ చేయడానికి చేతులను ఉపయోగించాలి. దీన్ని రోజుకు 20 సార్లు చేయాలి.
- ముందు కింది మెట్టు దగ్గర నిల్చొని పాదాలను భుజాలకు సమాన దూరంలో పెట్టాలి. మీ ఎడమ కాలును పైకి ఎత్తి, కాస్త వెనక్కు కదిలించాలి. తర్వాత ఒక పైమెట్టును వదిలేసి రెండో మెట్టుపైన ఎడమ కాలు పెట్టి పైకి చేరుకోవాలి. శ్వాస ఎక్కువగా తీసుకుంటూ.. రెండు మోకాళ్ళను వంచుతూ పైకి వెళ్లాలి. ఈ సమయంలో మీ కుడి మోకాలు నేలకు 90 డిగ్రీల కోణంలో ఉండేలా చూసుకోవాలి. వెన్నును వంచకూడదు. మరోసారి కుడికాలుతో ఇలానే చేయాలి. దీని ఐదు నుంచి 10 సార్లు చేయాలి.
- ముందు కింది నుంచి రెండవ లేదా మూడవ మెట్టుమీద కూర్చోవాలి. కూర్చున్న మెట్టుపై రెండు అరచేతులూ పెట్టి, చేతులపై బరువు వేసి నడుము భాగాన్ని పైకి ఎత్తాలి. మెట్ల నుంచి శరీరం మొత్తం పైకి వచ్చేలా చూసుకోవాలి. పైకి లేచేటప్పుడు చేతులు నిటారుగా ఉండాలి. ఈ వ్యాయామాన్ని కనీసం 10 సార్లు చేయాలి.
- కింది మెట్టు దగ్గర స్టెప్స్ డైరెక్షన్లో నిల్చోవాలి. మీ ఎడమ పాదాన్ని ఎడమవైపు వీలైనంత దూరం జరిపి అదే డైరెక్షన్లో పైమెట్టు మీదకు గెంతాలి. ఆ తర్వాత కుడి కాలును సాధ్యమైనంత వరకు కుడివైపు దూరంగా జరిపి అదే యాంగిల్లో స్టెప్స్పైకి గెంతాలి. మీ సామర్థ్యాన్ని బట్టి ఒక మెట్టు వదిలి మరో మెట్టు మీదకు గెంతవచ్చు. పై వరకు వెళ్లిన తర్వాత కిందకు నడుచుకుంటూ వచ్చి మళ్లీ మరోసారి వ్యాయామం చేస్తూ పైకి వెళ్లాలి.