Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్మాత గునీత్ మోంగా ది లంచ్ బాక్స్.. మాసాన్ వంటి ప్రముఖ చిత్రాలకు నిర్మాతగా ఉన్నారు. మహిళలను శక్తి వంతంగా చూపే మరెన్నో డాక్యుమెంటరీలకు ఆమె నాయతక్వం వహించారు. స్త్రీ లోపలి భావాలను వెలికి తీయడంలో ఈమెకు ఈమే సాటి. రుతుస్రావ సమయంలో అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యలను, శానిటరీ నాప్కిన్ల వినియోగం గురించి చక్కగా చూపించిన ఓ డాక్యుమెంటరీకి సహ నిర్మాతగా ఉన్నారు. అలాంటి గొప్ప నిర్మాతకు ఫ్రెంచ్ రెండవ అత్యుత్తమ గౌరవం లభించడం విశేషం.
మోంగా 1983 నవంబర్ 30న పుట్టారు. పుట్టింది, పెరిగింది, చదువుకుంది అంతా ఢిల్లీలోనే. బ్లూ బెల్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రాధమిక విద్యను పూర్తి చేశారు. గురు గోబింద్ సింగ్ ఇంద్రపస్తా యూనివర్సిటీ నుండి మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ అందుకున్నారు. 2003లో సహ నిర్మాతగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2006లో ముంబయి వచ్చేశారు. 2007లో 'సే సలావమ్ ఇండియా' అనే ఓ క్రికేట్ ప్రాధాన్యం కలిగిన సినిమాకు పని చేశారు. ఇలా కొన్ని సినిమాలకు పని చేసి 2009లో అనురాగ్ కాశ్యప్ సంస్థలో చేరారు. ఈమె నిర్మించిన చిత్రాలన్నీ సామాజిక అంశాలతో ముడిపడి ఉండడం విశేషం. మరో ప్రత్యేకత ఏమిటంటే 'సిఖ్యా ఎంటర్టైన్మెంట్' అనే సంస్థకు సీఈఓగా పని చేస్తూ సినీ పరిశ్రమలో మహిళా సాధికరత కోసం ఈమె ఎంతో కృషి చేస్తున్నారు. ఈమె చిత్రాలు జర్మనీ, ఫ్రాన్స్, యుఎస్‌లో కూడా విడుదల అయ్యాయి. ఫ్రాన్స్‌తో కలిసి మోంగా ఎన్నో చిత్రాలను నిర్మించారు.
ఓ ప్రత్యేకమైన క్షణం
'నైట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్' గౌరవాన్ని అందుకోవడం ఓ ప్రత్యేకమైన క్షణం అని ఫ్రెంచ్ సినిమాను ఎంతగానో ఆరాధించే గునీత్ మోంగా అన్నారు. ఫ్రాన్స్ రాయబార కార్యాలయంలో నైట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ గౌరవాన్ని మోంగాకు ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీన్-వైవ్స్ లే డ్రియా ఇటీవలె అందజేశారు. ఆమె ఇండో-ఫ్రెంచ్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ ప్రపంచానికి ఎన్నో చలన చిత్రాలను అందజేశారు. అలాగే తన సినిమాల ద్వారా మహిళా సాధికారత కోసం రాజీలేని పోరాటం చేసే ఓ వ్యక్తిగా కూడా గుర్తింపు పొందారు.
ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలు
మోంగా తన నిర్మాణ సంస్థ అయినటువంటి 'సిఖ్యా ఎంటర్టైన్మెంట్' ద్వారా ఎన్నో ప్రతిష్టాత్మకమైన చిత్రాలను నిర్మించి అనేక ప్రశంసలు పొందారు. ఇదే సంస్థ ద్వారా ఇండో-ఫ్రెంచ్ చిత్రాలకు కూడా నాయకత్వం వహించారు. ఇందులో నటుడు ఇర్ఫాన్ ఖాన్ నటించిన ది లంచ్ బాక్స్, అలాగే మరో నిర్మాత నీరజ్ ఘైవాన్తో కలిసి 2015తోనిర్మించిన 'డ్రామా మాసాన్', 'తాజ్ మహల్' ప్రత్యేకమైన చిత్రాలుగా చెప్పుకోవచ్చు. ఆమె ఇటీవలే నిర్మాత ఏక్తా కపూర్, రచయిత-దర్శకుడు తాహిరా కశ్యప్‌లతో కలిసి సినిమా కలెక్టివ్-ఇండియన్ ఉమెన్ రైజింగ్‌ను కూడా ప్రారంభించారు. 37 ఏండ్ల వయసు గల మోంగా ఓ చిత్రనిర్మాత మహిళా సాధికారత సాధించడమే తన ఏకైక లక్ష్యంగా చెబుతున్నారు. దీనికోసం నిరంతరం కృషి చేస్తున్నానని అంటున్నారు. అంతేకాదు ఇప్పుడు ఆమెకు దక్కిన ఈ గౌరవాన్ని భవిష్యత్ కోసం కలలు కనే ప్రతి అమ్మాయికి అంకితం చేశారు.
లింగ సమానత్వం కోసం
''భారత్, ఫ్రాన్స్ రెండూ దేశాలు సినిమా పట్ల ఒకే అభిరుచిని కలిగి ఉన్నాయి. భారతీయ, ఫ్రెంచ్ మహిళా నిర్మాతలు వారి ఇండో-ఫ్రెంచ్ సహకారంతో ఈ రంగంలో లింగ సమానత్వం కోసం వారు చేస్తున్న కృషిని నేను అభినందిస్తున్నాను. కలెక్టిఫ్ 50/50తో ఈ ఒప్పందం ద్వారా భారతదేశంలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం కూడా తన వంతు పాత్ర పోషిస్తుంది. లింగ సమానత్వం ఫ్రాన్స్ విదేశాంగ విధానానికి ఎంతో ప్రధానం'' అని మంత్రి లే డ్రియాన్ అన్నారు.
ఎన్నో ప్రశంసలు
మోంగా సహకారంతో విడుదలైన 'లంచ్ బాక్స్' సినిమా 66వ కేన్స్ చలన చిత్రోత్సవంలో 'క్రిటిక్స్ వీక్ వ్యూయర్స్ ఛాయిస్' అవార్డును గెలుచుకుంది. ఎన్నో ప్రతిష్టాత్మక ఉత్సవాల్లో ఈమె చిత్రాలు ప్రదర్శించారు, గౌరవించారు. వాటిలో వాసన్ బాలా దర్శకత్వంలో వచ్చిన పడ్లర్స్, అనురాగ్ కశ్యప్ గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్, మాన్సూన్ షూటౌట్ మసాన్ ముఖ్యమైనవి.
ధైర్యంగా ముందుకు పోవాలి
''చెవాలియర్ డాన్స్ ఐఓర్డ్రే డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెట్రెస్'' అనే టైటిల్‌తో సత్కరించడం నాకు చాలా ప్రత్యేకమైనది. నా కంటెంట్‌తో సినిమాలో మహిళల పాత్రలను బలంగా చూపించడానికి నేను నిరంతరం కృషి చేస్తున్నాను. ఈ గౌరవం కేవలం నాకొక్కదానికి దక్కినది కాదు. ఇందులో నాతో పాటు కలిసి పని చేస్తున్న బృందానికి కూడా ఈ గౌరవంలో భాగస్వామ్యం ఉంది. ఈ గౌరవం నా పేరుతోనో నా కుటుంబం పేరుతోనే వచ్చినా దేశంలోని ప్రతి అమ్మాయికి దీన్ని అంకితం చేస్తున్నాను. స్వేచ్ఛగా కలలు కనడం, నిర్భయంగా వాటిని నిజం చేసుకునే విషయంలో అమ్మాయిలు ఎప్పుడూ ముందుండానే నా కోరిక. ప్రపంచం ఏదో సాధించాలనుకునే వారిని ఎప్పుడూ వెనక్కు లాగాలనే చూస్తుంది. దాని కోసం ఎన్నో కుట్ర చేస్తుంది. దానికే నేనే ఓ సాక్ష్యాన్ని. ఎవరు వెనక్కు లాగాలని చూసినా ధైర్యంతో మనం ముందుకే పోవాలి.
- సలీమ