Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితం హాయిగా ప్రశాంతంగా గడవాలంటే కొన్ని మంచి అలవాట్లు ఉండాలని అందరూ చెబుతూ ఉంటారు. పొద్దున్నే లేవడం, రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం, సమతులాహారం తీసుకోవడం వంటివి ఎంతో మేలు చేస్తాయి. అయితే వీటితో పాటూ కొన్ని అలవాట్లని వదుల్చుకోవాలి. అప్పుడే మంచి అలవాట్లు చేసుకున్న ఫలితం పూర్తిగా కనపడుతుంది. మరి వదిలేసే ఆ అలవాట్లేమిటో చూసేద్దామా..
కుదరకపోతే నో చెప్పండి
మీరు చేసే పనులే కాక... ఇంట్లో ఆఫీసులో కూడా మీ మీద ఎక్కువ పనులు పడిపోతున్నాయా? దీనికి కారణం మీరు నో చెప్పలేకపోవడమా అని ఓ నిమిషం ఆలోచించండి. నో చెప్తే అవతలి వారు హర్ట్ అవుతారేమో అన్న ఆలోచనతో వారు మీ మీద తోసేసిన పనికి యస్ చెప్పకండి. మీ పనులు పక్కకి పోతాయి, మీకు ఒత్తిడి ఎక్కువైపోతుంది. అలాగే మీకు నచ్చకపోయినా కొన్ని విషయాలు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నా కూడా మీ ప్రయారిటీస్ పక్కకి వెళ్ళిపోతాయి. ప్రతీదీ నా ఇష్ట ప్రకారమే చేస్తాను అనడం ఎంత అసమంజసంగా ఉంటుందో, ప్రతీదీ ఇంకొకరి ఇష్ట ప్రకారం చేయడం కూడా అంతే అసమంజసంగా ఉంటుందని గుర్తు పెట్టుకోండి.
అడగటానికి సందేహించకండి
మనిషి సంఘ జీవి. ఒకరి మీద ఒకరు పరస్పరం ఆధార పడకుండా మనిషి జీవించలేడు. అలాగే ఒకరి సహాయం కూడా ఇంకొకరికి అవసరం. మీకు సహాయం అవసరమైనప్పుడు అడగటానికి సందేహించకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ సహాయంతో మీ సమస్యలని ఎదుర్కోండి. మీరు ఒంటరి కాదు, అది గమనించండి. మీరు ఇంకొకరికి సహాయం చేసే ఉంటారు కదా, మీకు అవసరమైనప్పుడు మీరు మరొకరి సహాయం అడగడం, తీసుకోవడం సహజంగా జరిగే విషయాలే. వాటికి ఫీల్ అవ్వకండి.
మీ శక్తి విలువైనది
మీ శక్తి మీకు ఎంతో విలువైనది. దాన్ని ఏ విషయాల్లో ఎవరి మీద ఖర్చు పెట్టాలో జాగ్రత్తగా ఆలోచించుకోండి. మిమ్మల్ని నెగటివ్‌గా ఇంఫ్లుయెన్స్ చేసే వారి మీద మీ ఎనర్జీని వినియోగించకండి. వారు సంతోషంగా ఉండి పక్క వారి సంతోషాన్ని కోరుకునే వారి సమక్షంలో ఉండండి. మీ జీవితం బాగుండాలని వారు మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అందుకు వారు చేయగలిగిన సాయం ఏమైనా ఉంటే వెంటనే చేస్తారు. అన్నింటి కన్నా ముందు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు.
మితిమీరితే ప్రమాదం
అతి ఎప్పటికీ అనర్థమే అనేది సోషల్ మీడియా వాడకం విషయంలో బాగా పని చేస్తుంది. సోషల్ మీడియా ద్వారానే మనం ఎంతో మందితో కనెక్ట్ అవుతున్నాం, విషయాల మీద భిన్నాభిప్రాయాలు తెలుసుకుంటున్నాం. ఇదంతా మంచిదే, కానీ ఇది మితి మీరితేనే ప్రమాదం, సోషల్ మీడియాలో ఎక్కువసేపు గడపడం వల్ల మనకి తెలియకుండానే మనలో కొన్ని మార్పులు జరిగిపోతాయని, అవి మన మానసిక శారీరక ఆరోగ్యానికి అంత మంచివి కావనీ నిపుణులు అంటున్నారు.
పోల్చుకోవద్దు
పోటీ ఆరోగ్యకరమే కానీ పోలిక అనారోగ్యకరం. మీరు మీరే, మీలా ఇంకొకరు ఉండరు. కాబట్టి మీ జీవితాన్ని ఇంకొకరి జీవితంతో పోల్చుకోవడం అనవసరం. అదీ కాక ప్రతి ఒక్కరి జీవితంలోనూ వారికే పరిమితమైన, వారికే ప్రత్యేకమైన సుఖ దుఃఖాలూ, లాభ నష్టాలూ ఉంటాయి. మనకి కనిపించడంలేదు కాబట్టి వారికి అవి లేవని అనుకోకూడదు. మీ ఆలోచనలనీ, మీ శక్తి యుక్తులనీ మీరు ఇంకా చక్కగా జీవించడానికి వినియోగించుకోండి.
వాయిదాలు వద్దు
ఇవాళ అంత ఉత్సాహంగా లేదు.. రేపెలాగా ఆదివారమే కాబట్టి సోమవారం నించీ ఈ పని మొదలు పెడదాం వంటి వాయిదాలు మనని ముందుకు సాగనీయవు. ఏ పనైనా మొదలు పెట్టే వరకే భయంగా ఉంటుంది. మొదలు పెట్టిన తర్వాత ఇంత చిన్న దాని కోసమా మనం అంత ఆలోచించాం అనిపిస్తుంది.
మీ పట్ల నిర్లక్ష్యం వద్దు
ఎవరినో కాదు మనని మనమే. మన ఆరోగ్యం గురించి ఆలోచించకపోవడం, సెల్ఫ్ కేర్ లేకపోవడం, ఒత్తిడి తట్టుకోలేక కొన్ని వ్యసనాలు అలవాటు చేసుకోవడం వంటివన్నీ మనని మనం నిర్లక్ష్యం చేసుకోవడం కిందకే వస్తాయి. ఈ అలవాట్లకి ఎంత త్వరగా దూరమైతే అంత మంచిది.
సమయం వృధా చేసుకోవద్దు
టీవీ సీరియల్స్ అయితేనేమి, సినిమాలైతేనేమి మీ విలువైన సమయాన్ని వీటి మీద మరీ ఎక్కువగా ఖర్చు పెట్టకండి. వినోదం అవసరమే కానీ, మీ ఇతర పనులనీ, ఫ్యామిలీతో మీరు గడిపే సమయాన్నీ పక్కన పెట్టేసేంత అవసరం కాదు. వీటి మీద మీరు గడిపే సమయాన్ని ఇంకా ప్రొడక్టివ్‌గా గడపవచ్చేమో చూడండి.
కొత్తను చూసి భయపడొద్దు
కంఫర్ట్ జోన్ ఎంత కంఫర్టబుల్‌గా ఉన్నా కొంత కాలం తర్వాత సఫొకేటింగ్‌గా కూడా మారే ప్రమాదం ఉంది. అందరికీ ఇలా జరుగుతుందని చెప్పలేం కానీ, కొంత మంది ఆ కంఫర్ట్ జోన్లో నుండి బయటకి రావడాన్ని ఇష్టపడుతూ ఉంటారు. అందుకే కొత్తది ట్రై చేయడానికి తయారుగా ఉండండి. అదే సమయంలో దాని వల్ల ఏవైనా అనుకోని ప్రాబ్లమ్స్ వస్తే ఎదుర్కోవడానికి తగినంత సపోర్ట్ సిస్టమ్‌ని కూడా ఏర్పాటు చేసుకోండి.