Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేసవి కాలం వస్తూ వస్తూనే ఎంతో ఇబ్బందిని తీసుకొస్తుంది. డీహైడ్రేషన్, తలనొప్పి, చెమట వంటి సమస్యలు ఎన్నింటినో మోసుకొస్తుంది. చల్లగా ఇబ్బంది పెట్టే చలి నుంచి కాస్త రిలీఫ్ ఇచ్చినా ఈ ఎండాకాలంలో ఎదురయ్యే సమస్యల నుంచి మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకు ఎక్కువగా నీళ్లు తాగడం ముఖ్యమైనది. అన్నింటికంటే ప్రధానమైన ఈ అంశాన్ని పాటిస్తున్నామని నిర్ధారించుకున్న తర్వాత సీజనల్ ఫుడ్స్ ద్వారా ఎండ వేడి నుంచి తప్పించుకునే వీలుంటుంది. వేసవి కాలంలో ఆరోగ్యకరమైన సీజనల్ ఫుడ్ తినాలంటే ఈ కొన్ని ఆహార పదార్థాలను మీ డైట్లో భాగం చేసుకోవాలి. ఇవి మీ శరీరాన్ని చల్లబరుస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తాయి. ఇందుకోసం ఈ రకమైన ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది.
పుచ్చకాయ: వేసవిలో ఎక్కువగా లభించే సీజనల్ ఫ్రూట్స్‌లో ఇది ఒకటి. దీన్ని తీసుకోవడం ఎంతో అవసరం. ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా అద్భుతమైన పండు. ఇందులోని లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, బి6, సి, పొటాషియం, అమైనో యాసిడ్లు వంటివి ఆరోగ్యాన్ని కాపాడతాయి.
సెలరీ: సెలరీని సాధారణంగా సలాడ్‌లో భాగంగా తీసుకోవడం చాలామందికి ఇష్టం. వేసవిలో దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల పోషకాలతో పాటు నీరు కూడా అందుతుంది. వేసవిలో ఉదయాన్నే సెలరీ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. పైగా ఇందులో 95 శాతం నీళ్లే కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
కాలీఫ్లవర్: క్రూసిఫెరస్ కుటుంబానికి చెందిన ఈ కూరగాయల్లో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో మరెన్నో మినరల్స్, మైక్రో న్యూట్రియంట్లు కూడా ఉంటాయి. ఇందులో నీటి శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే వీటిని తీసుకోవడం వల్ల ఎంతో చలువ చేస్తుంది.
కీర దోస: వేసవిలో తప్పక తీసుకోవాల్సిన కూరల్లో కీర దోస ఒకటి. దీన్ని అలాగే తినేయొచ్చు. లేదా కాస్త నిమ్మరసం, ఉప్పు వేసుకొని తింటే ఇంకా రుచిగా ఉంటుంది. ఇది మనల్ని రోజంతా హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మ ఛాయను పెంచుతుంది. తక్కువ తిన్నా కూడా కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. శరీరంలోని టాక్సిన్లను కూడా బయటకు పంపించేస్తుంది.
పెరుగు: పెరుగును రోజూ తీసుకోవడం వల్ల ఇది మీ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వేసవిలో తినేందుకు ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో కాస్త ఉప్పు వేసుకొని రైతాలాగా తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీ ఫ్రోజెన్ యోగర్ట్ వంటివి తినాలనిపిస్తే పెరుగును ఫ్రిజ్ లో పెట్టుకొని చల్లగా తినడం మంచిది. దీనివల్ల పోషకాలు నిండిన స్నాక్ తినే వీలుంటుంది.
ఈ పదార్థాలే కాకుండా వేసవిలో ఎక్కువగా లభించే పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది.