Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏండ్లు గడుస్తున్నా మహిళలు ఆ మూడు రోజులు భరించే రుతుస్రావ సమస్య బయటకు చెప్పుకోలేని ఓ రహస్యంగానే మిగిలిపోతుంది. అ సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడేవారు ఉండరు. ముఖ్యంగా గ్రామీణ, నిరుపేద అమ్మాయిలు, మహిళలకు ఆ సమయంలో పాటించవలసిన పరిశుభ్రత గురించి అస్సలు తెలియదు. శానిటరీ నాప్కిన్స్ వాడొచ్చు అనే సంగతే తెలియని వారు ఉన్నారు. అలాంటి వారికోసం కాశ్మీర్‌కు చెందిన ఈ 'ప్యాడ్ ఉమెన్' ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లను పంపిణీ చేస్తుంది. ఆమే ఇర్ఫానా జర్గర్... ఆమెకు అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందో తెలుసుకుందాం...
శ్రీనగర్‌లోని నౌషెహర్ అనే లోయకు చెందిన ఇర్ఫానా జర్గర్ తండ్రి కొన్నేండ్ల కిందట మరణించాడు. ఆయన కన్నుమూసిన తర్వాత ఆయన జ్ఞాపకార్థంగా తన సొంత లోయలో ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకుంది.
తండ్రి జ్ఞాపకార్థం
జ్ఞాపకార్థం ఆర్థికంగా వెనుకబడిన పేద మహిళలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్లు పంచాలని అనుకుంది. నగరంలోని యువతులకు శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేసే మిషన్ ప్రారంభించింది. దీన్ని ప్రారంభించిన కొంత కాలానికి వాటి అవసరం మహిళలకు ఎంతగా ఉందో ఆమెకు అర్థమయింది. శానిటరీ ప్యాడ్లు వాడకపోవడం వల్ల ఎలాంటి అనారోగ్యాలకు గురౌతున్నారో స్వయంగా తెలుసుకుంది. దాంతో నాప్కిన్లను పంపిణీ చేయడం ఆమెకు ఓ ప్యాషన్‌గా మారిపోయింది.
ఏడు నెలల్లో పదివేల మందికి...
ఇరవై ఎనిమిదేళ్ల ఇర్ఫానా ఇప్పుడు నౌషెహర్ లోయలో మంచి గుర్తింపు పొందిన మహిళగా మారిపోయింది. గత ఆరు సంవత్సరాలుగా ఆమె కాశ్మీర్‌లోని వందలాది మంది మహిళలకు ఉచిత శానిటరీ న్యాప్కిన్లను అందిస్తోంది. శ్రీనగర్‌లో ప్రభుత్వం నిర్మించిన మరుగుదొడ్ల వద్ద శానిటరీ కిట్లను ఏర్పాటు చేసి మహిళలకు వాటిని అందుబాటులో వుంచుతుంది. గత ఏడు నెలల కాలంలోనే ఆమె 10,000 మందికి పైగా శానిటరీ ప్యాడ్లను ఆమె పంచిపెట్టింది.
కాశ్మీర్‌కే పరిమితం కాదు
శ్రీనగర్ అంతటా ప్రభుత్వ మరుగుదొడ్ల వద్ద పేద మహిళలకు ఉచిత శానిటరీ ప్యాడ్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇర్ఫానా. ఆమె ఇస్తున్న రుతుస్రావ కిట్‌లో శానిటరీ నాప్కిన్లు, యాంటిస్పాస్మోడిక్స్, హాండ్వాష్తో పాటు శుభ్రమైన లోదుస్తులు, వాటిని శుభ్రం చేసుకునే శానిటైజర్లు ఉంటాయి. తన ఈ కార్యక్రమాలను కేవలం కాశ్మీర్‌కే పరిమితం చేయకుండా సుదూర ప్రాంతాల్లోని నిరుపేద మహిళలకు కూడా నాప్కిన్స్ పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
నిరుపేద మహిళలకు
కరోనా వల్ల లాక్డౌన్ విధించడంతో చాలా మంది ఒంటరి మహిళలు, వికలాంగులు, వితంతువులు ఈమెను కలిసి సహాయం చేయమని కోరారు. ''కోవిడ్-19 లాక్డౌన్ కారణంగా నిరుపేద మహిళల ఆర్థిక సమస్యలు రెట్టింపు అయ్యాయి. ఎందుకంటే చేసేందుకు పని లేదు. దాంతో వారి ఆదాయ వనరులన్నీ ఆగిపోయాయి. వారంతా శానిటరీ కిట్ల కోసం ఆమె ఇంటికి వెళ్ళేవారు. కొంతమంది అమ్మాయిలు బాలికలు వారి తల్లిదండ్రులను న్యాప్కిన్ల కోసం ఆమె వద్దకు పంపేవారు.
సోషల్ మీడియా ద్వారా
ఇర్ఫానా తన సేవలు మరింత మందికి అందాలనీ, రుతుస్రావ సమయంలో తీసుకోవల్సిన శుభ్రత గురించి వివరించాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో అకౌంట్ ప్రారంభించింది. ఎంతో మంది ఆమెకు ఫోన్లు, మెసేజ్‌ల ద్వారా కూడా శానిటరీ ప్యాడ్స్ అడుగుతుంటారు. దూర ప్రాంతాల వారికి ఆమే వాటిని చేరవేస్తుంది.
ఓ నిషిద్ధ అంశం
కాశ్మీర్ లోయలోని చాలా మంది అమ్మాయిలు, మహిళలు రుతుస్రావం సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి అస్సలు మాట్లాడుకోరు. ఇప్పటికీ అక్కడ ఇది ఓ నిషిద్ధ అంశం. రుతు పరిశుభ్రత, మహిళల ఆరోగ్యం, చిన్నపిల్లలకు పీరియడ్ ప్రొడక్ట్స్ అందుబాటులో లేనప్పుడు వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చాలా తక్కువగా చర్చ జరుగుతుంది. అలాంటి చోట ఇర్ఫానా వంటి మహిళా ధైర్యంగా ఇలాంటి కార్యక్రమం చేపట్టడం గొప్ప విషయం.
మహిళల భద్రతకై తెరచిన తలుపు
నా తండ్రి గులాం హసన్ 2014లో గుండెపోటుతో మరణించారు. శ్రీనగర్ మునిసిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసి)లో నేను ఓ కాంట్రాక్టు ఉద్యోగిని. వచ్చే జీతం తక్కువ. అయినప్పటికీ నేను ఏ ప్రభుత్వేతర సంస్థ (ఎన్జిఓ) నుండి నిధులు సేకరించడం లేదు. ఎవ్వరినీ ఫండ్స్ అడగడం లేదు. నాకు వచ్చే జీతం నుండే కొంత డబ్బును ఆదా చేసి శానిటరీ కిట్‌ను మహిళలకు పంపిణీ చేస్తున్నాను. నేను చేస్తున్న ఈ కార్యక్రమానికి 'ఎవా సేఫ్టీ డోర్' అని పేరు పెట్టాను. ''ఎవా' అంటే 'మహిళలు' అని అర్థం. అలాగే 'సేఫ్టీ డోర్'' అంటే 'భద్రతా తలుపు'. మహిళల భద్రతకు తెరిచే తలుపు అని దీని అర్థం.